'ప్రపంచపటంలో పాకిస్తాన్ ఉండదు'
జమ్మూ: కశ్మీర్‌లో అశాంతికి కారణమవుతున్న పాకిస్తాన్.. ఇదే ధోరణిని కొనసాగిస్తే ప్రపంచపటం నుంచి కనుమరుగయ్యే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ అన్నారు. సాంబా జిల్లాలోని రాజిందర్ పూరా గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ‘సర్జికల్ దాడుల తర్వాత బుద్ధి తెచ్చుకోకుండా భారత ఆర్మీ ఔట్‌పోస్టులపై దాడి చేస్తోంది. మిలిటెంట్ల చొరబాట్లకు సహకరిస్తూ.. కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఇలాగే కొనసాగితే పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన నాటి పరిస్థితులు పునరావృతమవుతాయి’ అని విమర్శించారు.
పాకిస్తాన్ విఫల దేశమని, జమ్మూకశ్మీర్ ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఉడీ సైనిక స్థావరంపై ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా ఏకాకిని చేశారని, దీంతో పాకిస్థాన్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నారు.