
హోటల్‌లో ఉల్లిగడ్డల చోరీ
కాటేదాన్ : ఉల్లి బంగారమైంది...ధర చుక్కలను తాకడంతో ఉల్లి గడ్డల చోరీలు కూడా జరుతున్నాయి. హోటల్‌లో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులను పక్కనపెట్టి ఉల్లిగడ్డ సంచిని ఎత్తుకెళ్లిన ఘటన కాటేదాన్ పారిశ్రామికవాడలో జరిగింది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటన వివరాలు... కాటేదాన్ పారిశ్రామికవాడలోని రవిఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీ ప్రాంతంలో బాలప్ప అనే వ్యక్తి గుడిసె ఏర్పాటు చేసి హాటల్ నిర్విహ స్తున్నాడు. సోమవారం హోటల్‌ను మూసివెళ్లిన తర్వాత అర్ధరాత్రి దొంగలు తలుపులు పగులగొట్టి హోటల్‌లోకి చొరబడ్డారు.
హోటల్‌లో టీవీ, ఫ్రిడ్జ్, గ్రైండర్, మిక్సీ వంటి విలువైన వస్తువులు ఉన్నప్పటికీ దొంగలు వాటిని పట్టుకెళ్లకుండా అక్కడ ఉన్న 40 కిలోల ఉల్లిగడ్డ సంచిని, రూ.7 వేల నగుదును ఎత్తుకెళ్లారు. ఉదయం హోటల్‌కు వచ్చిన బాలప్ప ఈ విషయం గమనించి స్థానికులకు చెప్పడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఉల్లిగడ్డ ధర మార్కెట్‌లో ఆకాశాన్నంటడంతో ఉల్లి దొంగతనం ఆసక్తిగా మారింది.