బంగారమంటూ పూసల దండలు..! | online thief arrested in hyderabad | Sakshi
Sakshi News home page

బంగారమంటూ పూసల దండలు..!

Published Fri, Feb 19 2016 3:57 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM

బంగారమంటూ పూసల దండలు..!

బంగారమంటూ పూసల దండలు..!

ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించడం.. టెలీకాలర్లతో ఫోన్లు చేయించడం.. మూడు గ్రాముల బంగారం అంటూ ఎర వేయడం..

రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వేల మందికి టోకరా
‘సాక్షి మీడియా’ సమాచారంతో ఘరానా మోసగాడి గుట్టురట్టు

సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్ నుంచి ఫోన్ నంబర్లు సేకరించడం.. టెలీకాలర్లతో ఫోన్లు చేయించడం.. మూడు గ్రాముల బంగారం అంటూ ఎర వేయడం.. వేల మంది నుంచి రూ.వందల్లో వసూలు చేయడం.. ఈ పంథాలో రెండేళ్లుగా భారీ మొత్తంలో దోచుకుంటున్న ఘరానా నేరగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. రూ.4 కోట్లకుపైగా లావాదేవీలు నెరపిన ఇతగాడి వ్యవహారం ‘సాక్షి మీడియా’ ఇచ్చిన సమాచారంతో తమ దృష్టికి వచ్చిందని సంయుక్త పోలీస్ కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పి.వీరభద్రరావు 2012లో బంజారాహిల్స్‌లో ప్లానెట్ ఐ ట్రేడర్స్ సంస్థను స్థాపించాడు. దీని రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టిఫీషియల్ నగలతో పాటు ఆయుర్వేద, హెర్బల్ ఉత్పత్తులు విక్రయిస్తామని పేర్కొన్నాడు. అయితే సంపాదన అద్దెలు, జీతాలకే సరిపోకపోవడంతో వ్యాపారాన్ని ‘విస్తరించాలని’ నిర్ణయించుకున్నాడు.

 ఆన్‌లైన్ నుంచి నంబర్లు సేకరించి..
ప్రజలకు టోకరా వేసి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేసిన వీరభద్రరావు 30 మంది టెలీకాలర్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఓఎల్‌ఎక్స్, క్వికర్ వెబ్‌సైట్ల నుంచి కొన్ని మొబైల్ నంబర్లు సేకరించే వాడు. ఒక్కో నంబర్‌ను ఎక్సెల్ షీట్‌లో పొందుపరచడం ద్వారా ఆ సిరీస్‌లో ఉన్న వెయ్యి నంబర్లు సృష్టించేవాడు. వీటిని కంప్యూటర్ ఆధారంగా పనిచేసే సర్వర్‌లో డేటాబేస్‌గా నిక్షిప్తం చేసి.. గేట్ వేలతో అనుసంధానించే వాడు. ఒక్కో గేట్‌వేలో 32 సిమ్‌కార్డులను పెట్టుకోవచ్చు. సర్వర్ ఆధారంగా పని చేసే గేట్‌వేలు డేటాబేస్‌లో ఉన్న నంబర్లలో ఒకదాని తర్వాత మరోదానికి చొప్పున ఆటోమేటిక్‌గా కాల్స్ చేసేవి. అలా వెళ్లిన కాల్స్ టెలీకాలర్స్‌కు కనెక్ట్ కావడంతో వారు అవతలి వ్యక్తులతో సంప్రదింపులు జరిపేవారు.

బంగారమంటూ పూసల దండలు..
లక్కీ డ్రాలో మీ సెల్ నంబర్‌కు రూ.6 వేల విలువైన మూడు గ్రాముల బంగారం తగిలిందంటూ టెలీకాలర్లు చెప్పేవారు. ఆకర్షితులైన వారితో దీన్ని క్లైమ్ చేసుకోవడానికి రూ.600, పోస్టల్ చార్జీల నిమిత్తం రూ.42 చెల్లించాలంటూ చెప్పేవాడు. అంగీకరించిన వారికి చార్మినార్ ప్రాంతంలో కొన్న రూ.20 విలువైన పూసల దండల్ని పార్సిల్ చేసి పంపేవాడు. ఈ పార్సిల్స్‌ను వీపీఎల్ పద్ధతిలో పంపడంతో వినియోగదారులు సంబంధిత పోస్టాఫీసులకు వెళ్లి రూ.642 చెల్లించి తీసుకునేవారు.

 రూ. 4 కోట్లకు పైగా వసూలు...
రెండేళ్లుగా దేశవ్యాప్తంగా వేల మందిని వీరభద్రరావు ఇలా మోసం చేశారు. ఈ మొత్తం రూ.4 కోట్ల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇతడి వ్యవహారాలపై ‘సాక్షి మీడియా’ బుధవారం సీసీఎస్‌కు సమాచారం ఇచ్చింది. బి.శ్రీకాంత్ నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసిన సైబర్‌క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ కేసీఎస్ రఘువీర్, ఇన్‌స్పెక్టర్ డి.శంకర్‌రాజు, ఎస్సై డి.ప్రశాంత్ బృందం కాల్‌సెంటర్‌పై దాడి చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు గేట్‌వేలు, సిమ్‌కార్డులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఐటీ యాక్ట్‌తో పాటు టెలిగ్రాఫిక్ యాక్ట్ కిందా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement