ఈడీ అత్యుత్సాహంపై హైకోర్టుకు మరికొన్ని కంపెనీలు
- సానుకూల ఉత్తర్వులిచ్చిన న్యాయస్థానం
- అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీలుకు వాటికి 45 రోజుల గడువుంది
- అప్పటివరకు తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఈడీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అడ్జుడికేటింగ్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా తమ కంపెనీల డిపాజిట్లు, ఆస్తులను బదలాయింపు చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అత్యుత్సాహం చూపుతున్న నేపథ్యం లో మరికొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్ర యించాయి. ఇవి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లేందుకు ఈ కంపెనీలకు 45 రోజుల వరకు గడువున్న నేపథ్యంలో వాటిపై తదుపరి చర్యలేవీ తీసు కోవద్దని ఈడీని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజాఇలంగో బుధ వారం ఉత్తర్వులు జారీచేశారు. ఈడీ ప్రాథ మిక జప్తును ఖరారు చేస్తూ అడ్జుడికేటింగ్ అథారిటీ గత నెల 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీటికనుగుణంగా ఆయా కంపెనీల డిపాజిట్లను, ఆస్తుల్ని తమ పేరున బద లాయింపు చేసుకునేందుకు ఈడీ అత్యుత్సా హం చూపుతూ వస్తోంది.
అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీలుకు వెళ్లేందుకు 45 రోజుల గడువున్నా, ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్స్ కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిలతోపాటు కొన్ని కంపెనీలు హైకోర్టును ఆశ్రయించి సానుకూల ఉత్తర్వులు పొందాయి. ఈ నేపథ్యంలో రేవన్ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, క్యాప్‌స్టన్ ఇన్‌ఫ్రా, హరీష్ ఇన్‌ఫ్రా, సరస్వతి పవర్, సిలికాన్ ఇన్‌ఫ్రా తదితర కంపెనీలు కూడా బుధవారం హైకోర్టును ఆశ్రయించాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులపై అప్పీలు దాఖలు చేసుకుని, అందులో స్టే పిటిషన్‌పై అప్పిలేట్ అథారిటీ నిర్ణయం వెలువరిం చేంత వరకు పిటిషనర్లపై తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఈడీని ఆదేశించారు.