ఐదు పట్టణాలకు ఔటర్ ‘రింగ్’లు | Outer ring roads to be formed for five cities in telangana | Sakshi
Sakshi News home page

ఐదు పట్టణాలకు ఔటర్ ‘రింగ్’లు

Published Mon, Jul 11 2016 2:00 AM | Last Updated on Fri, Oct 5 2018 9:08 PM

ఐదు పట్టణాలకు ఔటర్ ‘రింగ్’లు - Sakshi

ఐదు పట్టణాలకు ఔటర్ ‘రింగ్’లు

- వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ చుట్టూ ఓఆర్‌ఆర్
 సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగు రోడ్డు.. ఈ పేరు వినగానే వెంటనే హైదరాబాద్ నగరం చుట్టూ ఎనిమిది వరుసల విశాలమైన రహదారి మనసులో మెదులుతుంది! దేశంలోనే ఎనిమిది వరుసల తొలి ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఇప్పుడు రాష్ట్రంలోని రెండో శ్రేణి నగరాలకూ ఔటర్ రింగు రోడ్లు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ నగరాలకు ఔటర్ రింగు రోడ్లు మంజూరయ్యాయి. వీటన్నింటికంటే ముందు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణానికి ఔటర్ రింగురోడ్డు రూపుదిద్దుకోబోతోంది. వచ్చే నెలలోనే పనులు మొదలు కాబోతున్నాయి. ఆ తర్వాత రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో పనులు మొదలు కానున్నాయి. ఈ రెండు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరిపాలన అనుమతులు జారీ చేసింది. మిగతా నగరాలకు ఈ సంవత్సరం చివరికల్లా డీపీఆర్‌లు సిద్ధం చేసి వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో పనులు ప్రారంభించే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.
 
 గుజరాత్ ఆదర్శంగా..
 అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్న గుజరాత్‌ను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ఈ రింగురోడ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దేశంలోనే మెరుగైన రోడ్డు కనెక్టివిటీ ఉన్న గుజరాత్.. పెట్టుబడులను విపరీతంగా సాధిస్తోంది. తెలంగాణ కూడా పెట్టుబడులను ఆకర్షించాలంటే రోడ్డు నెట్‌వర్క్ మెరుగ్గా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం.. రూ.11 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు వరుసల రహదారులను నిర్మిస్తోంది. దీనికి తోడు పొరుగు రాష్ట్రాలతో అనుసంధానమయ్యేలా కొత్తగా దాదాపు 1,800 కి.మీ. జాతీయ రహదారులను కూడా సాధించింది. ఇప్పుడు ప్రధాన నగరాలకు ఔటర్ రింగురోడ్లు నిర్మించేందుకు సమాయత్తమైంది.
 
 గ జ్వేల్‌కు మహర్దశ
 గజ్వేల్‌కు నాలుగు వరుసల ఎక్స్‌ప్రెస్ వేతో ఔటర్ రింగురోడ్డు ఏర్పాటు కాబోతోంది. ఒకవైపు హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారి, మరోవైపు హైదరాబాద్-నిజామాబాద్ జాతీయ రహదారి.. ఆ రెంటిని అనుసంధానించే రోడ్డు గజ్వేల్ మీదుగా ఉండటంతో ఈ పట్టణంలో కొంతకాలంగా ట్రాఫిక్ చిక్కులు పెరిగిపోయాయి. ఇప్పుడు వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలు పట్టణంలోకి రాకుండానే ఔటర్ రింగు రోడ్డు మీదుగా వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పట్టణాల చుట్టూ 23 కిలోమీటర్ల నిడివితో ఔటర్ రింగు రోడ్డుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
 
 ఇది రాజీవ్ రహదారిపై హైదరాబాద్ వైపు ప్రజ్ఞాపూర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో మొదలై గజ్వేల్-తూప్రాన్ రోడ్డు, గజ్వేల్-చేగుంట రోడ్డు, గజ్వేల్-రామాయంపేట రోడ్డు, గజ్వేల్ -వెంకటరావుపేట రోడ్డులను అనుసంధానిస్తూ మళ్లీ రాజీవ్ రహదారిని సిద్దిపేట వైపు క్రాస్ చేస్తుంది. అక్కడ్నుంచి ప్రజ్ఞాపూర్- జగదేవపూర్ రోడ్డును దాటి చుట్టూ తిరిగి మళ్లీ రాజీవ్ రహదారికి కలుస్తుంది. ఈ రింగు రోడ్డు నిర్మాణానికి రూ.160 కోట్లు ఖర్చవుతుంది. రింగు రోడ్డు లోపలి వైపు అన్ని రహదారులను కూడా నాలుగు లేన్లకు విస్తరిస్తారు. అందుకు మరో రూ.45 కోట్లు వ్యయమవుతుందని తేల్చారు. అధికారులు ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభించారు. వచ్చే నెలలో ప్రధాన పనులను మొదలుపెట్టాలని యోచిస్తున్నారు.
 
 ఖమ్మం రింగు రోడ్డుకు రూ.700 కోట్లు
 ఖమ్మం రింగు రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.700 కోట్ల వరకు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రోడ్డు నిడివి, మార్గంపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఏడాది చివరి నాటికి పనులు మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాదిలోనే గజ్వేల్, వరంగల్, ఖమ్మం రింగురోడ్డు పనులు పట్టాలెక్కనున్నందున రెండో దశలో వచ్చే ఏడాది కరీంనగర్, నిజామాబాద్ నగరాల ఔటర్ రింగు రోడ్డు పనులు మొదలు కానున్నాయి.
 
 హైదరాబాద్ తర్వాత వరంగల్
 హైదరాబాద్ తర్వాత  రెండో పెద్ద రింగురోడ్డు వరంగల్ చుట్టూ నిర్మించనున్నారు. దీనికి రూ.1,010 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇది నగరం చుట్టూ 72 కిలోమీటర్ల నిడివితో రూపుదిద్దుకోనుంది. నగరం వెలుపల ఏడు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్-వరంగల్ హైవేపై మొదలవుతుంది. అక్కడ్నుంచి వరంగల్-కరీంనగర్ రోడ్డు, వరంగల్-ములుగు రోడ్డు, వరంగల్-నర్సంపేట రోడ్డు, వరంగల్ ఆర్‌సీఎం రోడ్డు, వరంగల్-ఖమ్మం రోడ్డులను క్రాస్ చేస్తూ తిరిగి వరంగల్-హైదరాబాద్ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. ఈ 72 కిలోమీటర్ల విస్తీర్ణంలో 29 కిలోమీటర్ల నిడివిని భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు అప్పగించారు. మిగతా 43 కి.మీ. రోడ్డును రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement