
ఫొటోల కోసం పెద్దరాళ్లు ఎక్కారు..
సనత్‌నగర్: ‘అందరం అక్కడి నదీపరివాహక అందాలను చూసి మురిసిపోయాం. అక్కడి అందాల నడుమ ఫొ టోలు దిగి జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకోవాలని బియాస్ నది వద్దకెళ్లాం..అక్కడ తారసపడిన పలువురిని నదిలోతును, ప్రవాహతీరు గురించి వాకబు చేస్తే ఫర్వాలేదని చెప్పారు. అందరం గ్రూపులుగ్రూపులుగా ఫొటోలు దిగుతున్నాం. ఎక్కువమంది ఎతైనరాళ్లపై నుంచి ఫొటోలు దిగితే బాగా వస్తాయని భావించి చిన్నరాళ్లను ఆసరా చేసుకొని అక్కడికి వెళ్లారు.
ఇంకొందరు చిన్నరాళ్లపైనుంచే ఫొటోలు దిగారు. ఇంత లో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో పెద్దపెద్ద రాళ్లపై ఉన్నవారంతా కొట్టుకపోయారు. కిరణ్ అనే సహ విద్యార్థి తనను పట్టుకొని ఉన్న ప్రత్యూష, రిషికలను ఒడ్డుకు చేర్చాడు. అక్కడి స్థానికులు సైతం తమ ను గమనించి కాపాడేయత్నంలో భాగంగా తాడు వేసి మరో ముగ్గురిని కాపాడారు. కళ్లముందే తమ స్నేహితులు గల్లంతైపోవ డం షాక్ గురి చేసిందని’ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని పర్వతనేని నవ్య కన్నీటిపర్యంతంతో జరిగిన ఘటనను వివరించింది.