మొక్క నాటగానే సంబురం కాదు
సాక్షి, హైదరాబాద్ : మొక్క నాటగానే సంబురం కాదని, అవి పెరిగి పెద్దగా అవడం ముఖ్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మొక్కలను బతికించడం కోసం జిల్లాల వారీగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను బతికించి, పెరిగేందుకు తగిన కార్యాచరణను అనుసరించాలని సూచించారు. హరితహారంపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఇతర అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న హరితహారం కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలంతా ఇందులో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘హరితహారం కింద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. వాటిని కాపాడే విషయంలోనూ అంతే శ్రద్ధగా వ్యవహరించాలి. కలెక్టర్లతో సీఎస్ సమన్వయం చేసుకుని రాష్ట్రవ్యాప్త కార్యాచరణ తయారు చేయాలి. ప్రతి ప్రభుత్వ శాఖ పరిధిలో నాటుతున్న మొక్కలకు నీళ్లు పోయడం, రక్షించడం కూడా సంబంధిత అధికారులే తీసుకోవాలి..’’ అని సీఎం సూచించారు. ప్రతి జిల్లాలో హరితహారాన్ని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, కార్యాచరణ రూపొందించి అమలు చేయడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక పంపాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..
హరితహారం కార్యాచరణపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కలెక్టర్లకు ప్రత్యేక మెమో జారీ చేశారు. జిల్లాను సెక్టార్లుగా విభజించి సూక్ష్మస్థాయి ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వర్షాలు కురవని రోజుల్లో మొక్కలకు నీరెలా అందిస్తారో కార్యాచరణ రూపొందించి, దానిని అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి పంపించాలని ఆదేశించారు. దీనిపై వారానికోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తామని తెలిపారు. మొక్కలను బతికించడానికి జిల్లాలు, డివిజన్‌లలో అందుబాటులో ఉన్న ఫైరింజన్‌లను కూడా వినియోగించుకుని నీళ్లు పోయాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని మంచినీటి ట్యాంకర్లను కూడా మొక్కలకు నీరు పోసేందుకు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పోలీస్ శాఖ సైతం మొక్కలను బతికించేందుకు వర్షాలు లేని సమయంలో నీటి సదుపాయం కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని డీజీపీని కోరారు.
10 జిల్లాలో 7.50 కోట్ల మొక్కలు
వారం రోజుల హరితహారంలో ఆదిలాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో శుక్రవారం నాటికి కోటీ ఎనిమిది లక్షలకు పైగా మొక్కలు నాటారు. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ప్రాతి నిథ్యం వహిస్తున్న ఆదిలాబాద్ అగ్రస్థా నం దక్కించుకోవడం గమనార్హం. రెండోస్థానంలో నిజామాబాద్ జిల్లా నిలవగా, రంగారెడ్డి జిల్లా, గ్రేటర్ హైదరాబాద్‌లు చివరి స్థానాల్లో ఉన్నాయి. మొత్తంగా 10 జిల్లాల్లో కలిపి 7.5 కోట్లకు పైగా మొక్క లు నాటినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.