ప్లాట్‌ఫామ్ టికెట్ ధరకు రెక్కలు!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పండుగ బాదుడు
నేటి నుంచి 26 వరకు అమలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణమధ్య రైల్వే పండుగ బాదుడు షురూ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీని రూ.10 నుంచి అమాంతం రూ.20కి పెంచేసింది. శనివారం నుంచి ఈ నెల 26 వరకు ఈ చార్జీలు అమల్లో ఉంటాయి. అయితే ప్రయాణికుల తాకిడి భారీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఈ స్టేషన్‌లో సాధారణ రోజుల్లో సుమారు 15 వేల ప్లాట్‌ఫామ్ టికెట్లు విక్రయిస్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ రోజుల్లో ఈ సంఖ్య 25 వేల వరకు ఉంటుంది.
ప్రస్తుతం దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని 10 రోజుల పాటు ప్లాట్‌ఫామ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. తద్వారా సాధారణ రోజులతో (రూ.1.5 లక్షలు) పోలిస్తే పెంచిన చార్జీల వల్ల రోజుకు రూ.5 లక్షల ఆదాయం రైల్వేకు లభిస్తుంది. రద్దీనిబట్టి ప్లాట్‌ఫామ్ టికెట్ చార్జీలు పెంచడం ఇదే తొలిసారి. ఈ తరహా పెంపు అధికారాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్‌కు కట్టబెట్టారు. స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉందని భావిస్తే వారు చార్జీ ఎంతైనా పెంచవచ్చు.