సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు జీహెచ్‌ఎంసీని ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషికి కేంద్ర ప్రభుత్వపరిపాలన సంస్కరణలు, ఫిర్యా దుల విభాగం కార్యదర్శి కె.వి.ఈపెన్ నుంచి లేఖ అందింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జీహెచ్‌ఎంసీని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 21న నిర్వహించే సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డును అందుకోవడానికి జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డిని ఆహ్వానించారు.
దేశవ్యాప్తంగా 2,010 నామినేషన్లు..
మొత్తం 13 విభాగాలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలు శాఖాధిపతులు, జిల్లా మేజిస్ట్రేట్లు, ఉన్నతాధికారుల నుంచి 2,010 నామినేషన్లు ప్రధాన మంత్రి ఎక్సలెన్సీ అవార్డుకు అందాయి. మొత్తం ఐదుదశల్లో స్క్రూటినీ చేసిన అనంతరం తుది జాబితాలో ఎంపికైన వారిని కేంద్రక్యాబినెట్ కార్యదర్శి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
ఇం దులో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను గురువారం ఇంటర్వ్యూ చేసి అవార్డుకు ఎంపిక చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీకి అవార్డు రావడంపట్ల మంత్రి కేటీఆర్ ట్వీటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగాన్ని అభినందించారు.
మేయర్ హర్షం
జీహెచ్‌ఎంసీలో నిరుపేదలకు నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలకు గుర్తింపుగా జీహెచ్‌ఎంసీకి అవార్డు దక్కడంపై మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు.
లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
హైదరాబాద్‌ను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రవేశపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పథకంలో భాగంగా రూ.8,598.58 కోట్ల వ్యయంతో లక్ష ఇళ్ల నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా 580 చ.అ.ల విస్తీర్ణంలో రూ.7.90 లక్షల వ్యయంతో రెండు బెడ్‌రూమ్‌లు, రెండు బాత్‌రూమ్‌లు, ఒక కిచెన్, హాల్‌తో వీటిని నిర్మిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో 41 బస్తీల్లోని నివాసితులను ఖాళీ చేయించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించడంలో జీహెచ్‌ఎంసీ సఫలీకృతమైంది.
Comments
Please login to add a commentAdd a comment