ఉన్నత విద్యకు పెనుసవాళ్లు
ఇఫ్లూ స్నాతకోత్సవంలో ప్రసంగించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య ప్రమాణాలను పెంపొందించుకోవడం, బలోపేతం చేయడం సవాలుగా మారిందని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలు ఈ విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయని.. ఈ సవాళ్లు బయటి నుంచేగాక లోపలి నుంచీ ఉంటున్నాయని చెప్పారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ ఆడిటోరియంలో బుధవారం జరిగిన ‘ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వే జెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)’ ప్రథమ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇఫ్లూ నుంచి వివిధ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన అనంతరం ప్రసంగించారు. ఇఫ్లూ ఘన విజయాలను ఉత్సవం గా జరుపుకొంటున్న తరుణంలో.. విద్య విషయంలో మన విజన్‌కు మార్గదర్శకత్వం వహించగల పలు అంశాలను పంచుకుంటానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.
నాలుగు అంశాల్లో సవాళ్లు..: ఉన్నత విద్యా సంస్థల పరిపాలన విషయంలో వెలు పలి నుంచి, లోపలి నుంచి నాలుగు ప్రధాన అంశాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని ప్రణబ్ పేర్కొన్నారు. విద్యా బోధన ఖర్చులు పెరిగిపోతుండడం అందులో ఒకటని, సంకుచిత వ్యవహార జ్ఞానానికి ప్రాధాన్యత పెరిగిందన్నారు. మార్కెట్ ప్రాధాన్యత గల విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే విద్యార్జనకు ఏకైక లక్ష్యంగా మారడం రెండో సవాలని, కమ్యూనికేషన్ వ్యవస్థల ఆధిపత్యం కారణంగా విద్యపై శ్రద్ధ తగ్గిపోవడం మూడో సవాలని, విద్య విశ్వాసాన్ని నెలకొల్పకపోతుండడం నాలుగో సవాలన్నారు. ఈ పరిస్థితిలో ఉన్నత విద్య నాణ్యతా ప్రమాణాలను పరిరక్షించేందుకు పరిపాలనపర చాతుర్యం అవసరమని నొక్కి చెప్పారు. జ్ఞానమనేది జీవనానికి బాటను వేయాలని, జీవనం జ్ఞానార్జనకు ఉపయోగపడాలని విద్యార్థులకు ఉద్బోధించారు.