సాక్షి, హైదరాబాద్: కల్తీ, నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తే ఏడేళ్ల జైలు శిక్ష విధించేలా పర్యావరణ పరిరక్షణ(ఈపీ) చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించుకోవాలని వ్యవసాయ శాఖ యోచిస్తోంది. ఏడేళ్ల జైలు, రూ.లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఈపీ చట్టం కల్పిస్తుంది. ప్రస్తుతం 1966 విత్తన చట్టం ప్రకారమే కేసులు నమోదు చేస్తున్నారు. ఈ చట్టం వల్ల నకిలీ, కల్తీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కేవలం రూ.500 జరిమానా, ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
విత్తన చట్టం కింద కేసులు నమోదు చేసినా నిలబడే పరిస్థితి కూడా ఉండట్లేదు. గతేడాది నకిలీ, కల్తీ విత్తనాలు విక్రయించిన, తయారుచేసిన వారిపై 100 కేసులు నమోదయ్యాయి. 50 మందిని అరెస్టు చేశారు. కానీ ఒక్కరికి కూడా శిక్షలు పడలేదు. కేవలం రూ.500 జరిమానా చెల్లించి దర్జాగా మళ్లీ దందా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈపీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
నకిలీ, కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలీసు శాఖ నుంచి ఐజీ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ నుంచి ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి దీనికి నేతృత్వం వహిస్తున్నారు. జిల్లాల్లోనూ పోలీసు, వ్యవసాయ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ఆయా టాస్క్‌ఫోర్స్‌లు రెండు మూడు రోజుల్లో రంగంలోకి దిగి కల్తీ, నకిలీ విత్తన కేంద్రాలపై దాడులు నిర్వహిస్తాయి.
వ్యాపారుల్లో గుబులు..
కల్తీ, నకిలీ విత్తనాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడంతో వ్యాపారుల్లో గుబులు మొదలైంది. ఈసారి కట్టుదిట్టంగా పోలీసు శాఖతో కలసి దాడులకు రంగం సిద్ధం చేయడంతో తయారీదారుల్లో ఆందోళన మొదలైంది. మరోవైపు సర్కారు చర్యలపై కొందరు విత్తన డీలర్లు ఆందోళన చెందుతున్నారు. విత్తన కంపెనీలు, తయారీదారులను వదిలేసి తమపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు.
గతేడాది నకిలీ, కల్తీ విత్తనాలు విక్రయించారంటూ కంపెనీలు, తయారుదారులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు స్థానికంగా కొందరు వ్యవసాయాధికారులు విత్తన విక్రయ డీలర్లను టార్గెట్ చేసుకొని కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అసలు వ్యవసాయ శాఖ లైసెన్సు ఇచ్చిన కంపెనీల నుంచి విత్తనాలు వస్తే విక్రయించడానికి అవకాశముంది.
అందులో తమ తప్పేముందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు. లైసెన్సు లేని కంపెనీల విత్తనాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవచ్చని, దానికి తాము కూడా మద్దతు ఇస్తామని అంటున్నారు. ఇదే సాకుగా తమపై దాడులు చేసి అనేకమంది అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, చిన్న చిన్న సాంకేతిక కారణాలను చూపించి వేధిస్తున్నారని వాపోతున్నారు.
విత్తన విక్రయాలు జరపబోం..
గతేడాది కేసుల కారణంగా ఖమ్మం జిల్లాలో అనేకమంది డీలర్లు విత్తనాలు విక్రయించకూడదని తీర్మానించుకున్నారు. ఈ పరిస్థితి కారణంగా అక్కడ విత్తన విక్రయ సంక్షోభం తలెత్తుతుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ చర్యల వల్ల, అక్రమ కేసుల కారణంగా విత్తన విక్రయాలు జరపబోమని అంటున్నారు. నకిలీ, కల్తీ విత్తనాలను తయారుచేసే కంపెనీలు, సరఫరాదారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని, దాన్ని తాము స్వాగతిస్తామని, అయితే విత్తన డీలర్లపై అక్రమంగా కేసులు పెట్టకుండా చూడాలని తాము రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌కు విన్నవిస్తామని రాష్ట్ర విత్తన డీలర్ల ప్రతినిధి పృధ్వి ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment