హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా బుధవారం సమావేశమయ్యారు. రానున్న రైల్వే బడ్జెట్లో తెలంగాణ ప్రాంతంలో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. తెలంగాణలో ఉన్న పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు ట్రిపుల్ రైల్వే లైన్ వేయాలని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయం వద్ద స్టేషన్ ఏర్పాటుచేయాలని నంది ఎల్లయ్య కోరారు. గత ఏడాది కూడా ఇలాగే సమావేశం పెట్టినా, అభివృద్ధి ఏమాత్రం జరగలేదని మరో ఎంపీ మల్లారెడ్డి మండిపడ్డారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక దక్షిణ మధ్య రైల్వేపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు.
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్తగా చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలపై ఎంపీలు తమ సలహాలు, సూచనలు అందిస్తారు. ప్రతి ఏటా ఈ తరహాలో రైల్వే బడ్జెట్కు ప్రతిపాదనలు పంపడానికి ముందుగా ప్రజాప్రతినిధులతో రైల్వే అధికారులు భేటీ కావడం తెలిసిందే.