రాజీనామాలకు మా ఎమ్మెల్యేలు రెడీ
- ఎన్నికలు ఎదుర్కొనేందుకు మీరు సిద్ధమా?
- వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై టీడీపీ అసలు రంగు బయటపడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి అన్నారు. హోదా సాధనకోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటిస్తే.. ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలంటూ టీడీపీ మాట్లాడడంపై ఆయన ఘాటుగా స్పందించారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హోదా సాధనకోసం కేంద్రం మెడలు వంచి.. ఒత్తిడి పెంచాలని జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే టీడీపీ రాజకీయాలు చేస్తోందన్నారు.
తమ ఎమ్మెల్యేలతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా? ఎన్నికలకు సిద్ధమేనా? అని సవాలు విసిరారు. ప్రత్యేకహోదా వస్తే.. నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ ప్రకటించారని, అయితే టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయించి నిరసన తెలపకుండా విమర్శలు చేయడం హోదాపై వారి చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు.
జగన్‌ఆధ్వర్యంలో యువభేరి కార్యక్రమాలకు వస్తున్న స్పందన చూసి టీడీపీలో వణుకుపుడుతున్నట్లు కనిపిస్తోందని పార్థసారథి అన్నారు. యువతరమంతా హోదాపై తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొడుతుంటే.. జగన్ సభలకు ఎవరూ హాజరవ్వొద్దని సీఎం హెచ్చరించడం టీడీపీ అభద్రతాభావాన్ని తెలియజేస్తోందన్నారు. అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీని ఆహ్వానించారంటే.. సీఎం చిత్తశుద్ధేంటో అర్థమౌతోందన్నారు. టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఉద్యమానికి మద్దతివ్వాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు ఏమడిగినా ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని పార్థసారథి ఎద్దేవా చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసు భయంతో రాష్ట్రప్రజల ప్రయోజనాల్నిసైతం తాకట్టుపెడుతున్నారని మండిపడ్డారు.