సాక్షి, హైదరాబాద్: ఐదు వందలిస్తే ఎవరికైనా ఓటరు కార్డ్ సులువుగా ఇచ్చేస్తున్న వైనంపై ‘అంగంట్లో.. ఐడెంటిటీ’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన వ్యవహారం ప్రభుత్వ యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. నిషేధిత ఉగ్రవాదులు, అండర్ వరల్డ్ డాన్లు, విదేశీయులకు సైతం గంటల్లో ఓటరు కార్డులు జారీ చేసిన అంశంపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన మున్సిపల్, హోం శాఖలను ఒకింత కలవరానికి గురిచేసింది.
ఓటరు కార్డుల జారీకి సంబంధించి చోటు చేసుకుం టున్న లోపాలు, అందుకు సహకరిస్తున్న వ్యవస్థలపై లోతైన విచారణ జరిపి, ఎలాంటి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్న అంశంపై నివేదిక రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులు నిర్ణ యించారు. ఇక అక్రమంగా కార్డుల జారీయే లక్ష్యంగా పెట్టుకున్న మీసేవ కేంద్రాలేవీ బుధ వారం తెరుచుకోనేలేదు. తన భార్య నీలోఫర్ తనకు విడాకులు ఇవ్వకుండానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిందని, ఆమెకు ఇక్కడ ఓటర్ కార్డులతో పాటు రెండు ఆధార్ కార్డులు ఎలా మంజూరు చేశారని ఆఫ్గానిస్తాన్‌కు చెందిన అహ్మద్ మసూద్ ప్రశ్నించాడు.
ఆయన బుధవారం పలువురు ముస్లిం మత పెద్దలు, న్యాయవాదులతో సమావేశమైన తర్వాత పోలీసు ఉన్నతాధికారులను కలసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మసూద్ ‘సాక్షి’ప్రతినిధితో మాట్లాడుతూ భారతదేశంలో ఇంత సులువుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వటం దారుణంగా ఉందని, తన భార్యకు ఇచ్చిన అన్ని గుర్తింపులను వెంటనే రద్దు చేసి ఆమెను తమ దేశానికి పంపాలని విజ్ఞప్తి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment