‘రిసరక్షన్’కు మొదటి బహుమతి
సాక్షి కథల పోటీలో విజేతల వెల్లడి
♦ ‘సారాంశం’, ‘ఇప్పుడే వస్తాను’ కథలకు రెండు, మూడో బహుమతులు
♦ ‘దినం’ ‘అడివంచు మనిషి’ కథలకు కన్సొలేషన్ బహుమతులు
♦ విజేతలకు ‘సాక్షి’ చైర్‌పర్సన్ అభినందనలు
హైదరాబాద్: తెలుగు కథకు పట్టం కడుతూ సాక్షి దినపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో యువ రచయిత వెంకట్ సిద్ధారెడ్డి రచించిన ‘రిసరక్షన్’ (పునరుత్థానం) కథ మొదటి బహుమతి గెలుచుకుంది. వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతూ యూనివర్సిటీ విద్యార్థుల చైతన్యాన్ని వ్యక్తం చేసే ఈ కథకు జ్యూరీ చైర్మన్, సభ్యులు ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. పి.అమరజ్యోతి రాసిన ‘సారాంశం’ రెండో బహుమతి, హనీఫ్ రాసిన ‘ఇప్పుడే వస్తాను’ కథ మూడో బహుమతిని దక్కించుకున్నాయి. బహుమతి కింద వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.10 వేలు అందిస్తారు. ఇండ్ల చంద్రశేఖర్ రాసిన ‘దినం’, పాలగిరి విశ్వప్రసాద్ రాసిన ‘అడివంచు మనిషి’ కథలు కన్సొలేషన్ బహుమతి కింద రూ.2,500 మొత్తాన్ని గెలుచుకున్నాయి. విజేతలకు సాక్షి చైర్‌పర్సన్ వైఎస్ భారతి అభినందనలు తెలియచేశారు.
పోటీకి విశేష స్పందన
తెలుగు సాహితీ సంస్కృతులకు ఆది నుంచి ప్రాధాన్యం ఇస్తున్న సాక్షి ఆ పరంపరలో భాగంగా ‘2016- ఉగాది కథల పోటీ’ ప్రకటించగా రచయితల నుంచి విశేష స్పందన వచ్చింది. మొత్తం 2,350 కథలు వచ్చాయి. జ్యూరీ సభ్యులుగా ప్రసిద్ధ కథకులు పి.సత్యవతి, అల్లం రాజయ్య, మధురాంతకం నరేంద్ర, కుప్పిలి పద్మ వ్యవహరించగా జ్యూరీ చైర్మన్‌గా సుప్రసిద్ధ కథకులు కేతు విశ్వనాథరెడ్డి బాధ్యత స్వీకరించారు. తొలి వడపోతలో 250 కథలు మిగలగా, మలి వడపోతలో 30 కథలు నిలిచాయి. ఆ ముప్పై కథలను క్షుణ్ణంగా చదివిన జ్యూరీ సభ్యులు తమ ప్రాధాన్యం తెలియచేయగా అంతిమ నిర్ణయాన్ని జ్యూరీ చైర్మన్ కడపలో ఉగాది రోజున ప్రకటించారు. ఈ వడపోత, తుది నిర్ణయం వరకూ పోటీలో ఉన్న కథకులు ఎవరనేది జ్యూరీ సభ్యులు/చైర్మన్‌కు తెలియదు. సాక్షి సంపాదక బృందం ఆయా రచయితల పేర్లను గోప్యంగా ఉంచడం వల్ల ఫలితాలపై రచయితల గుర్తింపు ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంది.
విజేతల నేపథ్యం
మొదటి బహుమతి విజేత వెంకట్ సిద్ధారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఐటీ రంగంలో పని చేసి ప్రస్తుతం సినిమా రంగంలో దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నారు. రెండో బహుమతి గ్రహీత పి.అమరజ్యోతి స్వస్థలం అనకాపల్లి. ఈమె గృహిణిగా ఉంటూనే కథా రచనలో నిమగ్నమై ఉన్నారు. మూడో బహుమతి విజేత హనీఫ్ స్వస్థలం కొత్తగూడెం. సింగరేణి బొగ్గుగనుల ఉద్యోగి. ఇండ్ల చంద్రశేఖర్ (ఒంగోలు) నాటక రంగంలో, పాలగిరి విశ్వప్రసాద్ (కడప) పాత్రికేయ రంగంలో ఉన్నారు. సాక్షి కథల పోటీకి వచ్చిన ఆదరణ దృష్ట్యా ఈ పోటీని ప్రతి ఏటా నిర్వహిస్తామని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి తెలియచేశారు.