Ugadi stories contest
-
బకాసురుడి ఆత్మకథ
ఉగాది కథల పోటీలో ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ‘‘ఆఖరి చెట్టుని కూడా కొట్టేసిన తర్వాత... చిట్టచివరి చేపని కూడా పట్టేసాక... తుట్టతుది నదిని కూడా విషతుల్యం చేసేసాక... అప్పుడు గుర్తిస్తావు నువ్వు, డబ్బుని తినలేవని..!’’ - ఆదిమ రెడ్ ఇండియన్ల సామెత తెల్లకాగితాలపై తీక్షణంగా, తదేకంగా రాసుకుంటోపోతున్న దివ్య వాట్సప్ మెసేజ్ టోన్‌కి తలెత్తి, ఫోన్ వైపు చూసింది. ‘అవినాష్’ పేరు చూడగానే, ముఖంపై చిరునవ్వు! పిన్ని కొడుకతడు. ఏవేవో మెసేజెస్ వస్తూంటాయి తన నుంచి. తమాషావీ... ఆలోచింపజేసేవీ... అన్నీ! ఆ రెడ్ ఇండియన్ల సామెత యథాలాపంగా చూసి, పెట్టేస్తూండగా ఫోన్ వచ్చింది. ‘‘అక్కా! రావచ్చా? ఖాళీయేనా?’’ ‘‘రావచ్చు. ఖాళీయే’’ సంతోషంగా చెప్పిందామె. నిజానికి ఆమె చాలా పనిలో ఉంది, ఒక సీరియల్ రాతలో. కానీ, అతడి కన్నా, ఈ పని ఎక్కువేమీ కాదు. అతడు వస్తూనే, ‘‘... ఏంటీ! ఏవో ప్రేతాత్మల కథలు రాసుకుంటూ చాలా బిజీగా ఉన్నట్లున్నావే...’’ అన్నాడు. చిన్నబుచ్చుకుందామె. మరి తాను కాస్తంత పేరున్న రచయిత్రి, నూరు కథలపైనే రాసింది. అలతి పదాలతో, హృద్యంగా రాస్తుందనే పేరూ ఉంది. ‘‘అబ్బ. కాదురా! ఆత్మకథ. ఇదుగో ఈయనది’’ అంటో, తన సీరియల్ వస్తున్న వారపత్రికలో ఒక పారిశ్రామికవేత్త ఫొటో చూపింది. ‘అందరి వాడివయ్యా..జానకి రామయ్యా!’ అన్న టైటిల్ చూసి, ‘‘కవిత్వం పరవళ్లు తొక్కుతోందక్కా. బావగారి భావావేశం లాగుందే’’ అన్నాడు. అది నిజమే. జయరాజ్ సూచించిన టైటిలే అది. అదే చెప్పబోయి, అంతలోనే అతడి వ్యంగ్యం గ్రహించి, ‘‘ఏంటీ సంగతి? సూటిగా చెప్పు సుత్తి లేకుండా’’ అందామె కోపం నటిస్తూ. ‘‘ఏం లేదక్కా. నేనూ నీలాగే కిరాయి రచయితలాగ, పెద్దోళ్ల ప్రేతాత్మ కథలూ అవీ రాసి సంపాదించుకోవాలనుకుంటున్నాను.’’ ఈసారి నిజంగానే కోపం వచ్చింది ఆమెకి. ‘‘అవీ! ఏమిటా అర్థం లేని వాగుడు?’’ అవినాష్ వదనం గంభీరంగా అయింది. ‘‘అక్కా! ఇది రాసినందుకు ఎంత ముడుతుంది?’’ ‘‘అవీ! డబ్బుకోసం రాస్తున్నానని ఎందుకనుకుంటున్నావు? బావగారితో ఆయనకున్న పరిచయాన్ని పురస్కరించుకుని రాస్తున్నాను. ఇక ఆయన నువ్వు అనుకున్నంత చెడ్డవాడేం కాదు. తన సేవా కార్యక్రమాలు, గుప్త దానాలు, సామాజిక సేవ, సాంస్కృతిక సేవ... ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే, నీ దృక్కోణం తప్పకుండా మారుతుంది’’ హెచ్చు స్వరంతో చెప్పిందామె. అతడు జవాబివ్వకపోవడం చూసి, ‘‘అయినా, కథల కన్నా ఇలాంటి వాస్తవాలకి సజీవ రూపం కల్పించి రాయడం, ఆసక్తిగా చదివింపజేయడం ఎంత కష్టమో నీకేం తెల్సు?’’ అన్నది. ఈసారి అతడు చిన్నగా నవ్వాడు. ‘‘జీవిత చరిత్రలపైన పుస్తకాలు రాయడమంటే ఏమిటి?వారి నిజ స్వరూపాలకి ముస్తాబులు చేసి, వికారాలకి ముసుగులు వేసి, నగిషీలు చెక్కి ‘సుమారు మనుష్యులని’ సుందరంగానూ, మహావ్యక్తులు గానూ చూపడమన్నమాట. అందుకే ఆ ప్రక్రియ కష్టమే మరి!’’ దివ్య కూడా నవ్వడానికి ప్రయత్నించింది. ‘‘... అవీ! ఆయన్నేమీ మహావ్యక్తిగా మలచడం లేదు. అతి సాధారణ స్థాయి నుండి, ఈనాడు పేరు మోసిన పారిశ్రామికవేత్తగా ఎదగడంలోని కృషిని నేను వెలుగులోకి తెస్తున్నాను అంతే! ఈనాటి తరం వ్యక్తిత్వ వికాస సాహిత్యం విరివిగా చదువుతోంది కదా. ఇది కూడా అలానే అనుకోరాదు పోనీ.’’ వారిద్దరికీ వాదోపవాదాలు కొత్తేమీ కాదు. కానీ, ఈ సందర్భం తన విలువలనే నిలదీస్తూండటంతో... ఇబ్బందిగా, ఉక్కపోతగా అన్పించింది ఆమెకి. అక్క హావభావాలు గమనించి, అతడు టాపిక్ మార్చాడు. తను పని చేస్తున్న ఆఫీస్‌లోని అధికారుల విషయాలు చెప్పసాగాడు. ‘‘ఎవరన్నా, ఎక్కడన్నా అధికారం ప్రదర్శించాలని చూస్తే, తిరగబడాలని చాలా మంటగా ఉంటుంది’’ అన్నాడతడు. ‘నీ విషయం తెల్సు కదా’ అన్నట్లు ఆమె మందహాసం చేయడంతో, ‘‘... అవునూ, నువ్వు ఈ అధికార దర్పం, పెత్తనం, హోదాల పట్ల లాలస... వీటిపైన ఎందుకు కథలు రాయకూడదు?’’ అని ప్రశ్నించాడు అతడు. ‘‘రాస్తాలే కానీ, నువ్వే ఆఫీసర్‌వి అయితే, నీ కిందివారితో ఎలా ప్రవర్తిస్తావు? చెప్పు ముందు.’’ ‘‘నేను ఏవయితే అసహ్యించుకుంటున్నానో, ఖచ్చితంగా వాటికి విరుద్ధంగా, సంస్కారంగానే ప్రవర్తిస్తాను. శ్రామిక దృక్పథంతోనే ఉంటాను.’’ దివ్య నవ్వి అన్నది. ‘‘అవినాష్! అది జరగని పని. ఏదో పైపై ఉపశమనాలు చేయగలవేమో గానీ, శ్రామిక దృక్పథం అంటూ మాట్లాడితే నీ ఉద్యోగమే పోతుంది.’’ ఆ మాటలతో అవినాష్ గాయపడ్డట్టు కన్పించాడు. కొద్దిసేపు ఊరుకుని, తర్వాత అడిగాడు. ‘‘నువ్వు చెప్పింది నిజమక్కా. మరి నీ విషయానికొస్తే... అలాంటి భయాలే అక్కర్లేని నువ్వు, నీ విశ్లేషణకి కొంత మానవీయతని, ధర్మాగ్రహాన్ని సరైన చోట ఎందుకు జోడించవు?’’ అర్థం కానట్టు చూసిందామె. అప్పుడు మాట్లాడాడు అవినాష్, మాటలు పేర్చుకుంటో. ‘‘ప్రజల నుంచి భూమి చౌకగా కాజేసి, తర్వాత వాటిని తన ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకి కట్టబెట్టించుకున్నవారి సంగతి తెల్సా నీకు? తమ జీవనాధారమైన పచ్చటి పంట పొలాలు బూడిదగా మారిపోతాయన్న వాస్తవం తెల్సుకుని, నిరసన చేస్తున్న ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపినప్పుడు కొందరు చనిపోయారనీ, చాలామంది క్షతగాత్రులయ్యారనే విషయం తెల్సా? ఉత్తుత్తి ఉపాధి హామీలతో వారి బతుకుల్ని కకావికలం చేశారనీ తెల్సా?’’ అవినాష్ భావోద్రేకం ఆమెని నివ్వెరపాటుకి గురిచేసింది. ఆ మాటలు నిప్పు కణికల్లా, దగ్ధ గీతల్లా ఉన్నాయి. ఫెటేల్మంటూ ఉరిమేటప్పుడు, మెరిసిన కాంతిలో దృశ్యాలు స్పష్టాస్పష్టంగా ఉన్నట్లు... వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూండగానే, ఉద్విగ్నం కంఠం సవరించుకుని మళ్లీ చెప్పసాగాడతడు. ‘‘రాజకీయ నాయకులంటే ప్రజలకి అసహ్యమే గాని, వారి వెనుక ఉండి లోపాయికారిగా ధ్వంస రచన చేయించేవారిపైన అంతగా కోపం ఉండదు. కారణం వారి గురించి తెలీకపోవడం. వారు రాజకీయపు రొచ్చు అంటించుకోకుండా, తెలివిగా కళాసేవ, సాంస్కృతిక సేవల్లాంటి తొడుగులు కూడా వేసుకుంటారు. వాటిని చూసి, నీలాంటి వారు సైతం ముగ్ధులవుతుంటారు.’’ ‘‘ఒకప్పుడు ఆఫ్రికాని మైనింగ్ కంపెనీలు లూటీ చేసి, ఇప్పుడున్న దీనస్థితికి ఎలా దిగజార్చాయో, అలా రాష్ట్రంలో అభివృద్ధి ముసుగులో అరాచకానికి పాల్పడుతున్నవారిలో ముఖ్యుడు... ఈ జానకి రాముడు.’’ జయరాజ్ ‘కవి కూడలి’ నుంచి బయటపడేసరికి, రాత్రి పదకొండు దాటింది. ‘కవి కూడలి’ అనేది... కవులు, వారి శిష్యులు, ప్రశిష్యులు ఒక కాకా హోటల్ దగ్గర పెట్టుకున్న సంగమ స్థానం. వారిని కలిపేది కవిత్వాభిరుచి కాదు, పక్కనున్న బార్ తాలూకు బ్రాందీ రుచి అంటారు గిట్టనివారు. దారిలో ఉండగా, ‘పెద్దాయన’ నుండి ఫోన్ వచ్చింది. ఆత్మకథ ఆయన పుట్టినరోజు నాటికి పూర్తి చేయించి ఇచ్చేస్తాననీ, ఆవిష్కరణ సభ ఘనంగా చేసుకోవచ్చనీ, వాగ్దానం చేసి ఫోన్ పెట్టేశాడు. అతడు ఒకప్పుడు అభ్యుదయ కవిగా పేరుమోసినవాడు. ఇప్పుడు పెద్దవారి వెచ్చటి కరస్పర్శలో తన్మయత్వం అనుభవిస్తున్నాడు. దానికి ప్రతిఫలం మరోచోట తప్పకుండా, ఏ కాంట్రాక్టుల రూపంలోనో భారీగా ముడుతూంటుందని అతడికి తెల్సు. ఇంట్లో ఎప్పటిలాగా చదువుకుంటూనో, రాసుకుంటూనో ఉండే దివ్య, మౌనంగా చీకట్లో కూర్చోవడం, పిల్చినా పలక్కపోవడం చూసి, కీడు శంకించాడు అతడు. అప్పటివరకూ రాసిన కాగితాలు ముక్కలుగా డస్ట్‌బిన్‌లో పడుండటం చూసి, అదిరిపడ్డాడు. ఒక్కసారిగా వెయ్యి సందేహాలూ, వెయ్యి ఆలోచనల్తో కిక్కిరిసిపోయింది అతడి మెదడు. ఎప్పటికో తేరుకొని, ‘‘ఆ వెర్రి బాగులోడు గానీ వచ్చాడా?’’ అని ప్రశ్నించాడు. దివ్య చురుగ్గా చూసింది అతడివైపు. ఆ సాయంత్రం అవినాష్ వెళ్లిపోయాక, యూట్యూబ్‌లో ‘కోస్ట్ అండర్ ఎటాక్’ అనే డాక్యుమెంటరీ చూశాక, అందులోని వ్యధార్థ దృశ్యాలకు కంపించిపోయిందామె. పారిశ్రామిక వ్యర్థాలు కలిపిన వాగు నీటిని, తెలీక దప్పిక తీర్చుకున్న పల్లెమనిషికి మాట పడిపోవడం చూసి, ఆమెకి మాట రాలేదు. ఇంకా...గాలిలో, నీటిలో విష పదార్థాల చేత ఇరవయ్యేళ్ల వాళ్లు అరవయ్యేళ్ల వృద్ధాప్యంలోకి రూపాంతరం చెందడం చూసింది. స్త్రీలు గర్భాలు పోగొట్టుకోవడం నుంచి, పిల్లలు మానసిక వైకల్యాలకు గురికావడం చూసింది. ఉపాధి లేక, నిర్వాసితుల్లాగ తమ సొంత ప్రాంతంలోనే అపరిచితుల్లాగ ఉండటం చూసింది. ఉన్నదాంతోనే ఎలాగోలా ప్రశాంతంగా బతికేస్తున్నవారి బతుకుల్లో యుద్ధ బీభత్సం లాంటిది విషాదంగా గమనించింది. ఇక్కడి బాధిత రైతులు, కూలీలు, మత్స్యకారులు, ఆదివాసీలు... ఒకప్పుడు అమెరికన్స్ చేత తరమబడ్డ ఆదిమ రెడ్ ఇండియన్స్ మాదిరి అన్పించారు. మరి తానేం చేస్తోంది? రాష్ట్రంలో నాల్గోవంతు ప్రజలకి ఈ దుస్థితి కలగడానికి కారణమైన సూత్రధారి ఆత్మకథని గ్లోరిఫై చేస్తో రాస్తోంది. సుడులు తిరిగిన బాధతో ఆమె కళ్లు చెమ్మగిల్లాయి. జయరాజ్ ఎన్నో వాదనలు చేశాడు, ఎంతో కన్విన్స్ చేయబోయాడు. కానీ, ఆమె ముందు తనో మరుగుజ్జులా మారిపోతున్నాననే విషయం అతడికి తెలియరాలేదు. ఆమె అతడికి ఒక్కమాట కూడా బదులివ్వలేదు. ఇన్నాళ్లూ తననీ ఒక స్తబ్దతకీ, స్పందనా రాహిత్యానికి లోను చేసినందుకు అది నిరసన కావచ్చు. వారం రోజులు గడిచాయి. అనివార్య కారణాల వల్ల, ఆత్మకథని ప్రచురించలేకపోతున్నామనే ప్రకటన వారపత్రికలో చదివాక, అవినాష్ ఉప్పొంగిపోయాడు. తాను సాధించిన చిన్న విజయంగా దాన్ని భావించాడు. ఆఫీస్‌కి వచ్చాక, దివ్యకు ఫోన్ చేయాలనుకుంటూనే, మళ్లీ వాయిదా వేసి వచ్చి, సీట్లో కూచున్నాడు. కాస్సేపయ్యాక, ఒక సన్నటి వ్యక్తి వచ్చి, అతని సీట్ పక్కన నిల్చుని, విష్ చేశాడు. అతడ్ని గుర్తుపట్టాడు అవినాష్. ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న అతడు డివిజనల్ ట్రాన్స్ఫర్కి అప్లయ్ చేసుకున్నాడు. ఎందుకనో అతడు కొంచెం నెర్వస్‌గా ఉండటం గమనించినా, పట్టించుకోకుండా ‘‘బిజీగా ఉండటం వల్ల, కుదర్లేదు. మీ కేసు ఇవ్వాళ చూస్తాను’’ అని చెప్పాడు అవినాష్. ‘‘కాస్త త్వరగా ఫార్వర్డ్ చేసి, పనయ్యేట్టు చూడండి సార్’’ అన్నాడు ఆ వ్యక్తి. అలా అంటూనే, ఊహించని విధంగా, అవినాష్ జేబులో చిన్న నోట్ల కట్ట ఒకటి పెట్టేసి, దూరం జరిగాడు. అవాక్కయిన అవినాష్, ‘ఏమిటిది?’ అంటో కంగారుగా లేచి, అది తిరిగి అతని చేతిలో పెట్టబోయాడు. కానీ, ఆ పని పూర్తి చేయకముందే, బలిష్టంగా ఉన్న ముగ్గురు వ్యక్తులు చుట్టుముట్టి, కదలకుండా పట్టుకున్నారు. అందులో ఓ వ్యక్తి ‘ఐడి’ చూపిస్తో, ‘విజిలెన్స్’ అన్నాడు కరుగ్గా. దిమ్మెరపోయి, అవినాష్‌కి మెల్లగా పరిస్థితి అర్థమైంది. మొదట డబ్బు ఇవ్వజూపిన వ్యక్తిని పరికించి చూశాడు. తనని ట్రాప్ చేయడానికి ఎరగా వాడబడ్డ వ్యక్తి అతడు! పట్టించుకోలేదు. స్టేట్మెంట్లూ, సంతకాలూ అన్నీ చకచకా పూర్తి అయ్యాయి. నిజం ఏమిటో తెలుస్తూనే ఉన్నా గుసగుసలే తప్ప, ఎవరూ బయటికి మాట్లాడే సాహసం చేయలేదు. సీనియర్ పర్సనల్ ఆఫీసర్ అతని సస్పెన్షన్ ఆర్డర్ అందిస్తూ, ‘‘సారీ మ్యాన్. ట్రాప్ కేసులో ఇరుక్కున్న వ్యక్తిని వెంటనే సస్పెండ్ చేయాలని రూల్ చెబుతోంది’’ అన్నాడు. అతడి కంఠంలో ఏదో హేళన, శాడిజం గమనించి, మౌనంగా తలపంకించి, బయటికి వచ్చేశాడు అవినాష్. క్యాంటీన్లో కూచున్న అతడ్ని ప్రతిమ పలకరించింది. తనూ అక్కడే వెల్ఫేర్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తోంది. రోజుకి రెండూ మూడు తెలుగింగ్లీషు పుస్తకాలు ఇడ్లీ వడల్లాగ ఆకలితో లాగించేస్తూంటుంది ఆ అమ్మాయి. అంతేకాదు, వాటిపైన అనర్గళంగా బ్లాగుల్లో సమీక్షలు రాసేస్తూంటుంది. వాటిలో ఉత్త భావోద్వేగాలే తప్ప, లోతైన అవగాహన లేదని అతడి అభిప్రాయం. మర్నాడు దివ్య, అవినాష్‌కి ఫోన్ చేసింది. ఆ సీరియల్ ఆపేయడం గూర్చి సంతోషం వ్యక్తపరిచి, అభినందించాడు అతడు. ‘అది తర్వాత. ముందు నీ ఉద్యోగం సంగతి చెప్పు’’ అందామె క్లుప్తంగా. అతడు తేలిగ్గా నవ్వేసి, ‘‘డోంట్ వర్రీ. అదో ఫాల్స్ కేసు. దాని సంగతి నేను చూసుకుంటాను’’ అన్నాడు. ఆమె కుదుటపడలేదు. అతను ఉద్యోగం చేస్తాడని మొదట్లో ఎవరూ అనుకోలేదు. అలా ఉండేది అతని ధోరణి. దివ్య నచ్చచెప్పాకే, ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. తర్వాత ఎన్ని ఇంటర్వ్యూలు ఎదుర్కొని, ఈ ఉద్యోగం సంపాదించింది ఆమెకి తెల్సు. అలాంటిది, అతడు ఈ సమస్యని తేలిగ్గా తీసుకోవడం, ఆమెకి నచ్చలేదు. ఆమె ఆలోచనల్లో ఉండగానే, ప్రతిమ నుండి ఫోన్ వచ్చింది. అవినాష్ మీద బనాయించబడ్డ కేసుకీ, తమ ఆఫీసర్కీ ఏమీ సంబంధం లేదనీ, దీని వెనుక ఇంకెవరో పెద్దవాళ్లున్నారనే అనుమానం ఉందని ప్రతిమ చెప్పగానే, ఒక్కసారి గుండె ఝల్లుమంది ఆమెకి. మనసులో ఏదో అనుమానం. దూరంగా కూర్చుని, టీవీ చూస్తున్న భర్త వంక సాలోచనగా చూసింది. క్యాంటీన్లో కూచుని, వారపత్రిక చూస్తున్నాడు అవినాష్. ఆత్మకథా సీరియల్ మళ్లీ మొదలైంది. ఏం జరిగిందో అతడికి అర్థం కాలేదు. అతడు ఆలోచనల్లో ఉండగా, ‘హాయ్ వినాష్’ అన్న ప్రతిమ పిలుపు వినబడింది. తన టీజింగ్‌కి బదులివ్వకపోవడంతో, వారపత్రికలోకి తొంగి చూసింది. ‘‘దీన్ని రాయమని, మీ బావగారు నావద్దకొచ్చి అడిగారు. నేను రాయనని, నాకలాంటివి బోర్ అనీ చెప్పాను.’’ క్రికెటర్ నితిన్ ఆత్మకథ అయితే రాస్తానని అనకపోయావా? అతడి వ్యంగ్యాన్ని పట్టించుకోలేదామె. ‘‘అంత అదృష్టం పడితేనా... నితిన్ నామజపంతో మనందరి నోళ్లు ఎండేలా రాయనూ’’ అంది. ఆమె ఒక వాసనలేని ‘కాగిత పువ్వు’లాగ అన్పించింది అతడికి. సమస్యల మూలాలు తెల్సుకోకుండా, పిట్టల మీద, పువ్వుల మీద కోటికొక్కడు, నూటికొక్కడు లాంటి పుస్తకాల రాసుకుంటూ, తర్కం లేని ఎమోషనల్ రిజిడిటీతో విహరించేవాళ్లని ఇంకేమనాలి! చూస్తుండగానే, నెలరోజులు గడిచిపోయాయి. దివ్య మిగిలిన భాగాలు కూడా పూర్తిచేసి ఇచ్చేసింది. ఆమె శ్రద్ధగా రాయలేదనిపించిన చోట్ల జయరాజే తంటాలుపడి రాసుకున్నాడు. తర్వాత దాన్ని భక్తి శ్రద్ధలతో పెద్దాయన చేతుల్లో పెట్టాడు. అదే రోజు అవినాష్ పైనున్న విజిలెన్స్ కేసు కూడా, తూతూ మంత్రపు విచారణతో ఎత్తేయబడింది. అది తెల్సుకున్న దివ్య సంతోషంతో, అవినాష్‌కి ఫోన్ చేసింది. కానీ, అతను ఫోన్ కట్ చేశాడు. దాంతో, ఆమె ఎంత గాయపడిందంటే, రెండ్రోజుల్దాక మామూలు మనిషి కాలేకపోయింది. అతడ్ని తమ్ముడి కన్నా ఒక ఆత్మబంధువులాగ భావించేది తను. అలాంటిది తను తృణీకారానికి గురవ్వడంతో వేదనకి గురయ్యింది. ప్రతిమ తనకు ఫోన్ చేసిన రోజు, ఆమె భర్తని నిలదీసింది అనే కంటే, శివంగిలా విరుచుకుపడిందనటం కరెక్టు. ‘‘నాకేం తెలీదు. అతడి మాటల వల్ల, నువ్వు రాయడం మానుకున్నావని మాత్రమే చెప్పానంతే’’ అని తప్పించుకున్నాడు. ‘‘పెద్దవాళ్లతో వ్యవహారం. జాగ్రత్తగా ఉండాలని మొదట్నుంచీ మొత్తుకుంటూనే ఉన్నాను’’ అంటో సన్నాయి నొక్కులు నొక్కుతున్న అతడు... కీర్తి కోసం, కాసుల కోసం జరుగుతున్న పరుగులో చాలా దూరం వెళ్లిపోయాడని గ్రహించిందామె. ముందు తన తక్షణ కర్తవ్యం, అవినాష్‌ని ఈ సమస్యలోంచి బయటికి లాగడం అనుకుని, మళ్లీ ఆత్మకథ రాయడం ప్రారంభించి ముగించింది. అలాంటిది తననే అసహ్యించుకుంటున్నాడు అతడిప్పుడు. నిజం చెప్పేస్తే..? అప్పుడూ హర్షించడు. ‘నువ్వు పిచ్చి పని చేశావు’ అంటో తన మాటని తోసేస్తాడేమో! ‘‘నేను రాయకపోయినా, మరొకరు రాస్తారు కదా, ఏమిటా ప్రయోజనం?’’ అని తాను మొదట్లో అన్నప్పుడు ‘‘మన వైపు నుండి తప్పు జరక్కపోవడం ముఖ్యం గానీ, మనం కాకపోతే మరొకడైనా చేసేస్తాడు కదాని, మనం హత్యలకి కూడా ఒప్పుకుంటామా?’’ అని ప్రశ్నించిన అతడి మాటలు గుర్తొచ్చాయి. అయినా ‘ఇదంతా నీ గురించే చేశాను కాబట్టి, నువ్వు నాతో మళ్లీ ఆప్యాయంగా ఉండాలి’ అని తాను అర్ధించడం ఏమిటి?’ నిర్వేదంగా కళ్లు తుడుచుకుంది ఆమె. ‘జానకి రామయ్య’ జన్మదినోత్సవం నాడు, ఆయన ‘ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కూడా జరిగింది. చాలా కాకతాళీయంగా, అదే రోజు సాహిత్య అకాడమీ అవార్డులు కూడా ప్రకటించారు. ఈసారి అవార్డ్ దివ్యను వరించింది. భట్రాజులకి సంత్పరణ లాంటిదే తన అవార్డ్ కూడా అని అర్థమయ్యింది. ఆమె అకాడమీ అవార్డ్‌ని తిరస్కరించిందనే వార్త బ్రేకింగ్ న్యూస్ అయింది. సరిగ్గా అప్పుడు, ఆమె ఫోన్‌కి ఒక వాట్సప్ మెసేజ్ వచ్చింది. అది అవినాష్ నుండి! ‘సార్త్రే తనకి ప్రకటించిన నోబుల్ ప్రైజ్‌ని తిరస్కరిస్తూ ఇలా అన్నాట్ట... నా బూటు లేసంత పాటి కూడా విలువ చేయదు.’ అది చూస్తుండగా... అతడి నుండి ఫోన్ వచ్చింది.. ‘‘అవీ!’’ అన్నదామె ఉద్విగ్నంగా, వణికే గొంతుతో. ‘‘క్షమించక్కా. నాకిప్పుడు తెలుస్తోంది... నువ్వు ఆ ఆత్మకథని పూర్తిచేయడానికి, నీ హృదయంలోంచి ఎంత రక్తం ఒలికి వుంటుందో...’’ ‘‘చాలురా. ఇదీ నాకు నిజమైన అవార్డు...’’ అన్నదామె రుద్ద కంఠంతో. తర్వాత జయరాజ్ నుండి వరుసగా ఫోన్ కాల్స్! ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అవతల పడేసింది. టీవీలో పుస్తకావిష్కరణ సభలో, వంది మాగధుల భజన అసహ్యం వేసి, న్యూస్ ఛానల్ మార్చింది. తమ ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వద్దంటున్న ప్రజల ఆందోళనపై ఖాకీలు లాఠీలు ఝళిపిస్తున్న దృశ్యాలు వస్తున్నాయి. ఆ హాహాకారాలు తన మనస్సుని వికలం చేసేస్తూండగా, ఆమె అంతశ్చేతన మరింత జాగృతం కాసాగింది. ఆ రాత్రి ‘బకాసురుడి ఆత్మకథ’ అనే రచన ప్రారంభించిందామె! - శివచంద్ర -
ఎవరూ లేరండీ..
ఉగాది కథల పోటీలో ప్రత్యేక ప్రశంసకు ఎంపికైన కథ ఠంగు ఠంగుమని గోడ గడియారం పదిమార్లు గంట కొట్టింది. మంచం మీద కూర్చొని మోకాళ్ల నుండి కిందివరకు కాళ్ళు ఒత్తించుకొంటున్న జగన్నాథం, నేలమీద కూర్చొని ఒత్తుతున్న రాఘవయ్య ఇద్దరూ ఒక్కమారుగా ఉలిక్కిపడి గడియారం వంక తలతిప్పి చూశారు. ‘అప్పుడే పదయిపోయిందే... ఇక పడుకొందాం...’ అంటూ జగన్నాథం కాళ్ళను పక్కకు పెట్టాడు. రాఘవయ్య పైకి లేచి జగన్నాథానికి ఇంకేమైనా కావాలా అని చుట్టూ చూశాడు. వెనక్కు తిరుగుతున్న రాఘవయ్యతో జగన్నాథం అన్నాడు, ‘రేపు టిఫిన్ ఇడ్లీ కదా! ఇడ్లీలోకి చుక్కాకు చెట్నీ ఎలా ఉంటుంది?’ ‘పుల్లపుల్లగా బాగుంటుందయ్యా! తోడుగా నల్లగారం పొడి కూడా ఉంది. నాలుగు నేతిచుక్కలు వేసుకుంటే... మీరు మామూలుగా తినే నాలుగు ఇడ్లీల కన్నా ఇంకో రెండు ఎక్కువ తింటారు.’ ‘మధ్యానం నాటుకోడి పులుసు చేసుకొందాం. చాల్రోజులయింది తిని...’ రాఘవయ్య నోట్లో నీళ్ళు ఊరాయి. ‘నాటుకోడి అయితే నేను ఒక ముద్ద సంగటి చేసుకొంటాను. మీరూ కొంచెం తిని చూడండి...’ ‘సంగటి నాకు అరగదేమో రాఘవయ్యా...’ ‘అన్నీ అరగతాయి లెండయ్యా... అన్నం కూడా చేస్తా కదా... నచ్చకపోతే అన్నమే తిందురుగాని...’ ‘కొంచెం మిరియాల చారు కూడా చెయ్యాలి...’ ‘చేస్తానయ్యా... ఇక నేను పడుకుంటా. తెల్లార్తోనే లేచి చెత్తలూడ్చి, బోకులు కడిగి, మీకు పేపరు తీసుకొచ్చి, ఆరున్నరకల్లా కాఫీ రెడీ చెయ్యాలి గదా... మంచినీళ్ళు అక్కడ పెట్టాను. ఇంకేమన్నా కావాలంటే గట్టిగా ఒకమారు పిలవండి. లేచేస్తాను’ అంటూ సమాధానం కోసం చూడకుండా పడుకోవడానికి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు రాఘవయ్య. ఉదయం ఎనిమిది గంటలకల్లా సుశీలమ్మ ఒక చేటలో ఆవు పేడ తీసుకొచ్చింది. బాత్రూంలోకెళ్ళి బక్కెట్లో నీళ్ళు పట్టుకొచ్చి పేడ కలిపింది. ఇంటిముందు పరకతో తోసేసి పేడనీళ్ళు చల్లింది. పేడనీళ్ళను కొంతసేపు ఆరనిచ్చి పరకతో అలికింది. ఆ తర్వాత ముగ్గుపిండి తీసుకొని తనకు వచ్చిన ముగ్గు వెయ్యసాగింది. జగన్నాథం ముందు గది తలుపు దగ్గర కుర్చీ వేసుకొని పేపరు చదువుతున్నాడు. అప్పుడప్పుడూ ముగ్గు వెయ్యడంలో సుశీలమ్మ నేర్పరితనాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. ఆమెకు అరవై ఏళ్ళుంటాయి. ‘ఎవరూ లేరయ్యా! ఏదైనా పనిచెప్పండి. పడి ఉంటాను’ అని ఒకరోజు వచ్చింది. తనకు అన్ని పనులు చెయ్యడానికి రాఘవయ్య ఉన్నాడు, ఆమె దీనంగా అడిగితే కాదనలేకపోయాడు జగన్నాథం. అప్పుడే ఇంటిముందు పేడనీళ్ళు చల్లి ముగ్గు పెట్టడానికి మనిషిలేరే అని గుర్తుకు వచ్చింది. ‘మంగళవారం, శుక్రవారం వచ్చి పేడతో అలికి వెళ్ళు, నెలకు ఎంతో కొంత ఇస్తాను,’ అన్నాడు. సరే అంది సుశీలమ్మ. ఆమె అలకడం ముగ్గు పెట్టడం చూస్తూ, అప్పుడప్పుడూ పేపర్లోకి తల దూర్చుతూ ఉన్న జగన్నాథానికి హఠాత్తుగా గుండుగల్లు చెట్నీ గుర్తుకు వచ్చింది. ఎన్నో ఏళ్ళ నుండి ఆ చెట్నీ తినాలనుకొంటున్నాడు గాని చేసిపెట్టేవాళ్ళే లేరు. ఎవర్నడిగినా ఆ పేరే మేము వినలేదు అంటున్నారు. సుశీలమ్మను అడిగి చూద్దాం అనుకొన్నాడు. ‘నీకు గుండుగల్లు చెట్నీ చెయ్యడం తెలుసా?’ అన్నాడు. ‘గుండుగల్లు సెట్నీనా...?’ కాస్సేపు ఆలోచనలో పడింది సుశీలమ్మ. ‘ఎప్పుడూ విన్లేదుసా... ఎవురూ ఆ మాట అనింది కూడా గురుతుకు రావడం లేదు. నువ్వు సెప్పే గుండుగల్లు సెట్నీ ఎట్లా ఉంటుంది? యాడ దిన్నావు?’ అంది. ‘నలభై ఏళ్ళకు ముందు ఒక స్నేహితుణ్ణి... ఆయన పేరు చిన్నస్వామి... ఆ చిన్నస్వామిని చూడడానికి నేను గుండుగల్లు వెళ్ళా. ఆ ఊరు ఆంధ్రా కర్ణాటక బార్డర్లో ఉంది. ఆ ఊళ్ళో మా స్నేహితుడి భార్య ఈ చెట్నీ చేసిపెట్టింది. ఎంత బాగుంది అంటే నేను తినే అన్నమంతా ఆ చెట్నీతోనే తిన్నాను. ఇంకో కూర తాకలేదు. ఈ చెట్నీ ఎలా చేస్తారు అంటే ఆమె అప్పుడేదో చెప్పింది కాని ఏమీ గుర్తుకు రావడం లేదు. నాకేమో ఆ చెట్నీ మరుపుకు రావడం లేదు. వాళ్ళేమో ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. ఎక్కడికి పోయారో ఏమో తెలీదు,’’ జగన్నాథం గుండుగల్లు చెట్నీ పూర్వవృత్తాంతం చెప్పాడు. సుశీలమ్మకు చాలా జాలివేసింది. ‘అయ్యో!’ అనుకొంటూ, ‘ఎవుర్నన్నా అడుగుతా సా... ఆ పక్కోళ్ళు ఈ పక్క ఎవురన్నా ఉండారేమో... వాళ్ళకు తెలిసుంటుంది. నువ్వు సెప్పిన పేరేమి? గుండుగల్లు సెట్నీనా? అదేనా దానిపేరు?’ అంది. ‘ఆ చెట్నీ పేరు ఏమో నాకు తెలీదు సుశీలమ్మా... నేను ఆ ఊర్లో తిన్నా కాబట్టి గుండుగల్లు చెట్నీ అంటున్నాను...’ ఆలోచనలో పడిపోయింది సుశీలమ్మ. ఆలోచనతోబాటు కొంత దిగులు కూడా కలిగింది. ‘సార్... నువ్వు ఎప్పుడైనా సీకికొళ్ళతో సేసిన సెట్నీ తిన్నావా?’ అంది. ‘సీకికొళ్ళా...?’ నోరువెళ్ళబెట్టాడు జగన్నాథం, ‘సీకాయచెట్టు చిగుర్లేనా నువ్వు చెబుతున్నావు?’ ‘అవున్సా... సీకాయ సెట్టు సిగుర్లే... ఎర్రగా ఉంటాయి... అవి దెచ్చి ఇడిపించుకొని చిన్నయర్రగడ్లు, మెంతులు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ, ఉప్పు, చింతపండు అన్నీ నూనెలో బాగా ఏయింసి రోట్లో ఏసి తిరగబాత పెడితే శానా శానా బాగుంటుంది సార్... రేపు ఎప్పుడైనా తెచ్చేదా...’ యజమానికి ఏదో ఒక తృప్తి కలిగించాలి అనే స్థిర నిర్ణయంతో ఉన్నట్లు అంది సుశీలమ్మ. ‘ఈకాలంలో సీకాయచెట్లు ఇంకా ఉన్నాయా? నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను.’ ‘గొల్లపల్లి దగ్గర ఒక సెట్టుంది సార్... దగ్గరే కదా... ఇది సిగురుపెట్టే టయిమే... ఉంటే కోసుకొస్తాను... రాఘవయ్య దగ్గర నేనే ఉండి సెట్నీ సేయిస్తాను.’ గుండుగల్లు చెట్నీ కాకపోతే ఇంకో కొత్త చెట్నీ రుచి చూడొచ్చుగదా అని జగన్నాథం ‘సరే’ అన్నాడు. సుశీలమ్మలో ఆలోచన ఆగలేదు. ‘‘పాపం ఈ సారుకు అన్నీ ఉన్నాయి. డబ్బుకు లోటులేదు. అన్నీ ఉన్నా ఈ వయసులో నోటికి రుసిగా సేసిపెట్టే వాళ్ళే లేరు... నాకు తెలిసింది ఏదయినా సేసిపెడితే బాగుణ్ణు’’ అనిపించింది. ఆ ఆలోచనలతోనే ముగ్గు వెయ్యడం పూర్తిచేసి ముగ్గుపిండి గిన్నెలు లోపల కిటీకీ ఊచల దగ్గర పెడుతున్నప్పుడు ఏదో గుర్తుకొచ్చిందేమో... గట్టిగా ‘సార్...’ అంది. జగన్నాథం ఉలిక్కిపడి ఆమె వంక చూశాడు. ‘నీకు నల్లేరు సెట్నీ సేస్తారు తెలుసా?’ అంది. జగన్నాథానికి నల్లేరు తెలుసు. తన చిన్నప్పుడు ఎవరికయినా కుక్క కరిస్తే నల్లేరు దంచి, దాంతోబాటు ఒక రాగి దమ్మిడీని గాటుపడిన చోట పెట్టి కట్టుకడితే విషం పీల్చేస్తుందని అందరూ అనేవారు. నల్లేరుతో బ్రాహ్మణులు సాంబారు చేసి తింటారని కూడా విన్నాడు. చెట్నీ సంగతి వినలేదు. తన ఇంట్లో ఎప్పుడూ చెయ్యలేదు. సుశీలమ్మకు సమాధానం ఇస్తూ, ‘తెలుసుగాని... ఎప్పుడూ తిన్లేదు,’ అన్నాడు. సుశీలమ్మ కళ్ళు ఆనందంతో మిలమిలమన్నాయి. అయ్యగారు ఇంతవరకూ రుచి చూడని చెట్నీ... ఒకటి కాదు రెండు చేసిపెట్టే అవకాశం వచ్చింది కదా అని సంబరపడిపోయింది. ‘మంగలారం సీక్కొళ్ళు తెస్తాను... మల్లా సుక్రోరం నల్లేరు తెస్తాను. నేనే దగ్గరుండి సేయిస్తాను,’ అంది వెళ్ళబోతూ. సుశీలమ్మ వెళ్ళిపోతూ ఉంటే జగన్నాథం, ‘సుశీలమ్మా’ అని పిలిచాడు. ఆమె ఆగింది. ‘నాకేదో చేసిపెడతానంటున్నావు... నీ సంగతేమిటి? నీకేమి తినాలనిపిస్తుంది?’ అన్నాడు. సుశీలమ్మ సిగ్గుపడి పోయింది. చెప్పాలా వద్దా అని ఒక క్షణం సంశయించి ఆ తర్వాత చెప్పింది. ‘ఏడేడిగా సికెన్ బిరియానీ దానికి తోడు ముసిలుమోళ్ళు సేసినట్లు పలసగా వంకాయకూర తినాలనుంది సార్...’ అంది. అన్న తర్వాత సుశీలమ్మ అక్కడ ఉండలేదు. తను చెప్పి ఉండకూడదు, తప్పు చేశాను అన్నట్టు జగన్నాథం ఇంకో ప్రశ్న వెయ్యక మునుపే గబగబా వెళ్ళిపోయింది. మంగళవారం కొంచెం ఆలస్యంగా వచ్చింది సుశీలమ్మ. ఒకచేతిలో యథాప్రకారం చేటలో ఆవుపేడ ఉంది. ఇంకోచేతిలో ఒక పలచని గుడ్డలో ఏవో చుట్టుకొని తెచ్చింది. మంగళవారం సీకిచిగుళ్ళు తెస్తానని చెప్పింది గుర్తుకొచ్చింది జగన్నాథానికి. సుశీలమ్మ ముఖంలో ఏదో తేడా కనిపించింది జగన్నాథానికి. తన పనంతా పూర్తయిన తర్వాత నడుంమీద చేతులు పెట్టుకొని నిలబడి ముగ్గు వంక కొంతసేపు పరీక్షగా చూసి, తృప్తిగా తల ఆడించుకొంటూ లోపలివైపు రావడానికి అడుగులు వేస్త్తూ జగన్నాథానికి ఎదురుగా బయటిపక్కే నిలబడి మొదలుపెట్టింది. ‘సూడండి సా... నేను తొలిసారి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం సెప్పాను? ఎవురూ లేరని సెప్పాను గదా... నేను సెప్పింది నిజమేసా...’ లోపల ఏదో ఉద్వేగం తన్నుకొచ్చినట్లుంది సుశీలమ్మకు. రెండు క్షణాలు ఆగి మళ్ళీ మొదలుపెట్టింది. ‘నాకొక్క కొడుకున్నాడు సార్... ఏడేళ్ళయింది వాడు గలుఫు దేశాలు పట్టిపొయ్. నిన్న ఇంటి కొచ్చినాడు... వచ్చి నాల్రోజులయిందట. తర్వాత తెలిసింది. ఈవూర్లో వాడి సావాసగాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళతో ఏదో బిజినెస్సు మాట్లాడేదానికి వచ్చినాడంట, ఇంటికొచ్చినోడు ‘‘అమ్మా ఎట్లుండావు? తిన్నావా లేదా? నీకు పూట ఎట్లగడస్తా ఉంది?’’ అని అడగాల్నా? వద్దా? అవేమీ లేదు. పక్కన కూర్చోలేదు. నా సెయ్యి పట్టుకోలేదు. నాకేమో కళ్ళలో నీళ్ళు దుమకతా ఉన్నాయి. నాయ్నా అని వాణ్ణి వాటేసుకోవాలని ఉంది. వాడు దగ్గరికొస్తే పాంటూ సర్టూ నలిగిపోతాయనేటట్లు నాలుగడుగుల దూరంలోనే నిలబడినాడు సార్... ఎంతసేపు? వక్కకొరికినంత సేపు. సేతిలో ఏదో పొట్లం ఉంది. దాన్ని నా ముందు పెట్టి ... ఉహూ... పెట్టలా... నా ముందు పడేసి, ‘‘నీకోసం సికెన్ బిరియానీ తెచ్చాను. నీ కిష్టం కదా!’’ అన్నాడు. అప్పుడు సూడండి సా... నాకు యెక్కడ లేని కోపం వచ్చింది. వాడు ఇసిరేసిన పొట్లం అందుకొని నేను యిసిరేశాను సూడండిసా... అదిపొయ్ తలుపుకవతల యీదిలో పడింది. ఆ తర్వాత వాడు ఒక నిమసం కూడా నిలబడ్లా. ‘‘నువ్వేదో కోపంగా వుండావు. రేపు పొయ్యేటప్పుడు మల్లా వస్తాన్లే అని ఎల్లిపోయ్నాడు’’. గుక్క తిప్పుకోవడానికి అన్నట్లు ఆగింది సుశీలమ్మ. తను చెప్పదలచుకొన్నది పూర్తి కాలేదు అన్నట్లు తెలుస్తూనే ఉంది. ‘‘ఈ దినం తెల్లార్తో మల్లా వచ్చినాడు సా... నూర్రూపాయలనోట్లు కట్టతీసి ఒగటి రెండూ అని పది లెక్కబెట్టి నా సేతిలో పెట్టి, ‘‘కరుసుకు ఉంచుకో... నాలుగు నెల్లకు మల్లా వస్తా,’’ అన్నాడు. నేను ఉలకలేదు, పలకలేదు తలెత్తి వాడి మొగం వంక సరిగా సూడనుగూడా లేదు. బలింతంగా నోట్లు నా సేతిలో పెట్టాడు. నేను యిసిరేశాను. యేమనుకొన్నాడో యేమో... ఒగ నిమసం అట్లే నిలబడి శరశరా యెల్లిపోయాడు’. సుశీలమ్మ చెప్పడం అయిపోయింది. కొంగుతో రెండు కళ్ళూ తుడుచుకొని సీకి చిగుళ్ళు తీసుకొని వంటింట్లోకి నడిచింది. రాఘవయ్య అప్పటికే చికెన్ బిరియానీకి, వంకాయకూరకు అన్నీ సిద్ధం చేసుకొన్నాడు. ఆ రోజు ముగ్గురూ అక్కడే తిన్నారు. సుశీలమ్మ ఆనందంగా చికెన్ బిరియానీ రెండుమార్లు వడ్డించుకొని వంకాయకూరతో తినింది. జగన్నాథం సీకికొళ్ళ చట్నీ నంజుకొంటూ బిరియానీ తిన్నాడు. సుశీలమ్మ చెప్పినట్లే సీకికొళ్ళ చెట్నీ చాలా బాగుంది. ఉత్త అన్నంలో కూడా కలుపుకొని, నేతిచుక్కలు నాలుగు వేసుకొని తృప్తిగా తిని, ‘ఇదే ఇంత బాగుంది... నేను అప్పుడెప్పుడో తిన్న గుండుగల్లు చెట్నీ తింటే ఎలా ఉంటుందో ఏమో...’ అన్నాడు నవ్వుతూ. రాఘవయ్యా, సుశీలమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకొన్నారు. శుక్రవారం వచ్చింది. నల్లేరు చెట్నీ తయారయింది. మాంసం వేపుడు కూడా చెయ్యమన్నాడు జగన్నాథం. ముగ్గురూ ఆనందంగా తిన్న తర్వాత జగన్నాథం అన్నాడు, ‘రెండు కొత్త రకం చెట్నీలు తిన్నాను. చాలా రుచిగా ఉన్నాయి. ఇక గుండుగల్లు చెట్నీ తినకపోయినా ఫర్వాలేదు.’ ఆరోజు రాత్రి పడుకొనే ముందు జగన్నాథానికి కాళ్ళు ఒత్తుతూ రాఘవయ్య, ‘అయ్యా... ఒక మాట చెప్పేదా,’ అన్నాడు. ‘చెప్పు’ అన్నాడు జగన్నాథం. ‘సుశీలమ్మ నాకెవురూ లేరు అని ఇంకోమారు తేల్చి చెప్పేసింది. నా సంగతి నీకు తెల్సు. పదేండ్లు దాటిందో పదైదేండ్లు దాటిందో నా కొడుకూ కోడలూ యిల్లొదిలిపెట్టి ఎల్లిపోయి. ఇన్నేండ్లు రానోల్లు యింకేముస్తారు. సుశీలమ్మ చెప్పినట్లు నాకూ ఎవ్వరూ లేరు గదయ్యా... నేను పన్లో చేరిన కొత్తలో మీరూ అదే మాటన్నారు. కొడుకు ఏదో దేశం ఎల్లిపోయ్నాడు అంటిరి కదా...’ ‘ఏదో దేశం కాదు రాఘవయ్యా... సినిమాల్లో హీరో వేషాలు వేస్తానని బొంబాయి పోయ్నాడు. పట్టుబట్టి ఆస్తులన్నీ అమ్మించి తీసుకెళ్ళిపోయాడు. మిగిలిపోయింది ఈ యిల్లే... నాకిది చాల్లే... బ్యాంకులో ఉన్న డబ్బుతో నా జీవితం గడిచిపోతుంది. వాడు మళ్ళీ తిరిగొస్తాడని నేను అనుకోవడం లేదు. నువ్వున్నావు. ఆ సుశీలమ్మ ఉంది. నాకేం కావాలన్నా చేసిపెడతారు. ఈ వయసులో ఇంకా కావలసిందేముంది?’ ఔ అన్నట్లు రాఘవయ్య తల ఆడించాడు. ఆ మరుసటి రోజు జగన్నాథాన్ని నిద్రలేపింది సుశీలమ్మ, ‘కాపీ తెచ్చినాన్సార్!’ అంటూ. ఉలిక్కిపడి పైకి లేచాడు జగన్నాథం. కళ్ళు నులుముకొంటూ ‘నువ్వొచ్చినావేం సుశీలమ్మా... రాఘవయ్య ఏడీ...?’ అన్నాడు ఆదుర్దాగా. ‘ఏమో తెలీదుసా... తెల్లారి మబ్బుతోనే మా యింటికి ఒచ్చినాడు ‘‘సుశీలమ్మా... నేను అరిజెంటు పనిమీద యాడో బోతా వుండాను. నువ్వు రెండు మూడు దినాలు అయ్యగార్ని సూసుకోవల్ల,’’ అన్జెప్పి నిలవనుకూడా నిలవలేదుసా... అదే పొయ్‌నాడు. నాకు దిక్కుతెలీక నేనుగా యీడికొచ్చేసినా...’ తన తప్పేమీ లేదన్నట్లు, సంజాయిషీ ఇస్తున్నట్లు చెప్పింది సుశీలమ్మ. ఎంత ఆలోచించినా రాఘవయ్య వెళ్ళిన కారణం జగన్నాథానికి అంతుపట్టలేదు. జగన్నాథం మనసు మనసులో లేదు. సుశీలమ్మ తనకు చేతనైనంత వరకూ చేసిపెడుతోంది. జగన్నాథానికి తినబుద్ధి పుట్టలేదు. మరుసటిరోజు ఉదయం సుశీలమ్మ కాఫీ తీసుకెళ్ళి జగన్నాథాన్ని పిలిచినా లేవలేదు. కాఫీకప్పు పక్కనపెట్టి ఒంటిమీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. గబగబా పరుగెత్తికెళ్ళి ఆ ఊళ్ళో ఉండే ఒక ఆరెంపీ డాక్టర్ని పిలుచుకొచ్చింది. ఆ రోజంతా గంజి, పాలు, కాఫీ, రెండు రొట్టెముక్కలు తప్ప ఇంకేమీ ముట్టలేదు జగన్నాథం. రాత్రి జగన్నాథం గదిలోకి సుశీలమ్మ రెండుమార్లు వెళ్ళి ఒంటిమీద చెయ్యివేసి చూసింది. రెండుమార్లు చూసినప్పుడు జ్వరం తగ్గినట్లుంది. కాని తెల్లవారేసరికి మళ్ళీ తిరగబెట్టింది. ఆరెంపీ డాక్టర్ దగ్గరికి మళ్ళీ పరుగెత్తుకెళ్ళింది. డాక్టర్ ఇంజెక్షను కూడా వేశాడు. ‘మధ్యాన్నం వరకూ ఇట్లాగే ఉంటే టౌనుకు పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి’ అని చెప్పి వెళ్ళిపోయాడు. జగన్నాథం లేవలేదు. అప్పుడప్పుడూ మూలుగుతున్నాడు. పిలుస్తున్నా బదులు పలకడం లేదు. పెద్దాసుపత్రికి తీసుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? పాలుపోలేదు. పన్నెండు గంటలప్పుడు గుమ్మం దగ్గర చప్పుడయింది. గబుక్కున లేచి చూసింది సుశీలమ్మ. రాఘవయ్య ఇంట్లోకి వస్తున్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చింది సుశీలమ్మకు. ఆ కోపంలో ఏం మాట్లాడాలో తెలీలేదు. కోపం కాస్తా ఏడుపయింది. కొంగు నోట్లో దూర్చుకొని దుఃఖాన్ని దిగమింగుతూ జగన్నాథాన్ని చూపించింది. రాఘవయ్య జగన్నాథం మంచం పక్కన నిలబడి కాస్సేపు తదేకంగా చూశాడు. ఒంటిమీద చెయ్యి వేశాడు. వేడిగానే ఉంది. ‘అయ్యా అయ్యా’ అని పిలిచినా స్పందన లేదు. కాస్సేపు అలాగే నిలబడి ఆలోచించిన రాఘవయ్య వంటింట్లోకి వెళ్ళిపోయాడు. బియ్యం ఒక స్టౌ మీద పెట్టి, రెండో దాంట్లో బాణలి పెట్టాడు. కాస్సేపటి తర్వాత మిక్సీ ఆన్ చేశాడు. గంటన్నర లోపల వంట పూర్తయింది. ‘ఇప్పుడు వంట చేయడం అంత ముఖ్యమా! అయ్యగారిని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళే విషయం ఆలోచించకుండా ఈ రాఘవయ్య వంటింట్లోకి దూరాడే! ఈ మూడురోజులూ తిండి తిన్లేదేమో!’ సుశీలమ్మ మనసులో విసుక్కొంటోంది. రాఘవయ్య వంటింట్లోంచి అన్నం గిన్నెతోబాటు ఇంకో గిన్నె కూడా తెచ్చాడు. జగన్నాథం కంచంలో అన్నం పెట్టి, ‘అయ్యా! గుండుగల్లు చెట్నీ చేశానయ్యా! రెండురోజులు కష్టపడితే మీ స్నేహితుడు చిన్నస్వామి పక్కింటివాళ్ళు చెప్పారు. ఏం లేదయ్యా ఫస్టు బాణలిలో నూనె వేసి ఆవాలు, ఉద్దిపప్పు, సెనగపప్పు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత చింతపండు, చిన్న ఎర్రగడ్డ, తెల్లగడ్డ వేయాలి. చివరలో కొత్తిమీర, కరివేపాకు వేసి ఇంకొంత సేపు వేయించాలి. ఉప్పువేసి అంతా మిక్సీలోకి వేస్తే గుండుగల్లు చెట్నీ రెడీ. ఫస్టు మీరే రుచి చూడాలయ్యా. కంచంలో పెట్టుకొని వచ్చా’ అన్నాడు. జగన్నాథం మంచం మీద లేచి కూర్చున్నాడు. వేడి వేడి అన్నంలో చెట్నీ కలుపుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకొని ‘అదే అదే... ఇదే గుండుగల్లు చెట్నీ’ అని ఆనందంగా అన్నాడు. ఆయన ముఖమంతా వెలిగిపోయింది. ఆబగా చెట్నీ కలుపుకొంటూ పెద్ద పెద్ద ముద్దలు చేసి తినసాగాడు. రాఘవయ్య చూస్తూ ఉండలేకపోయాడు. గబగబా లోపలికెళ్ళి తనకో కంచం, సుశీలమ్మకో కంచం తీసుకొచ్చాడు. - నాయుని కృష్ణమూర్తి -
‘రిసరక్షన్’కు మొదటి బహుమతి
సాక్షి కథల పోటీలో విజేతల వెల్లడి ♦ ‘సారాంశం’, ‘ఇప్పుడే వస్తాను’ కథలకు రెండు, మూడో బహుమతులు ♦ ‘దినం’ ‘అడివంచు మనిషి’ కథలకు కన్సొలేషన్ బహుమతులు ♦ విజేతలకు ‘సాక్షి’ చైర్పర్సన్ అభినందనలు హైదరాబాద్: తెలుగు కథకు పట్టం కడుతూ సాక్షి దినపత్రిక ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది కథల పోటీలో యువ రచయిత వెంకట్ సిద్ధారెడ్డి రచించిన ‘రిసరక్షన్’ (పునరుత్థానం) కథ మొదటి బహుమతి గెలుచుకుంది. వర్తమాన పరిస్థితులకు అద్దం పడుతూ యూనివర్సిటీ విద్యార్థుల చైతన్యాన్ని వ్యక్తం చేసే ఈ కథకు జ్యూరీ చైర్మన్, సభ్యులు ప్రాధాన్యం ఇవ్వడంతో మొదటి బహుమతి గెలుచుకుంది. పి.అమరజ్యోతి రాసిన ‘సారాంశం’ రెండో బహుమతి, హనీఫ్ రాసిన ‘ఇప్పుడే వస్తాను’ కథ మూడో బహుమతిని దక్కించుకున్నాయి. బహుమతి కింద వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలు, రూ.10 వేలు అందిస్తారు. ఇండ్ల చంద్రశేఖర్ రాసిన ‘దినం’, పాలగిరి విశ్వప్రసాద్ రాసిన ‘అడివంచు మనిషి’ కథలు కన్సొలేషన్ బహుమతి కింద రూ.2,500 మొత్తాన్ని గెలుచుకున్నాయి. విజేతలకు సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతి అభినందనలు తెలియచేశారు. పోటీకి విశేష స్పందన తెలుగు సాహితీ సంస్కృతులకు ఆది నుంచి ప్రాధాన్యం ఇస్తున్న సాక్షి ఆ పరంపరలో భాగంగా ‘2016- ఉగాది కథల పోటీ’ ప్రకటించగా రచయితల నుంచి విశేష స్పందన వచ్చింది. మొత్తం 2,350 కథలు వచ్చాయి. జ్యూరీ సభ్యులుగా ప్రసిద్ధ కథకులు పి.సత్యవతి, అల్లం రాజయ్య, మధురాంతకం నరేంద్ర, కుప్పిలి పద్మ వ్యవహరించగా జ్యూరీ చైర్మన్‌గా సుప్రసిద్ధ కథకులు కేతు విశ్వనాథరెడ్డి బాధ్యత స్వీకరించారు. తొలి వడపోతలో 250 కథలు మిగలగా, మలి వడపోతలో 30 కథలు నిలిచాయి. ఆ ముప్పై కథలను క్షుణ్ణంగా చదివిన జ్యూరీ సభ్యులు తమ ప్రాధాన్యం తెలియచేయగా అంతిమ నిర్ణయాన్ని జ్యూరీ చైర్మన్ కడపలో ఉగాది రోజున ప్రకటించారు. ఈ వడపోత, తుది నిర్ణయం వరకూ పోటీలో ఉన్న కథకులు ఎవరనేది జ్యూరీ సభ్యులు/చైర్మన్‌కు తెలియదు. సాక్షి సంపాదక బృందం ఆయా రచయితల పేర్లను గోప్యంగా ఉంచడం వల్ల ఫలితాలపై రచయితల గుర్తింపు ప్రభావం పడకుండా జాగ్రత్త తీసుకుంది. విజేతల నేపథ్యం మొదటి బహుమతి విజేత వెంకట్ సిద్ధారెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా ఆత్మకూరు. ఐటీ రంగంలో పని చేసి ప్రస్తుతం సినిమా రంగంలో దర్శకత్వ విభాగంలో పని చేస్తున్నారు. రెండో బహుమతి గ్రహీత పి.అమరజ్యోతి స్వస్థలం అనకాపల్లి. ఈమె గృహిణిగా ఉంటూనే కథా రచనలో నిమగ్నమై ఉన్నారు. మూడో బహుమతి విజేత హనీఫ్ స్వస్థలం కొత్తగూడెం. సింగరేణి బొగ్గుగనుల ఉద్యోగి. ఇండ్ల చంద్రశేఖర్ (ఒంగోలు) నాటక రంగంలో, పాలగిరి విశ్వప్రసాద్ (కడప) పాత్రికేయ రంగంలో ఉన్నారు. సాక్షి కథల పోటీకి వచ్చిన ఆదరణ దృష్ట్యా ఈ పోటీని ప్రతి ఏటా నిర్వహిస్తామని సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి తెలియచేశారు.