‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్ | "Sarojini 'serious incident on the HRC | Sakshi
Sakshi News home page

‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్

Published Sat, Jul 9 2016 4:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్ - Sakshi

‘సరోజినీ’ ఘటనపై హెచ్చార్సీ సీరియస్

కేసును సుమోటోగా స్వీకరించిన హక్కుల కమిషన్
 
 సాక్షి, హైదరాబాద్ :
సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు వికటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్చార్సీ), లోకాయుక్త సీరియస్‌గా స్పందించాయి. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ... పూర్తి వ్యవహారంపై ఈనెల 21లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. ఇక లోకాయుక్త డిప్యూటీ డెరైక్టర్ తాజుద్దీన్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నర్సయ్యలతో కూడిన బృందం శుక్రవారం సాయంత్రం సరోజినీ ఆస్పత్రిలో విచారణ జరిపి, బాధితుల నుంచి వివరాలు సేకరించింది. ఈ బృందం శనివారం ఉదయం మరోసారి ఆస్పత్రిలో పర్యటించనుంది.

 బాధితులకు చికిత్సలు..
 కంటిచూపు మందగించడంతో దానిని మెరుగుపర్చుకోవడం కోసం సరోజినీ ఆస్పత్రిలో గత నెల 30న 21 మంది క్యాటరాక్ట్ శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. వారిలో 13 మంది ఇన్‌ఫెక్షన్ బారినపడగా.. ఏడుగురికి కంటిచూపు పోయిన విషయం తెలిసిందే. అయితే వీరిలో ఇద్దరికి చూపు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. శుక్రవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి కార్నియాను సేకరించి బాధితుల్లో ఒకరైన నూకాలమ్మతల్లికి శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ఆమెతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా చికిత్సకు స్పందిస్తున్నట్లు ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేందర్‌గుప్తా తెలిపారు.

 ఇక సరోజినీ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేయడంతో శస్త్రచికిత్సల కోసం ఎదురుచూస్తున్న పలువురు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ థియేటర్లను తిరిగి తెరిచేదాకా ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్సలు చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సరోజినీదేవి కంటి ఆస్పత్రికి వచ్చిన రోగులను కూడా ఉస్మానియా, గాంధీలకు తరలించి, శస్త్రచికిత్సలు చేయనున్నారు.

 ఆమ్‌ఆద్మీ పార్టీ ఫిర్యాదు..: ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా కావడానికి, ఏడుగురు బాధితులు కంటి చూపు కోల్పోవడానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, ముఖ్య కార్యదర్శి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీల నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్ర కో-కన్వీనర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైదరాబాద్‌లోని హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు సెక్షన్ 338 కింద కేసు నమోదు చేశారు.
 
 రూ.15 లక్షల పరిహారం ఇవ్వాలి
 ‘‘రాష్ట్ర ప్రభుత్వం రోగుల జీవితాలతో ఆడుకుంటోంది. ప్రభుత్వ ఆస్పత్రులకు నాసిరకం మందులు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదు. నాసిరకం మందులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఎంతో పేరుపొందిన సరోజిని ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం. సర్జరీలకు ముందే ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసుకోవాలన్న కనీస సూత్రాన్ని వైద్యులు పాటించలేదు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. రూ.15 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి’’.  
 - చెరుకు సుధాకర్,తెలంగాణ ఉద్యవు వేదిక చైర్మన్
 
 వైద్యులపై కేసులు నమోదు చేయొద్దు: టీజీడీఏ
 నాసిరకం మందులు తయారు చేసిన కంపెనీలను, కొనుగోలు చేసి సరఫరా చేసిన టీఎస్‌ఎంఐడీసీ అధికారులను వదిలేసి రోగులకు చికిత్స చేసే వైద్యులపై చర్యలు తీసుకోవాలని చూడటం దుర్మార్గమని తెలంగాణ వైద్యుల సంఘం సెక్రెటరీ జనరల్ బొంగు రమేశ్, కోశాధికారి లాలూప్రసాద్ రాథోడ్ పేర్కొన్నారు. వైద్యులపై కేసులు నమోదు చేయాలని చూస్తే ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement