సంక్షేమ ఖర్చుపై శ్వేతపత్రం ఇవ్వాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు తప్ప ఆచరణలో ఏమీలేదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ విమర్శించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత సంక్షేమం కోసం చేసిన వాగ్దానాలు, కేటాయింపులు, ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఏదో చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో వాగ్దానం చేస్తున్నారని చెప్పారు.
ఎంబీసీలకు రూ. 1,000 కోట్లు అని చెప్పారని, ఇప్పటిదాకా ఎంబీసీ కులాలకోసం ఎంత ఖర్చుచేశారో చెప్పాలన్నారు. బీసీలకు బడ్జెట్‌లో కేటాయించిన 5వేల కోట్లలో ఇప్పటిదాకా ఖర్చు చేసిందేమీ లేదని షబ్బీర్ అలీ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దారి మళ్లించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని షబ్బీర్ డిమాండ్ చేశారు. మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్‌లకు కూడా నెలకు 5వేల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో కంచ ఐలయ్య దూషిస్తూ మాట్లాడటం సరికాదన్నారు. వైశ్య సోదరులు సంయమనంగా వ్యవహరించాలని షబ్బీర్ కోరారు.