నిమజ్జనంలో షీ టీమ్స్ నిఘా
♦ మహిళల రక్షణకు పెద్దపీట
♦ ఈవ్‌టీజర్స్, దొంగలపై డేగకన్ను
సాక్షి, సిటీబ్యూరో : వినాయక నిమజ్జన ఉత్సవాల్లో మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించే వారిపై షీ టీమ్ నిఘా పెట్టనుంది. ఈవ్ టీజింగ్ చేస్తూ...అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఎవరైనా కనిపిస్తే చాలు షీటీమ్ సభ్యులు వారి భరతం పట్టేస్తారు.
బాలికలు, యువతులు, మహిళలు గణేశ్ నిమజ్జనోత్సవానికి వచ్చి ‘గణపతి బొప్పా మోరియా’ అంటూ హుస్సేన్‌సాగర్ తీరంలో సందడి చేయడం ఆనవాయితీగా వస్తోంది. గణపతి విగ్రహాలతో వచ్చే మహిళ భక్తుల సంఖ్య ప్రతీ సంవత్సరం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఈసారి దాదాపు 100 మంది షీ టీమ్ సిబ్బంది బృందాలుగా విడిపోయి ఆకతాయిలపై కన్నేయనున్నారు. మహిళాభక్తులను ఎవరైనా వేధిస్తున్నట్టు వీరి కంటపడితే వెంటనే అరెస్టు చేస్తారు.
హుస్సేన్‌సాగర్‌తో పాటు సికింద్రాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, మెహిదీపట్నం, అంబర్‌పేట, మలక్‌పేట, బాలాపూర్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో గస్తీ నిర్వహిస్తారు. బాధితులు 100కు కాల్ చేస్తే వెంటనే ఘటనాస్థలిలో వీరు వాలిపోయేలా ఏర్పాట్లు చేశారు.
12 ప్రత్యేక బృందాలు
కొందరు మహిళలు ఒంటి నిండా ఆభరణాలు ధరించి నిమజ్జన యాత్రలో పాల్గొంటారు. దొంగలు భక్తుల మాదిరిగా ఈ యాత్రలో కలిసిపోయి నగలు, పర్సులు కొట్టేస్తారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకొని క్రైమ్స్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా దొంగలను పట్టుకొనేందుకు ఈసారి దాదాపు 12కు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వీరిలో కొందరు పోలీసు డ్రెస్సులోనే విధులు నిర్వహిస్తుండగా, మరికొందరు మఫ్టీలో ఉంటారు.
2 వేల సీసీ కెమెరాలు..
నగరంలోని ముఖ్యకూడళ్ల నుంచి హుస్సేన్‌సాగర్ వరకు జరిగే వినాయక శోభాయాత్రను పోలీసులు సీసీ కెమెరాలతో బషీర్‌బాగ్‌లోని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటారు. నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో ముగిసేందుకు కృషి చేస్తారు.
గణేశుడి నిమజ్జన ర్యాలీల పర్యవేక్షణ కోసం పోలీసులు సుమారు 2 వేల సీసీ కెమెరాలు ఆయా ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు.
బాలాపూర్ వినాయకుడి శోభ యాత్ర దాదాపు 400కుపైగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తంగా కానుంది. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, చార్మినార్, అఫ్జల్‌గంజ్, మొజంజాహీ మార్కెట్, నాంపల్లి, అబిడ్స్, బషీర్‌బాగ్ మీదుగా బాలాపూర్ వినాయకుడి శోభయాత్ర హుస్సేన్‌సాగర్ వరకు కొనసాగుతుంది. ఈ యాత్రల్లో లక్షలాది మంది పాల్గొంటారు.