‘సింగిల్ హ్యాండ్’ చక్రధర్! | single hand chakradar | Sakshi
Sakshi News home page

‘సింగిల్ హ్యాండ్’ చక్రధర్!

Published Fri, Dec 11 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

‘సింగిల్ హ్యాండ్’ చక్రధర్!

‘సింగిల్ హ్యాండ్’ చక్రధర్!

వాహన భాగాల మార్పు, ధ్రువీకరణల తయారీ
 అన్నీ సొంతంగానే చేసుకునే ఘరానా నేరగాడు
 15 బ్యాంకు ఖాతాలున్నట్లు గుర్తించిన అధికారులు
 అనుచరులకూ నేర చరిత్ర
 సాక్షి, సిటీబ్యూరో:  వ్యవస్థీకృత నేరాల కోసం ముఠాను ఏర్పాటు చేసుకున్న ఎవరైనా తాము పర్యవేక్షిస్తూ ఇతరులతో పని చేయిస్తారు. అంతర్రాష్ట్ర వాహనాల చోరీ గ్యాంగ్ లీడర్ సంగపు చక్రధర్ వ్యవహారం దీనికి భిన్నం. అన్ని పనులూ తానే చేసుకుంటూ... తరలింపు కోసమే అనుచరులను వాడేవాడు. ఈ మేరకు నిందితుని అరెస్టు చేసిన సీసీఎస్ అధికారులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇతడు దొంగ వాహనాలను ‘దొర’గా మార్చి అమ్మడంలో భారీ తతంగం ఉంటోంది. 
 
 తొలుత ఇన్స్యూరెన్స్ కంపెనీల నుంచి ‘స్క్రాప్ వాహనాల’ సమాచారం సేకరణ... వాటి ఖరీదు... పత్రాలు... ఇంజిన్... చాసిస్ నెంబర్లు ఉండే భాగాలతో పాటు ఈసీఎం పరికరాల సేకరణ ఒక ఎత్తు. ఉత్తరాదిలో వాహనాలు చోరీ చేయించడం... వాటిని సిటీకి తరలించడం... ఇంజిన్, చాసిస్ నెంబర్లు ఉండే భాగాలను కత్తిరించడం... ఏమాత్రం అనుమానం రాకుండా ‘స్క్రాప్ వాహనాల’ నుంచి తీసినవి అతికించడం మరో ఎత్తు. వాహనాల చోరీ, తరలింపు మినహా... మిగిలిన అన్నీ రాగన్నగూడలోని తన డెన్‌లో చక్రధరే స్వయంగా చేసేవాడు. వాహనాల ఆర్‌సీ, ఎన్‌ఓసీ సహా ఇతర ఆర్టీఏ ధ్రువీకరణ లను కంప్యూటర్ ద్వారా తయారు చేసి వినియోగించేవాడు. 
 
 ూమూలుగా చూస్తే తనిఖీ చేసిన అధికారులూ బోగస్‌గా గుర్తు పట్టలేని విధంగా రూపొందించేవాడు. ఇలా ఆటోమెబైల్ ఇంజినీర్లు, గ్రాఫిక్ డిజైనర్లకు దీటుగా వాహన భాగాలను మార్చేస్తున్న నిందితుడు బీఏ, ఆ తరువాత హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశాడు.
 
 15 బ్యాంకు ఖాతాలపై దృష్టి...
 నాలుగు రాష్ట్రాల్లో నేరాలు చేసిన ఘరానా నేరగాడు చక్రధర్‌కు బాధ్యతలూ ఎక్కువే. దాదాపు 10 మంది సభ్యులున్న కుటుంబాన్ని   పోషిస్తున్నాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు చేసిన నేరాల ద్వారా వచ్చిన నగదును ఏం చేస్తున్నాడనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. ఆయనకు15 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించిన సీసీఎస్ అధికారులు వాటి లావాదేవీలపై దృష్టి పెట్టారు. మరోపక్క చక్రధర్‌ది జల్సా జీవితమని పోలీసులు చెబుతున్నారు. 
 
 ఇప్పటి వరకు నిందితుడిపై నాలుగు రాష్ట్రాల్లో ఐదు కేసులు (ఒకటి 65 వాహనాల చోరీకి సంబంధించింది) ఉండగా... అనుచరులైన శివపై మూడు రాష్ట్రాల్లో నాలుగు, కిషోర్‌పై రెండు రాష్ట్రాల్లో మూడు, శీనుపై రెండు రాష్ట్రాల్లో ఆరు, తన్వీర్‌పై మహారాష్ట్రలో 13, విజయ్‌పై అదే రాష్ట్రంలో నాలుగు కేసులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గ్యాంగ్ చోరీ చేసిన 35 వాహనాల్లో అత్యధికం మహారాష్ట్రలోని పుణే, ముంబైలకు చెందినవని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.
 
  ఇప్పటికే రెండింటిని గుర్తించగా... మిగిలిన వాటి యజమానుల వివరాలు, కేసులను ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం, ఓ అధికారినీ పంపాల్సిందిగా మహారాష్ట్ర పోలీసులకు వర్తమానం పంపారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఓ అధికారి చెప్పారు. మరోపక్క ఏదైనా వాహనం ప్రమాదానికి లోనై, బీమా మొత్తాన్ని పొందిన తరవాత దాన్ని వారికి స్వాధీనం చేస్తారు. ఇలాంటి వాటిని బీమా కంపెనీలు వేలంలో స్క్రాప్‌గా విక్రయిస్తాయి. వాటి వివరాలను ఆర్టీఏ డేటాబేస్ నుంచి తొలగించే విధానం లేకపోవడం ఈ ముఠాకు కలిసి వచ్చింది. దీన్ని గుర్తించిన సీసీఎస్ అధికారులు సంబంధిత విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు.
 

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement