ఆద్యంతం.. సంచలనం! | Snake Gang episode all-day thriller | Sakshi
Sakshi News home page

ఆద్యంతం.. సంచలనం!

Published Thu, May 12 2016 2:15 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

ఆద్యంతం.. సంచలనం! - Sakshi

ఆద్యంతం.. సంచలనం!

స్నేక్ గ్యాంగ్ ఉదంతంపై రోజంతా ఉత్కంఠ
కోర్టు తీర్పు నేపథ్యంలో చర్చోపచర్చలు
ఫిర్యాదుదారుల ఇళ్ల వద్ద బందోబస్తు

 
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన స్నేక్ గ్యాంగ్ ఘటన ఆద్యంతం సంచలనమే అయింది. 2014 జూలై 31న ఘటన జరిగినప్పటి నుంచి మొదలుకొని బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో తీర్పు వెలువడే వరకు ఈ కేసు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మొదట నలుగురు నిందితుల అరెస్ట్....శ్రీశైలం పారిపోయిన ప్రధాన నిందితుల పట్టివేత....అనంతరం కోర్టు అనుమతితో నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకొని విచారించడం జరిగింది. కాగా ఘటన జరిగిన అనంతరం స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదన్న కారణంగా అప్పటి పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి, సెక్టార్ ఎస్సై వీరప్రసాద్‌లను  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ ప్రేమ జంటను పాముతో బెదిరించి, యువతిని నిందితులు వివస్త్రను చేసి చిత్రీకరించిన వీడియోలు కొన్ని లోకల్ చానళ్లు, వాట్సాప్‌లో చక్కర్లు కొట్టాయి. దీంతో ఇందుకు బాధ్యులైన కొంతమంది నెటిజన్లు కూడా అరెస్టయ్యారు.

షాయిన్‌నగర్, ఎర్రకుంట ప్రాంతాలలో స్నేక్ గ్యాంగ్ ముఠా అరాచకాలు, రౌడీషీటర్లు, పహిల్వాన్ల దాదాగిరితో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కమిషనర్ సి.వి.ఆనంద్ కార్డన్‌సెర్చ్‌కు శ్రీకారం చుట్టారు. సైబరాబాద్ పరిధిలో ఏ కార్డన్‌సెర్చ్‌లో నేరుగా పాల్గొనని ఆయన... షాయిన్ నగర్‌లో స్వయంగా పాల్గొన్నారు. స్నేక్‌గ్యాంగ్‌లోని నిందితులందరి ఇళ్లకు వెళ్లిన కమిషనర్ వారు చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి...మీ పిల్లలు చేసిన పనిని సమర్ధిస్తారా అంటూ ప్రశ్నించారు. అనంతరం స్నేక్‌గ్యాంగ్‌లోని నిందితులు ఒక్కొక్కరిపై పి.డి.యాక్ట్‌లు ప్రయోగిస్తూ వచ్చారు. అనంతరం పోలీసులు చార్జిషీట్ ఫైల్ చేయడం, కోర్టులో ట్రయల్స్ జరిగిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు మీడియా, సోషల్ మీడియాలో కొనసాగింపుగా వచ్చాయి. ఇలా మొత్తం మీద రెండేళ్ల పాటు స్నేక్‌గ్యాంగ్ ఉదంతం ప్రజలలో చర్చనీయాంశమైంది.


 పహాడీషరీఫ్ పోస్టింగ్ అంటేనే బెదిరిపోయిన ఇన్‌స్పెక్టర్లు
స్నేక్‌గ్యాంగ్ ఘటనతో పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌కు ఇన్‌స్పెక్టర్‌గా రావాలంటేనే కొందరు అధికారులు బెదిరిపోయారంటే ఇక్కడ పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అప్పటి ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డిని సస్పెండ్ చేసిన కమిషనర్.. ఆయన స్థానంలో కళింగరావును నియమిం చారు. కానీ ఆయన కనీసం చార్జికూడా తీసుకోలేదు. తర్వాత శ్రీధర్‌ను నియమిం చారు. ఆయన సైతం కేవలం 10-15 రోజులే కొనసాగి తన వల్ల కాదంటూ ట్రాఫిక్ విభాగానికి బదిలీపై వెళ్లిపోయారు. అనంతరం సెప్టెం బర్ మాసంలో వచ్చిన ఇన్‌స్పెక్టర్ పి.వెంకటేశ్వర్లు గట్టిగా నిలబడి కఠినంగా వ్యవహరించారు. 10 నెలల పాటు పని చేసిన ఆయన అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేయగలిగారు. ఆయన అనంతరం వచ్చిన వి.వి.చలపతి ప్రస్తుత ఇన్‌స్పెక్టర్‌గా కొనసాగుతున్నారు.


 పోలీసుల ప్రత్యేక నిఘా.
 ప్రేమ జంటపై పాముతో బెదిరించి దాడి చేసిన స్నేక్‌గ్యాంగ్ నిందితులకు బుధవారం రంగారెడ్డి జిల్లా కోర్టు శిక్ష విధించడంతో కోర్టు వద్ద నిందితుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పహాడీషరీఫ్ పోలీసులు స్థానికంగా ప్రత్యేకంగా నిఘా ఉంచారు. ఆవేశంలో ఉన్న నిందితుల కుటుంబ సభ్యులు కేసుకు అనుకూలంగా వ్యవహరించిన వారిపై దాడి చేసే అవకాశం ఉందని భావించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారుల ఇళ్ల వద్ద దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
 
 మొదట్లోనే అడ్డుకుంటే బాగుండేది...
 పాములతో బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడిన స్నేక్ గ్యాంగ్ సభ్యులకు సరైన శిక్షే పడింది. ఇలాంటి వారిని జీవితాంతం జైల్లోనే ఉంచాలి. వీరి అరాచకాలకు మొదట్లోనే అడ్డుకట్ట వేస్తే ఎంతో మంది మహిళలు రక్షింపబడేవారు. చివరకు ఒక యువతి ధైర్యం చేయడంతో వీరి పాపం పండింది. -జి.ప్రజ్వల, కేశవగిరి
 
 
 కఠిన శిక్షలు పడితేనే నేరాలకు చెక్
 స్నేక్ గ్యాంగ్’ వంటి ఘటనల్లో కఠిన శిక్షలు పడితేనే నేరాలను తగ్గించగలం. తల్లిదండ్రులు కూడా వారి పిల్లల నడవడికపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నేరబాట పట్టకుండా చూడాలి. మహిళలపై దాడులు, అరాచకాల కేసులను సత్వరమే విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. -నిమ్మల నరేందర్ గౌడ్, మామిడిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement