కార్పొరేట్‌కూ... సమ్‌క్రాంతి | somekranthi for corporate | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కూ... సమ్‌క్రాంతి

Published Tue, Jan 13 2015 11:11 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM

కార్పొరేట్‌కూ... సమ్‌క్రాంతి

కార్పొరేట్‌కూ... సమ్‌క్రాంతి

పాశ్చాత్య నాగరికతను తలకెత్తుకుని తరిస్తోందని భావించే కార్పొరేట్ ప్రపంచం కూడా పండుగ ప్రాధాన్యాన్ని గుర్తిస్తోంది. ఆధునికతకు అసలైన చిరునామాలైన సాఫ్ట్‌వేర్, ఐటీ, ఎమ్‌ఎన్‌సీ సంస్థల కార్యాలయాల్లో...సంప్రదాయ సం‘క్రాంతి’ కనువిందు చేస్తోంది. కార్యాలయాలు కాసేపు పల్లె క్రాంతితో మెరుస్తున్నాయి. ఆఫీస్ క్యాంపస్‌లలో రంగవల్లులు హరివిల్లులై విరుస్తున్నాయి. పిండివంటల ఘుమఘుమలు పండుగలోని మాధుర్యాన్ని చవిచూపిస్తున్నాయి.
 ..:: ఎస్.సత్యబాబు
 

 పల్లెకు దూరంగా, అమ్మ చేతి వంటకు అందనంత దూరంగా, అయినవారి ఆప్యాయతకు దూరంగా... కాంక్రీట్ జంగిల్‌లో ఉరుకులు పరుగులతో గడిపేసే కార్పొరేట్ జీవితాలకు కార్యాలయ పండుగల రూపంలో కాసింత ఉపశమనం దొరుకుతోంది. ‘పండుగకు ఊరెళ్లడం ఎంత ముందుగా ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కుదరదు. చివరి నిమిషంలో బస్సు, రైలు టిక్కెట్‌లు సులభంగానూ దొరకవు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా సంక్రాంతిని మిస్ అయ్యామన్న భావన రాకుండా మా కంపెనీలో నిర్వహిస్తున్న ఈవెంట్ కొంత సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మునినాయుడు.

సొంత ఊర్లకు వెళ్లని వారిని, వెళ్లే వారిని సైతం దృష్టిలో పెట్టుకుని, వారికి ఫెస్టివల్ సందడిని దగ్గర చేయాలనే తపనతో కంపెనీలు ప్రత్యేకంగా సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేస్తున్నాయి. ‘మా ఊర్లో మూడు రోజుల పాటు జరిగే పండుగ వేడుకలు ఒక ఎత్తెయితే... దాదాపు సంవత్సరం మొత్తం గడిపే కంపెనీ ప్రాంగణంలో, ఫ్యామిలీ మెంబర్స్‌లా మారిపోయిన తోటి ఉద్యోగుల మధ్య నిర్వహించే ఈవెంట్స్ ఒకెత్తు. నేను మా ఊర్లోనే కాదు ఇక్కడ జరిగే ఈవెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాను’ అంటున్నారు

కాప్రికార్న్‌లో పనిచేసే సతీష్.పంచెలూ... పట్టు చీరలూ...
‘కట్టూ, బొట్టూ మారాలి. కొత్త  వంటలు, రుచులు ఆస్వాదించాలి. ‘మన’ అనుకునే వారితో కలిసి ఆడి పాడి ఆనందం పంచుకోవాలి. రొటీన్‌కు భిన్నంగా రోజంతా గడవాలి’.. ఇలా కోరుకునే వారిలో అత్యధికులు నిన్నా మొన్నటి దాకా పబ్బులు, పార్టీలు, వీకెండ్ షికార్లపైన మాత్రమే ఆధారపడేవారు. ఇప్పుడిప్పుడే వీరికి పండుగ సందడిలోని పసందు తెలిసివస్తోంది. ‘పంచెకట్టుకుని ఎన్ని రోజులైందో. సంక్రాంతి పండుగ పుణ్యమా అని మా  ఆఫీసులో అందరం పంచెకట్టుకుని వచ్చాం.

చాలా సంతోషంగా అనిపించింది’ అని సతీష్ చెప్పారు. ఆయన తరహా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ‘మా ఆఫీసులో సంక్రాంతికి పోటా పోటీగా ముగ్గులేస్తాం. ఎంతబాగా ఎంజాయ్ చేస్తామంటే...ఆ టైమ్‌లో మా ఇంట్లో వారి మధ్య లేననే విషయమే గుర్తుకు రాదు’ అని పంజగుట్టలోని ప్రోకర్మ ఉద్యోగిని  చరిత చెప్పింది. ఇలాంటి అభిప్రాయాలే ఇప్పుడు కార్పొరేట్ కార్యాలయాలను కనువిందైన సంబరాలకు వేదికలుగా మారుస్తున్నాయి.

ఫెస్టివల్ ఆఫ్ ఫెస్టివల్స్..
భోగి, సంక్రాంతి, కనుమ... ఈ మూడు పండుగల ముచ్చట్లలో తరాలకు అతీతంగా ఆకట్టుకునేలా భాగమైనవెన్నో. చెక్కా ముక్కా తెచ్చి మండించే భోగి మంటల దగ్గర్నుంచి కాగిత విహంగంలా మనసునూ ఎగురవేసే పతంగుల హేల దాకా... ఎన్నో ఉన్నాయి. సంక్రాంతి ముగ్గూ ముచ్చట్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. ఇవే ఇప్పుడు కార్పొరేట్ కంపెనీ ప్రాంగణాలలో హరివిల్లులు విరబూయిస్తున్నాయి.

పండుగలోని ముఖ్యమైన, కలర్‌ఫుల్ అంశాలను ప్రధానంగా తీసుకుని కార్పొరేట్ కార్యాలయాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. సెల్ఫ్‌మేడ్ పిండివంటలతో పాట్‌లాక్, రంగోళి పోటీలు, కైట్ ఫెస్టివల్స్, ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కాంటెస్ట్‌లు.. వంటివి నిర్వహిస్తూ ఉద్యోగుల్లో ఉల్లాసాన్ని, ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. ‘మా కంపెనీ ఆవరణలో నిర్వహించే కైట్ ఫెస్టివల్ కోసం ఏడాదంతా ఎదురు చూస్తాం’ అని మాదాపూర్‌లోని ఫ్యాక్ట్‌సెట్ కంపెనీ ఉద్యోగి చారు చెప్పారు.
 
కారణాలేవైతేనేం.. ఇప్పుడు కార్పొరేట్ లోగిళ్లు పండుగ కళతో కళకళ లాడుతున్నాయి. గ్లోబల్ ట్రెండ్స్‌కు చిరునామాలు.. గోరింట పూసిన చేతుల అందాన్ని చవిచూస్తున్నాయి. అచ్చతెలుగు ఆచారాలతో కనువిందు చేస్తున్నాయి. తెలుగు సంప్రదాయం నిత్యనూతనమై వెలుగుతూ ఉంటుందనే నమ్మకాన్నిస్తున్నాయి. అమ్మతనమంత ఆప్యాయంగా అంటిపెట్టుకునే ఉంటుందనే భరోసానిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement