త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్. | Soon Special increments | Sakshi
Sakshi News home page

త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్.

Published Thu, Jan 29 2015 12:35 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్. - Sakshi

త్వరలో స్పెషల్ ఇంక్రిమెంట్.

ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకుతెలంగాణ కానుక
పది రోజుల్లో విభజన పూర్తి
రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి
ఉత్తమ డ్రైవర్లకు అవార్డుల ప్రదానం

 
సిటీబ్యూరో: ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విజయవంతంగా పోరాడిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు త్వరలోనే తెలంగాణ ఇంక్రిమెంట్ అందజేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ, హెచ్‌పీసీఎల్ సంయుక్తంగా చేపట్టిన ఇంధన పొదుపు పక్షోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇంధన పొదుపు పాటించిన 94 మంది డ్రైవర్లకు బెస్ట్ కెఎంపీఎల్ అవార్డులు అందజేసిన సందర్భం గా మహేందర్‌రెడ్డి మాట్లాడారు. ఆర్టీసీలో ఏటా రూ. 1,150 కోట్ల ఇంధన భారం పడుతుందని, సరైన పొదుపు పద్ధతులను పాటించడం ద్వారా భారాన్ని తగ్గించేందుకు డ్రైవర్లు కృషి చేయాలన్నారు. వారం, పదిరోజుల్లో ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తి కానుందని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ప్రతి జిల్లాకు  రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. సంస్థ వీసీ అండ్ ఎండీ ఎన్.సాంబశివరావు మాట్లాడుతూ... తెలంగాణలో రోజుకు రూ.2 కోట్ల నష్టం వస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా పని చేసి నష్టాలను అధిగమించాలని సూచించారు. తెలంగాణలో 94 డిపోలకు గాను 52 డిపోల్లో ఇంధన పొదుపు పాటించగా మిగతా 42 డిపోల్లో సగటు కన్నా తక్కువ        కె ఎంపీఎల్‌తో బాగా వెనుకబడినట్టు జేఎండీ రమణారావు తెలిపారు. సదరు 42 డిపోల వారు ఇప్పటికైనా తమ పనితీరును మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్టీసీ విజిలెన్స్ డెరైక్టర్ వేణుగోపాల్‌రావు, హెచ్‌పీసీఎల్ రీజనల్ మేనేజర్ పండా, ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తదితరులు  పాల్గొన్నారు.
 
ఉత్తమ డ్రైవర్లు వీరే...
 
ఖమ్మం డిపోలో పనిచేస్తున్న సీహెచ్ అప్పారావు ఈ ఏడాది ఇంధన పొదుపులో అద్భుతమైన ఫలితాన్ని సాధించి అత్యుత్తమ డ్రైవర్‌గా నిలిచారు. లీటర్ డీజిల్‌కు 7.92 కిలోమీటర్ల చొప్పున ఏడాది కాలంలో 71,182 కిలోమీటర్ల మేర బస్సు నడిపారు. ఆయన పాటించిన పొదుపు వల్ల 4,418 లీటర్ల డీజిల్ ఆదా అయింది. ఈ మేరకు అప్పారావును అధికారులు అభినందించారు. రంగారెడ్డి జిల్లా  పరిగి డిపోకు చెందిన కె.బుచ్చయ్య లీటర్ డీజిల్‌కు 7.13 కిలోమీటర్లు నడిపి రెండో స్థానంలో నిలిచారు. కరీంనగర్ డిపోకు చెందిన ఏఎన్ చారి 6.72 కిలోమీటర్లతో మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం 11 మంది డ్రైవర్లు అవార్డులు అందుకున్నారు. జోనల్, రిజియన్ స్థాయిల్లో మొత్తంగా 94 మంది డ్రైవర్లు, మెకానిక్‌లకు అవార్డులు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement