ఇక ఆర్టీసీ ‘టూరిస్టు’ బాట... | Special packages to tourist sites | Sakshi
Sakshi News home page

ఇక ఆర్టీసీ ‘టూరిస్టు’ బాట...

Published Sat, Jun 25 2016 12:33 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఇక ఆర్టీసీ ‘టూరిస్టు’ బాట... - Sakshi

ఇక ఆర్టీసీ ‘టూరిస్టు’ బాట...

పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు
టీఎస్‌టీడీసీ హోటళ్ల నిర్వహణకు పరిమితం
పర్యాటకులకు రవాణా సదుపాయంలో ఆర్టీసీ

 

సిటీబ్యూరో: ఆర్టీసీ ఇక పర్యాటక బాటలో పయనించనుంది. ఇప్పటి వరకు స్టేజీ క్యారేజీలకు పరిమితమైన  ఆర్టీసీ బస్సులు ఇక నుంచి టూరిస్టు బస్సులుగా కూడా  సేవలందజేయనున్నాయి. నగరంలోని సందర్శనీయ స్థలాలతో పాటు, రాష్ర్టంలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ  పర్యాటక  ప్రాంతాలకు ఆర్టీసీ  టూరిజం ప్రత్యేక ప్యాకేజీలను  రూపొందించేందుకు సన్నాహాలు చేపట్టింది. ముఖ్యమంత్రి  కేసీఆర్ సూచన మేరకు నష్టాలను అధిగమించేందుకు వివిధ రకాల ప్రత్యామ్నాయ మార్గాలపై  అధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో  భాగంగా  మొట్ట మొదట  పర్యాటక రంగంలోకి బస్సులను ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ చేపట్టారు. ప్రస్తుతం పర్యాటకాభివృద్ధి సంస్థ స్వయంగా బస్సులను నడపడంతో పాటు, వసతి తదితర సదుపాయాలను కూడా అందజేస్తోంది. ఇక నుంచి  పర్యాటకుల వసతి, హోటళ్ల నిర్వహణ బాధ్యతలు పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలోకి, రవాణా సదుపాయాలు ఆర్టీసీ పరిధిలోకి వచ్చే విధంగా రెండు సంస్థల మధ్య  చర్చలు జరుగుతున్నాయి.


వివిధ అంశాలపైన  ఈ రెండింటి మధ్య  ఒక సమన్వయం కుదిరితే  త్వరలోనే ఆర్టీసీ టూరిస్టు బస్సులు ప్రయాణికులకు, పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి షిరిడీ, శ్రీశైలం, పంచారామాలు వంటి కొన్ని  ప్రాంతాలకు  ఆర్టీసీ  ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులు నడుపుతోంది. పూర్తిస్థాయిలో పర్యాటక బస్సులను ప్రవేశపెడితే రాష్ర్టంలోని అన్ని పర్యాటక ప్రాంతాలతో పాటు, ఇతర ప్రాంతాలకు కూడా  ఆర్టీసీ టూరిస్టు బస్సులు  రాకపోకలు సాగిస్తాయి.

 
త్వరలో స్పష్టత...

ప్రస్తుతం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 62 బస్సులతో పర్యాటకులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తుంది. ప్రతి రోజు హైదరాబాద్ నుంచి  వివిధ ప్రాంతాలకు సుమారు 3000 మంది పర్యాటకులు బయలుదేరి వెళ్తారు. షిరిడీ, శ్రీశైలం, భద్రాచలం, విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాలతో పాటు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ర్టల్లోని  పర్యాటక ప్రాంతాలకు  కూడా  ఈ బస్సులు నడుస్తున్నాయి. వంద మందికి పైగా డ్రైవర్లు  బస్సులు నడుపుతున్నారు. టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన ఈ  బస్సులన్నింటినీ ఆర్టీసీ  కొనుగోలు చేయడంతో పాటు, ఆ సంస్థకు చెందిన డ్రైవర్‌లకు సైతం ఆర్టీసీలో  నియామక అవకాశం కల్పించడం ద్వారా  బస్సుల నిర్వహణ బాధ్యత పూర్తిగా తమ  పరిధిలోకి  వస్తుందని ఆర్టీసీ  ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. అలాగే ఇప్పుడు ఉన్నట్లుగానే టూరిజంకు చెందిన హోటళ్లు, ఇతర వసతి సదుపాయాల నిర్వహణ  పర్యాటకాభివృద్ధి సంస్థ పరిధిలో ఉంటాయని పేర్కొన్నారు. ఆదాయ, వ్యయాలు, సిబ్బంది వంటి అంశాలపైన ఒక అవగాహనకు వస్తే ఆర్టీసీ టూరిస్టు  బస్సులు త్వరలోనే అందుబాటులోకి వస్తాయి. ఈ దిశగా ప్రభుత్వ స్థాయిలో సైతం రెండు విభాగాల మధ్య ఒక అవగాహన ఏర్పడవలసి ఉంది.

 
గ్రేటర్‌లో  సైట్ సీయింగ్...

పుణ్యక్షేత్రాలు, దర్శనీయ స్థలాలు, తీర్థయాత్రలతో పాటు నగరంలోని గోల్కొండ, చార్మినార్, నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్‌పార్కు, లుంబినిపార్కు, చౌమొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా, గోల్కొండ టూంబ్స్, ట్యాంక్‌బండ్, జూపార్కు, చిలుకూరు వంటి పర్యాటక, సందర్శనీయ స్థలాలకు సైతం ఆర్టీసీ బస్సులు నడుపుతారు. నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల డిమాండ్‌కు అనుగుణంగా ప్యాకేజీలను రూపొందిస్తారు. శని, ఆదివారాల్లో టూరిస్టుల కోసం ప్రత్యేక బస్సులను సైతం నడుపనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 3550 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. శని,ఆది వారాల్లో సాధారణ ప్రయాణకుల రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది. నగరవాసులు ఎక్కువ శాతం ఏదో ఒక పర్యాటక స్థలాన్ని ఎంపిక చేసుకొని వెళ్తారు. ఇందుకు తగినట్లుగా ఏసీ, నాన్ ఏసీ బస్సులను నడపాలని ఆర్టీసీ యోచిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement