
ఈ–చలాన్ చెల్లించకుంటే ‘ఇంటికే’!
►పెండింగ్ ఈ–చలాన్ల వసూళ్ళకు ప్రత్యేక బృందాలు
► టాప్ వైలేటర్స్ ఇళ్ళకు వెళ్తున్న ట్రాఫిక్ పోలీసులు
►25 కంటే ఎక్కువ ఉంటే వాహనం స్వాధీనం, చార్జ్‌షీట్
►10 కంటే ఎక్కువ ఉన్న వాహనాల పైనా అభియోగపత్రాలు
సిటీబ్యూరో: ఎడాపెడా ఉల్లంఘనలకు పాల్పడటం..జారీ అయిన ఈ–చలాన్లు చెల్లించకుండా తప్పించుకు తిరగడం... ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే చెల్లిద్దాంలే అనుకోవడం...ఇలాంటి వాహనచోదకులకు చెక్ చెప్పడానికి సిటీ ట్రాఫిక్ వింగ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. 25 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారి ఇళ్ళకు వెళ్ళి మరీ వాహనాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. టాప్ వైలేటర్స్ టీమ్స్‌గా పిలిచే ఈ బృందాలు ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల వారీగా పని చేస్తున్నాయని డీసీపీ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు.
ఇప్పుడంతా నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్...
ప్రస్తుతం సిటీలో పూర్తి స్థాయిలో నాన్–కాంటాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విధానం అమలవుతోంది. క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు నేరుగా జరిమానాలు విధించడం మానేశారు. కేవలం తమ వద్ద ఉన్న కెమెరాలో ఉల్లంఘనని బంధించడం ద్వారా పోలీసుస్టేషన్ నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అప్‌లోడ్ చేస్తారు. అక్కడి అధికారులు ఈ ఫొటోల ఆధారంగా వాహనచోదకులకు పోస్టు ద్వారా ఈ–చలాన్లు పంపిస్తున్నారు.
పెండింగ్‌లో ఉన్నవి 70 లక్షల పైనే...
నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులకు జారీ చేస్తున్న ఈ–చలాన్లు భారీ స్థాయిలో పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి 2014–17 మే మధ్య జారీ అయిన ఈ–చలాన్లలో 70,92,753 పెండింగ్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 42.33 లక్షలు, సైబరాబాద్‌లో 25.60 లక్షలు, రాచకొండలో 2.98 లక్షలు (ఈ కమిషనరేట్ 2016 మధ్యలో ఏర్పాటైంది) ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ చలాన్లకు సంబంధించిన జరినామాను వాహనచోదకులు చెల్లించని కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్ విభాగం అధికారులు ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా ట్రాఫిక్ పోలీసుస్టేషన్ వారీగా టాప్ వైలేటర్స్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల నుంచి ఒక కానిస్టేబుల్, హోంగార్డ్ చొప్పున ఎంపిక చేసి వీటికి రూపమిచ్చారు.
ఇళ్ళకు వెళ్ళి వాహనాలు సీజ్...
ఈ టాప్ వైలేటర్స్ టీమ్స్‌కు 25 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వాహనాల జాబితాలను ఠాణాల వారీగా అప్పగించారు. ఆర్టీఏ డేటాబేస్ ఆధారంగా వాహన యజమాని చిరునామా తెలుసుకుంటున్నారు. వారి ఇళ్ళకు వెళ్తున్న ప్రత్యేక బృందాలు వాహనాలను స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ ఠాణాకు తీసుకువస్తున్నారు. వీరిపై న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేసిన తర్వాత, కోర్టు విధించిన జరిమానా, ఈ–చలాన్ పెండింగ్ మొత్తం చెల్లించాకే వాహనాలను విడిచి పెడుతున్నారు. ఇప్పటి వరకు 25 ఠాణాల పరిధిలో అనేక వాహనాలను ఈ బృందాలు సీజ్ చేసినట్లు డీసీపీ రంగనాథ్ పేర్కొన్నారు.
చిక్కితే కోర్టుకు వెళ్ళాల్సిందే...
క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్ పోలీసులు ఓ వెహికిల్‌ను ఆపినప్పుడు తమ వద్ద ఉన్న పీడీఏ యంత్రాల్లో వాహనాలపై ఉన్న ఈ–చలాన్ పెండెన్సీని తనిఖీ చేస్తున్నారు. పెండింగ్ ఈ–చలాన్లు ఉన్నట్లు తేలితే... రసీదు ఇచ్చి, ఆ మొత్తం చెల్లించి వచ్చిన తర్వాత వాహనాన్ని అప్పగిస్తారు. అయితే 10 కంటే ఎక్కువ ఈ–చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారికి ఆ చాన్స్ లేనట్లే. వారంతట వారుగా ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకుని చెల్లిస్తే ఇబ్బంది లేదు. అలా కాకుండా క్షేత్రస్థాయి తనిఖీల్లో చిక్కితే మాత్రం అప్పుడు నేరుగా నగదు చెల్లించడానికి ఆస్కారం లేదు. వీరిపై కచ్చితంగా న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సిందే. కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
చిరునామాలతో చిక్కులు...
ఈ–చలాన్లను ట్రాఫిక్ విభాగం అధికారులు ఆర్టీఏ అధికారుల రికార్డుల్లో ఉన్న చిరునామాల ఆధారంగా జారీ చేస్తున్నారు. ఆ డేటాబేస్‌తో అనుసంధానం ఏర్పాటు చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు తమ కంప్యూటర్‌లో ఓ ఉల్లంఘనకు పాల్పడిన వాహనం నెంబర్ ఎంటర్ చేస్తే... ఆటోమేటిక్‌గా ఆర్డీఏ డేటాబేస్ నుంచి సదరు వాహనం చిరునామా గుర్తించే సర్వర్ ఆ చిరునామాతో ఈ–చలాన్ జారీ చేస్తుంది. దీన్ని పోస్టు ద్వారా బట్వాడా చేయిస్తారు. అయితే ప్రస్తుతం ఆర్టీఏ డేటాబేస్‌లో దాదాపు 50 శాతం వాహనదారుల చిరునామాలు అప్‌డేట్ కాలేదు. వాహనం ఖరీదు చేసినప్పుడు దాని యజమాని ఉన్న చిరునామానే రిజిస్ట్రేషన్ సమయంలో రికార్డుల్లో పొందుçపరుస్తున్నారు. ప్రస్తుతం యజమాని మరో చిరునామాలో నివసిస్తున్నాడు. అయినప్పటికీ ఆర్టీఏ రికార్డుల్లో మాత్రం పాత చిరునామానే ఉంటోంది. దీంతో ఈ చలాన్లు వాహన యజమానికి డెలివరీ కాకపోవడంతో తమ వాహనంపై చలాన్ జారీ అయిందనే విషయం యజమానికి తెలియట్లేదని ట్రాఫిక్ పోలీసులే అంగీకరిస్తున్నారు.
ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకోండిలా...
ఇలాంటి వాహనచోదకులు తమ వాహనంపై జారీ అయి ఉన్న పెండింగ్ ఈ–చలాన్ వివరాలు తెలుసుకోవడానికి ప్రధానంగా కొన్ని మార్గాలు ఉన్నాయని అధికారులు సూచిస్తున్నారు. ఈ–చలాన్ స్టేటస్ తెలుసుకునే మార్గాలు...నగర ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్ (www.ht p.gov.in), సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు వెబ్‌సైట్ (www.ctp.gov.in)లతో పాటు (HyderabadTrafficLive, Telanfana EChallan, Telanfana Traffic Police) మొబైల్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం).