‘హోదా’తోనే ప్రజలకు సంతృప్తి | Status' With People To satisfy: Ysrcp | Sakshi
Sakshi News home page

‘హోదా’తోనే ప్రజలకు సంతృప్తి

Published Sat, Aug 6 2016 4:06 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘హోదా’తోనే ప్రజలకు సంతృప్తి - Sakshi

‘హోదా’తోనే ప్రజలకు సంతృప్తి

* ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యం పరిహాసమే
* లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
* రెండున్నర గంటలపాటు వెల్‌లో నినాదాలు
* ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్


సాక్షి, న్యూఢిల్లీ: సాక్షాత్తూ ప్రధానమంత్రి పార్లమెంట్‌లో ఇచ్చిన హామీ నెరవేరకపోతే ప్రజాస్వామ్యం పరిహాసం కాదా? అని వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో నినదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా ప్రకటన తప్ప మరేదీ సంతృప్తిని ఇవ్వబోదని స్పష్టం చేసింది.  

హోదా కోసం పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన శుక్రవారం కూడా కొనసాగింది. ఉదయం 10.30కు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, పి.వి.మిథున్‌రెడ్డి నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం లోక్‌సభ సమావేశం కాగానే ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు తాను ప్రత్యేక హోదా అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

అయినప్పటికీ సభాపతి సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. దీంతో ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.  ‘ప్రధాని  వాగ్దానాన్ని నెరవేర్చాలి, ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అని దాదాపు రెండున్నర గంటలపాటు బిగ్గరగా  నినదించారు.
 
హామీలకు కట్టుబడి ఉన్నాం

ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనపై స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ లేచి ‘అధ్యక్షా! నేను మీ ద్వారా ఆందోళన చేస్తున్న ఏపీ ఎంపీలకు చెబుతున్నా.. ఇదివరకే మేం హామీ ఇచ్చాం. ఆర్థిక మంత్రి కూడా హామీ ఇచ్చారు. మేం ఏపీ ముఖ్యమంత్రితో సంప్రదిస్తూనే ఉన్నాం. ఏపీకి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. మేం ఆ అంశాన్ని పరిష్కరిస్తున్నాం. అందువల్ల సభ్యులు వారి స్థానాల్లో కూర్చొని సభా కార్యక్రమాలను కొనసాగేలా చూడాలి’ అని కోరారు.

ఈ నేపథ్యంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక వెల్‌లో నుంచి నినాదాలు చేస్తూ ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ప్రకటన తప్ప మరే పరిష్కారం అక్కర్లేదని వాగ్వాదానికి దిగారు. అయితే పక్కనే ఉన్న ఆర్థిక మంత్రి స్పందించలేదు. ఎంపీల ఆందోళన కొనసాగడంతో స్పీకర్ స్పందిస్తూ... ‘ఇది మీకు న్యాయం కాదు. మీరు మీ సీట్లలో కూర్చొండి’ అని కోరారు. మరోసారి మంత్రి అనంత్‌కుమార్ లేచి ‘ఆర్థిక మంత్రి నిన్న హామీ ఇచ్చారు.  

అందువల్ల ఎంపీలు వారివారి స్థానాల్లో కూర్చోవాలి’ అని పేర్కొన్నారు. అయినప్పటి కీ వైఎస్సార్‌సీపీ ఎంపీలు మధ్యాహ్నం 1.30కు సభ వాయిదా పడేంతవరకు తమ ఆందోళన కొనసాగించారు.  
 
హోదానే రావాలి: వైఎస్సార్ సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, రోడ్డు రవాణ వ్యవస్థ, రైల్వే, విమాన సౌకర్యాలు ఉండడంతో.. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. హోదా వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. అందు వల్లే వైఎస్సార్‌సీపీ హోదా కోసం ముందు నుంచి పోరాడుతోందన్నారు. ఎంపీలు వరప్రసాదరావు, బుట్టా రేణుకలతో కలిసి శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement