హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ వ్యవహారం అనేక మంది విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. చేతికందిన మెడికల్ సీటు చేజారిపోయే పరిస్థితి నెలకొనడంతో కష్టపడి చదివి మంచి ర్యాంకు సాధించినవారంతా గొల్లుమంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డొనేషన్ లేకుండా కేవలం రూ.10 వేలు మొదలు రూ.60 వేల ఫీజుతో చేరే సీటుకు వారు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణలో విద్యార్థులు మెడికల్ ప్రవేశాల కోసం ఏకంగా 4సార్లు ప్రవేశ పరీక్ష రాయాల్సిన దుస్థితి ఏర్పడింది. ‘నీట్’పై సుప్రీం తీర్పుతో ఎంసెట్-1ను వ్యవసాయ, ఆయుష్ కోర్సులకే పరిమితం చేశారు. నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ తీసురావడంతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంసెట్-2ను నిర్వహించారు. ప్రైవేటులోని మేనేజ్‌మెంట్, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లల్లో ప్రవేశాలకు నీట్-2 పరీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 3 పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎంసెట్-2 లీకేజీ కారణంగా మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు.
ఇలాంటి విద్యార్థులు ఎందరో..
మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ప్రాంతానికి చెందిన సాయిప్రియకు ఎంసెట్-1 పరీక్షలో 152 మార్కులు.. 244 ర్యాంకు వచ్చింది. అది కేవలం వ్యవసాయ, ఆయుష్ కోర్సులకే పరిమితం చేయడంతో ఎంసెట్-2 పరీక్ష రాసింది. 140 మార్కులతో 272వ ర్యాంకు సాధించింది. ఓసీ అయిన సాయిప్రియ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కేవలం రూ.10 వేల ఫీజుతో సీటు పొందే అవకాశం ఉంది. కానీ ఎంసెట్-2 రద్దు అయ్యే పరిస్థితితో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురై బుధవారం సచివాలయానికి వచ్చి మంత్రి లక్ష్మారెడ్డి ముందు తన గోడు వెళ్లబోసుకుంది. లీకేజీ ద్వారా లబ్ధి పొందిన వారి ర్యాంకులను మాత్రమే రద్దు చేసి, తనకు న్యాయం చేయాలని కోరింది. గతేడాది ఎంసెట్ పరీక్షలో సాయిప్రియకు 2 వేల ర్యాంకు రాగా.. ప్రభుత్వ సీటు 1685 ర్యాంకు వరకు వచ్చి ఆగిపోయింది. అందుకే ఈసారి ప్రభుత్వ మెడికల్ సీటు సాధించాలని కష్టపడి మంచి ర్యాంకు సాధించానని కన్నీరు మున్నీరైంది. ఈ అమ్మాయికి ఏపీ ఎంసెట్‌లోనూ 139 మార్కులు.. 203వ ర్యాంకు రావడం గమనార్హం.
ఎంసెట్ విద్యార్థుల నరకయాతన
Published Thu, Jul 28 2016 2:22 AM | Last Updated on Fri, Nov 9 2018 4:45 PM
Advertisement
Advertisement