
వారం ముందే పిల్లలకు పండుగ!
వారం రోజులు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు.
హైదరాబాద్: ఓవైపు ఎండలు ధుమధుమలాడిపోతుండటంతో స్కూలు పిల్లలకు ముందుగానే సెలవులు వచ్చేశాయ్. మండిపోతున్న ఎండలకు ఆపసోపలు పడుతూ.. బరువైన బ్యాగులు మోస్తూ కష్టాలు పడుతూ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. ఎండలు, వడగాడ్పుల నేపథ్యంలో వారం ముందుగానే వేసవి సెలువులు ప్రకటించింది.
వారం రోజులు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ నెల 24 కు బదులు 16వ తేదీ నుంచే రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులిచ్చేయమని ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రచండంగా వీస్తున్న వడగాల్పుల దృష్ట్యా విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 13వ తేదీన తిరిగి పాఠశాలల ప్రారంభం కానున్నాయి.