హిందూ మతాచారాల్లో కోర్టుల జోక్యం తగదు
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర
హైదరాబాద్: హిందూ మతాచారాల్లో కోర్టుల జోక్యం తగదని, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులతో కమిటీ వేసి వారి అభిప్రాయం తెలుసుకోవాలని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శనిశింగనాపూర్ దేవాలయంలో మహిళలకు ప్రవేశం కల్పిస్తూ కోర్టులు నిర్ణయం తీసుకోవడంపై స్పందిస్తూ... హిందూ దేవాలయాల ఆచారాలు, సంప్రదాయాల మీద కుట్రపూరిత ఆందోళనతో కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తున్నారని అన్నారు.
‘హిందూ మతంలో అందరూ సమానమే అయినప్పుడు.. మహిళలపట్ల వివక్షత చూపడం ఎంతవరకు సబబనే అంశాన్ని కోర్టు ఎత్తి చూపింది. ఏ మతంలో లేని విధంగా హిందూ మతంలో మహిళలకు అగ్రస్థానం ఉందన్న విషయాన్ని నవసమాజం గుర్తించాలి. ఇంటికి దీపం ఇల్లాలనే పిలుపుతో మహిళలను అమ్మవారిగా గుర్తించడం హిందూ మతంలో తప్ప మరే మతంలో లేదు. హిందూ మతంలో మాదిరి ఇతర మతాల్లో ధూప, దీప, కైంకర్యాలతో కూడుకున్న విలక్షణమైన దైవారాధనలు ఉండవు. రుతుక్రమాలు, గర్భధారణ వంటి ఇబ్బందులు ఉన్నాయి కనుకనే మహిళలకు దేవాలయాల్లో ప్రవేశం లేదనడం తప్పితే హిందూమతంలో వారికి అపార గౌరవం ఉంది’ అని స్వామి చెప్పారు.
లౌకికవాదం పేరుతో కుట్ర...
‘లౌకికవాదం పేరుతో హిందూ మతంపై అనేక రకాలుగా కుట్రపూరిత దాడులు జరుపుతూ కొంత మంది సామాజికవేత్తలు కోర్టులకు వెళ్తున్నారు. అదే నెపంతో హిందూ మతాన్ని అవహేళన చేస్తున్న రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు ఇతర మతాల్లో ఉన్న వివక్షను ఎందుకు ప్రశ్నించరు? ఓ మతంలో మహిళలు పర పురుషులు చూడకూడదనే కట్టుబాట్లను ప్రయోగించి ఆమె ముఖాన్ని కూడా కప్పుకొని తిరుగుతుంటే సమాజంలో సమాన హక్కులు లేవని ఎందుకు అడగరు? ఆ మతంలో మహిళలను ప్రార్థనాలయాలకే రానివ్వరు. ఇది మహిళా వివక్ష కాదా? సమాజంలో ఉన్న అన్ని మతాల్లో మహిళల పట్ల వివక్షత ఎత్తి చూపి సుప్రీంకోర్టు న్యాయ నిర్ణయం చేస్తే బాగుంటుంది.
గతంలో ఉన్నత న్యాయస్థానాలు హిందూ దేవాలయాల విషయమై చురకలు వేసినా... నేటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ రకమైన దాడి తిరుమల దేవాలయంలో కూడా జరిగితే హిందూ సమాజం ఏమైపోతుంది? ఉన్నత న్యాయస్థానాలు హిందూ మతపెద్దలను కమిటీగా వేసి నవసమాజానికి కొత్త నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రణాళికలు తయారుచేయాలి. ఇతర మతాల విషయంపై కూడా కోర్టులు ప్రభుత్వాలకు సూచనలు చేశాయి. కానీ హిందూ మతంపై ఇచ్చిన నిర్ణయాలపై ప్రభుత్వాలు అత్యుత్సాహం చూపించడానికి కారణం ఓటు బ్యాంకు రాజకీయాలే’ అని స్వరూపానందేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు.