సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య కేసును ఛేదించిన పోలీసులు
హైదరాబాద్ : సికింద్రాబాద్లో సాప్ట్వేర్ ఉద్యోగి సంజయ్ జుంగీ హత్యను నగర టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం ఛేదించారు. ఈ హత్యతో ప్రమేయం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు. ఆ తర్వాత పోలీసులు విలేకర్లతో హత్య జరిగిన తీరును వివరించారు. సంజయ్ జుంగీ హైటెక్ సిటీలో విధులు ముగించుకుని గురువారం అర్థరాత్రి ఇంటికి బయలుదేరాడు.
ఆ క్రమంలో కూకట్పల్లి వెళ్లి అక్కడ స్నేహితులతో కలసి పార్టీలో బాగా మందుకొట్టాడు.. ఆ తర్వాత స్నేహితుడు బైక్పై పంజాగుట్టకు సంజయ్ చేరుకున్నాడు. క్యాబ్ కోసం ఎదురు చూస్తున్న క్రమంలో బంజారాహిల్స్ నుంచి పాత బస్తీ వెళ్తున్న క్యాబ్ ను సంజయ్ ఆపి ... లిఫ్ట్ కోరాడు. అందుకు వారు సమ్మతించడంతో... సంజయ్ ఆ కారు ఎక్కాడు. అయితే బాగా తాగి ఉండటం వల్ల సంజయ్ అప్పటికే క్యాబ్ లో ఉన్నవారితో ఘర్షణకు దిగాడు. దీంతో వారి మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
ఇంతలో సికింద్రాబాద్లో స్వప్నలోక్ కాంప్లెక్స్ స్టాప్ రావడంతో సంజయ్ కారు దిగాడు.ఆ తర్వాత కూడా కారులోని వారిని విపరీతంగా దూషించాడు. దీంతో అప్పటికే సంజయ్పై ఆగ్రహంతో ఉన్న వారు... సంజయ్పై దాడి చేసి కత్తితో పొడిచాడు. దీంతో సంజయ్ నడిరోడ్డుపై కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. అనంతరం వారు కారులో అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు.
కారు నెంబర్ ద్వారా వారు ప్రయాణించిన కారును గుర్తించారు. ఆ కారును పాతబస్తీలో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. క్యాబ్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... నిందితుల వివరాలు తెలిపాడని పోలీసులు చెప్పారు. అనంతరం వారిని విచారించగా హత్యకు దారి తీసిన పరిస్థితులు వారు విశదీకరించారని పోలీసులు వెల్లడించారు.