సీట్లపై పీటముడి | TDP, BJP, Greater Hyderabad Municipal Elections in Seat Distribution | Sakshi
Sakshi News home page

సీట్లపై పీటముడి

Published Mon, Jan 11 2016 3:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

TDP, BJP, Greater Hyderabad Municipal Elections in Seat Distribution

* సర్దుబాటుపై టీడీపీ, బీజేపీ పేచీలు
* మీ కంటే మాకే ఎక్కువ కావాలంటూ పట్టు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మధ్య సీట్ల పంపకాలపై పీటముడి నెలకొంది. గ్రేటర్‌లో తమకే బలం ఎక్కువనే అభిప్రాయంతో ఉన్న రెండు పార్టీల నేతలు తక్కువ సీట్లు పొందేందుకు ఒప్పుకోవడం లేదు. రెం డు పార్టీల మధ్య మొదలైన ప్రాథమిక చర్చల్లో ఈ విషయం స్పష్టమైంది. ఆదివారం ఎన్‌టీఆర్ భవన్‌లో, ఓ బీజేపీ నేత నివాసంలో రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనతోపాటు ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే అంశాలపై చర్చించిన ట్లు సమాచారం.

మొత్తమున్న 150 సీట్లలో పాతబస్తీలో ఎంఐఎంకు పట్టున్న సుమారు 30 సీట్లను మినహాయిస్తే మిగిలిన సీట్లు 120 మాత్రమేనని, వీటిలో గెలుపు అవకాశాలున్న వాటి విషయంలోనే ఇరు పార్టీల నేతలు పట్టుపడుతున్నారని తెలిసింది. బీజేపీ 60 సీట్లకు పోటీ చేయాలని టీడీపీ ప్రాథమికంగా ప్రతిపాదించగా, బీజేపీ తోసిపుచ్చినట్లు తెలిసింది. తెలంగాణలో టీడీపీకి ఏమాత్రం బలం లేదని, సెటిలర్ల బలం చూసుకుంటే తెలంగాణ స్థాని కుల ఓట్లు కూడా అవసరమేనని బీజేపీ నేతలు చెప్పినట్లు సమాచారం.

నాలుగు స్థానాల్లో బీజేపీ ఎక్కువ పోటీ చేసినా, తెలంగాణ ప్రజ లు ఆమోదిస్తారని.. టీడీపీకి ఆ పరిస్థితి లేదని బీజేపీ ముఖ్యనేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సెటిలర్లు కూడా బీజేపీకి ఓటేసేందుకు మొగ్గు చూపుతున్నారని, టీడీపీకి చెందిన 30 మంది కార్పొరేటర్లు టీఆర్‌ఎస్‌లో చేరడం ఆ పార్టీకి ప్రతికూలమని కూడా పేర్కొంటున్నారు. కేసీఆర్‌తో చంద్రబాబు మిత్రుత్వం నెరపడం వల్ల సెటిలర్ల ఓట్లు టీడీపీకన్నా టీఆర్‌ఎస్‌కే అనుకూలమవుతాయన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే  బీజేపీకి లేని కార్యకర్తల బలం, ఓటర్లు టీడీపీకి ఉన్నారని తెలుగుదేశం నాయకులు వాదించినట్లు తెలిసింది.

బీజేపీ బలముందని చెబుతున్న కోర్‌సిటీలో మెజారిటీ స్థానాలు బీజేపీ పోటీ చేసినా తమకు అభ్యంతరం లేదని, శివార్లలో మాత్రం 60 శాతానికి పైగా డివిజన్‌లలో తాము పోటీ చేస్తామని ఓ కీలక టీడీపీ నేత వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా ఈనెల 12న చంద్రబాబు, కేంద్ర మంత్రి జెపీ లడ్డాలతో జరిగే బహిరంగసభ తరువాత సీట్ల పంపకం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ, బీజేపీ నేతలు తమకు బలం ఉందని భావిస్తున్న డివిజన్ల జాబితాలను మార్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement