టీడీడబ్ల్యూఎస్‌సీకి ప్రభుత్వ అనుమతి
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల నుంచి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ (టీడీడబ్ల్యూఎస్‌సీ) రూ.4,287 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం రుణంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టు పనులకు గాను రూ.2,428 కోట్లను కెనరా బ్యాంకు అందజేయనుంది. అలాగే ఆసిఫాబాద్ సెగ్మెంట్ కోసం ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.635 కోట్లు, ఎస్సార్‌ఎస్పీ-అదిలాబాద్ సెగ్మెంట్ కోసం రూ.1,224 కోట్లను కార్పొరేషన్ బ్యాంకు నుంచి తీసుకునేందుకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. నిబంధనల మేరకు ఆయా బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని టీడీడబ్ల్యూ ఎస్ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్‌ను సర్కారు ఆదేశించింది.