అమ్మాయిలు అదుర్స్ | telangana eamcet-3 ranks | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అదుర్స్

Published Fri, Sep 16 2016 2:32 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM

అమ్మాయిలు అదుర్స్

అమ్మాయిలు అదుర్స్

ఎంసెట్-3 టాప్-10లో ఆరుగురు బాలికలే

⇒  ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి
99.07 శాతం మందికి ర్యాంకులు
రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులకు రేపు సాయంత్రం వరకు గడువు
రేపటి నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్
బీఫార్మసీలో చేరిన వారికి ఈనెల 20 వరకు అవకాశం

 
సాక్షి, హైదరాబాద్
వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-3లో బాలికలు సత్తా చాటారు. టాప్-10లో ఆరుగురు బాలికలు ఉండగా నలుగురు బాలురు ఉన్నారు. ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలను గురువారం జేఎన్టీయూహెచ్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. మొత్తంగా ఎంసెట్-3లో 99.07% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈనెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 56,153 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా... 37,178 మంది పరీక్ష రాశారు.
 
ఇందులో 36,834 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. 70 మంది ఇంటర్ ఫెయిల్ కావడం, 259 మందికి సంబంధించిన ఇంటర్ వివరాలు లభించకపోవడం, మరో 15 మంది ఎంసెట్‌లో అర్హత సాధించకపోవడంతో వారికి ర్యాంకులను ఇవ్వలేదు. ఈసారి ఎంసెట్ ఫలితాల విడుదల కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిగానీ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిగానీ హాజరుకాకపోవడం గమనార్హం.
 
 విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
 ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తక్కువ సమయంలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించామని పాపిరెడ్డి పేర్కొన్నారు. కేవలం 40 రోజుల్లోనే నోటిఫికేషన్ మొదలుకుని కాన్ఫిడెన్షియల్ వర్క్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిని పూర్తిచేసిన ఎంసెట్ కమిటీని అభినందించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన వారు ఈనెల 20వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని.. వారి సర్టిఫికెట్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఫార ్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన విద్యార్థులు వెళ్లిపోతే నష్టం వస్తుందని భావించవద్దని.. ఆయా కాలేజీలకు అలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పారు.
 
 వేగంగా చేపట్టడం వల్లే తప్పులు.
 ఇక ఎంసెట్-2 లీకేజీలో ఆరోపణ లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సంబంధించి కేసు ఫైనల్ కానందున వారిని పరీక్షలకు అనుమతించామని ఎంసెట్-3 కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఎంసెట్-3 పేపర్ రూపకల్పనను అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలో, జాగ్రత్తగా చేశామని... ఆ క్రమంలో 7 ప్రశ్నలకు జవాబుల ఆప్షన్లు రాలేదని, ఒకటి సిలబస్‌లో లేని ప్రశ్న వచ్చిందని తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ఎంసెట్-3 ఫైనల్ కీని తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. విద్యార్థులు గురువారం రాత్రి నుంచే ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను శుక్రవారం నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వాటిలో ఏమైనా తేడాలుంటే నిర్ణీత ఫీజు చెల్లించి, ఈనెల 17 సాయంత్రం 5 గంటలలోగా వెబ్‌సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు.


 ఎంసెట్-3 టాపర్లు వీరే..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement