EAMCET-3
-
ఎంసెట్ ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-3లో అర్హత సాధించిన స్పెషల్ కేటగిరీ విద్యార్ధులకు శనివారం కౌన్సిలింగ్లో భాగంగా అర్హత ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. కూకట్పల్లి జేఎన్టీయూ అడ్మిషన్స్ విభాగంలో ఉదయం నుంచి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ర్యాంకుల వారీగా హాజరై అధికారుల వద్ద తమ సర్టిఫికెట్లను అందజేశారు. మూడు రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కేటగిరీలో శనివారం ఆంగ్లో ఇండియన్స్, క్రీడా విభాగంలో 10000 ర్యాంకు వరకూ విద్యార్దులు హాజరయ్యారు. సోమవారం వరకూ మిగిలిన ర్యాంకులతో పాటు ఇతర విభాగాలైన ఎన్సీసీ, దివ్యాంగులు, ఆర్మీ, పీఎంసీ విభాగాల విద్యార్ధులు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. -
24వేల ర్యాంక్ కార్డును 13వేలుగా మార్ఫింగ్..
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3లో ఆ యువతికి 24 వేల ర్యాంకు వచ్చింది. కానీ తనకు 13వ ర్యాంకు వచ్చిందంటూ వాదించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. మెడికల్ కౌన్సిలింగ్ లో భాగంగా శనివారం నుంచి సర్టిఫికేట్ల పరిశీలన ప్రారంభమైంది. తెలంగాణలోని ఐదు కేంద్రాల్లో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు విద్యార్థినీ విద్యార్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలోని దూర విద్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వెరిఫికేషన్ కౌంటర్ లో ఓ యువతి గందరగోళం సృష్టించింది. ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపటికే ఒక యువతి ఎంసెట్ 3లో తనకు 13వ ర్యాంకు వచ్చిందని ర్యాంక్ కార్డును అధికారులకు చూపించింది. అయితే ఆ ర్యాంక్ కార్డును మార్ఫింగ్ చేసినట్లు గుర్తించిన అధికారులు అనుమానంతో పేరు, ఇతర వివరాలను పరిశీలించగా ఆమె అసలు ర్యాంక్ 24 వేలు అని వెల్లడైంది. కానీ ఆ యువతి మాత్రం తన వాదనను అలాగే కొనసాగించడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. 'ఒక యువతి ఏడుస్తూ వచ్చి తనకు 13వ ర్యాంకే వచ్చిందని అలజడి చేయబోయింద'ని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. ఈ వ్యవహారంపై జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదు చేశామని, తప్పుడు ర్యాంక్ కార్డును చూపిన విద్యార్థినిపై కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు. -
నాడు 02.. నేడు 50
ఎంసెట్-3లో ఐశ్వర్యకు 50వ ర్యాంకు ఎంసెట్-2లో రెండో ర్యాంకు గజ్వేల్: నిరంతర శ్రమతో ఎంసెట్-2లో రాష్ట్ర స్థాయిలోనే రెండో ర్యాంకును సాధించిన గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన కాసం ఐశ్వర్య... తాజాగా గురువారం వెలువడిన ఎంసెట్-3 ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించింది. పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడినా... అధైర్యపడకుండా మరోసారి తన సత్తాను చాటింది. గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన కాసం శ్రీనివాస్, అమృత దంపతులు గత కొన్నేళ్లుగా ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడ్డారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. కిరాణా దుకాణం, ఇతర చిన్నపాటి వ్యాపారాలే వీరి జీవనాధారం. మధ్యతరగతి జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ తన పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కష్టపడుతున్నాడు. ఈ దంపతులకు కాసం ఐశ్వర్య, క్రాంతికుమార్ సంతానం. క్రాంతికుమార్ ప్రస్తుతం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఐశ్వర్య సైతం ఇదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఆమె కూకట్‌పల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చేసింది. తనకోసం నిరంతరం శ్రమిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ఐశ్వర్య తీవ్రంగా కృషి చేసింది. ఈ క్రమంలోనే ఇంటర్లో 990 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే ఉత్సాహంతో ఎంసెట్-2 రాసి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో ఐశ్వర్య, ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. వారి ఆనందం కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. ఇంతలో ఆ పరీక్ష రద్దు కావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెల్సిందే. అయినా ఐశ్వర్య అధైర్యపడకుండా మరోసారి పరీక్ష సిద్ధమైనా ఆ విద్యార్థిని తాజా ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించి తన సత్తాను చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పరీక్ష రద్దు కావడంతో కొద్ది రోజులు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు. అయినా తేరుకొని తిరిగి శ్రమించి పరీక్ష రాశానని, ఈ ర్యాంకు సాధించడం కూడా సంతోషంగానే ఉందని తెలిపింది. -
అమ్మాయిలు అదుర్స్
⇒ ఎంసెట్-3 టాప్-10లో ఆరుగురు బాలికలే ⇒ ఫలితాలు విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి ⇒ 99.07 శాతం మందికి ర్యాంకులు ⇒ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులకు రేపు సాయంత్రం వరకు గడువు ⇒ రేపటి నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ⇒ బీఫార్మసీలో చేరిన వారికి ఈనెల 20 వరకు అవకాశం సాక్షి, హైదరాబాద్ వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్-3లో బాలికలు సత్తా చాటారు. టాప్-10లో ఆరుగురు బాలికలు ఉండగా నలుగురు బాలురు ఉన్నారు. ఈనెల 11న నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలను గురువారం జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి విడుదల చేశారు. మొత్తంగా ఎంసెట్-3లో 99.07% మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఈనెల 11న నిర్వహించిన ఈ పరీక్షకు హాజరయ్యేందుకు 56,153 మంది విద్యార్థులకు అవకాశం కల్పించగా... 37,178 మంది పరీక్ష రాశారు. ఇందులో 36,834 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. 70 మంది ఇంటర్ ఫెయిల్ కావడం, 259 మందికి సంబంధించిన ఇంటర్ వివరాలు లభించకపోవడం, మరో 15 మంది ఎంసెట్‌లో అర్హత సాధించకపోవడంతో వారికి ర్యాంకులను ఇవ్వలేదు. ఈసారి ఎంసెట్ ఫలితాల విడుదల కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డిగానీ, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిగానీ హాజరుకాకపోవడం గమనార్హం. విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తక్కువ సమయంలో పకడ్బందీగా పరీక్షలను నిర్వహించామని పాపిరెడ్డి పేర్కొన్నారు. కేవలం 40 రోజుల్లోనే నోటిఫికేషన్ మొదలుకుని కాన్ఫిడెన్షియల్ వర్క్, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడిని పూర్తిచేసిన ఎంసెట్ కమిటీని అభినందించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల 17వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇప్పటికే బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన వారు ఈనెల 20వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాలేజీలు, యూనివర్సిటీలు విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని.. వారి సర్టిఫికెట్లను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బీఫార ్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో చేరిన విద్యార్థులు వెళ్లిపోతే నష్టం వస్తుందని భావించవద్దని.. ఆయా కాలేజీలకు అలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని చెప్పారు. వేగంగా చేపట్టడం వల్లే తప్పులు. ఇక ఎంసెట్-2 లీకేజీలో ఆరోపణ లు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సంబంధించి కేసు ఫైనల్ కానందున వారిని పరీక్షలకు అనుమతించామని ఎంసెట్-3 కమిటీ చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. ఎంసెట్-3 పేపర్ రూపకల్పనను అత్యంత రహస్యంగా, తక్కువ సమయంలో, జాగ్రత్తగా చేశామని... ఆ క్రమంలో 7 ప్రశ్నలకు జవాబుల ఆప్షన్లు రాలేదని, ఒకటి సిలబస్‌లో లేని ప్రశ్న వచ్చిందని తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ సిఫారసు మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇక ఎంసెట్-3 ఫైనల్ కీని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. విద్యార్థులు గురువారం రాత్రి నుంచే ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రాలను శుక్రవారం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. వాటిలో ఏమైనా తేడాలుంటే నిర్ణీత ఫీజు చెల్లించి, ఈనెల 17 సాయంత్రం 5 గంటలలోగా వెబ్సైట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. ఎంసెట్-3 టాపర్లు వీరే.. -
15నే ఎంసెట్-3 ఫలితాలు?
హైదరాబాద్: ఎంసెట్-3 పరీక్ష ఫలితాలను సెప్టెంబరు 15వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముందుగానే ఈనెల 16వ తేదీన ఫలితాలు విడుదల చేయాలనుకున్నా.. ప్రవేశాలు ఆలస్యం కాకుండా ఒక రోజు ముందుగానే ప్రకటించాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కమిటీ విడుదల చేసిన రాత పరీక్ష ప్రాథమిక కీపై ఈనెల 14వ తేదీన సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం నిపుణుల కమిటీ సమావేశమై అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని ఖరారు చేయనుంది. ఈ ప్రకారం 15వ తేదీనే తుది ర్యాంకులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించాలని, లేదంటే 16న ఫలితాలను విడుదల చేయాలని కమిటీ భావిస్తోంది. -
ప్రభుత్వమే బాధ్యత వహించాలి...
ఎంసెట్-3 వైఫల్యంపై కిషన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్ : పరీక్షాపత్రం వెల్లడైన కారణంగా ఎంసెట్-2ని రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్-3ని నిర్వహించడంలో కూడా పూర్తిగా విఫలమైందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎంసెట్-3 ప్రశ్నాపత్రంలో 160కి గానూ 15 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయంటే ప్రభుత్వం ఎంత నిరక్ష్యం వహించిందో అర్థమవుతోందన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్‌కు ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్-3 పరీక్ష తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో గైర్హాజరయ్యారు. పరీక్ష కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికి మూడుసార్లు పరీక్ష పెట్టడంతో విద్యార్థుల గైర్హాజరు శాతం ఎక్కువగా ఉందని పరిశీలకులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. రీజినల్ కోఆర్డినేటర్, వీఆర్ సిద్ధార్థఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.వి.రత్నప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ఎంసెట్-3 మెడిసిన్, బీడీఎస్ సీట్లకు ప్రవేశ పరీక్షకు విజయవాడ రీజియన్‌లో 14 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 7542 మంది రాయాల్సి ఉండగా కేవలం 4213 మంది హాజరయ్యారని తెలిపారు. కాగా ఎంసెట్ రాయటానికి విద్యార్థులతో పాటు తల్లితండ్రులు పెద్దఎత్తున తరలి రావటంతో పరీక్షా కేంద్రాల వద్ద హడావుడి చోటు చేసుకుంది. -
నేడు టీఎస్ ఎంసెట్–3
కేయూ క్యాంపస్ : రాష్ట్రంలోని వైద్య విద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించేందుకు ఆదివారం ఎంసెట్–3 పరీక్ష నిర్వహించనున్నారు. దీనికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. టీఎస్ ఎంసెట్–3కు 4,710 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. నేడు(ఆదివారం) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వరంగల్ నగరంలో 8 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హన్మకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కేయూలోని కో ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాల, యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, హ్యుమానిటీస్ భవనం, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాల, వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఎల్బీ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి ఎంసెట్–3 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామని రీజినల్ కోఆర్డినేటర్ మల్లారెడ్డి తెలిపారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో నిర్దేశించిన సమయానికి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే(9 గంటల వరకు) చేరుకోవాలని సూచించారు. నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రలు, ఫొటోలను సేకరించాల్సి ఉన్నందున విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 12 మంది పరిశీలకులు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 8 మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను నియమించామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి నలుగురు, జేఎన్టీయూ నుంచి మరో నలుగురు ప్రత్యేక పరిశీలకులు పర్యవేక్షిస్తారన్నారు. విద్యార్థులు గడియారాలు, సెల్ఫోన్లు లేదా ఇతర ఎలక్రానిక్ పరికరాలు తీసుకెళ్లొద్దన్నారు. ఇక పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తారని మల్లారెడ్డి తెలిపారు. కేయూ ఆవరణలో నాలుగు పరీక్ష కేంద్రాలు.. కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. ఇందులో కోఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రం కెనాల్ ప్రాంతంలో ఉంటుందన్నారు. అక్కడ పరీక్ష రాయాల్సిన విద్యార్థులు యూనివర్సిటీ గేట్ల నుంచి కాకుండా యూనివర్సిటీ రోడ్డులోని డబ్బాలు వయా గుండ్ల సింగారం రోడ్డు మీదుగా కోఎడ్యుకేషన్ కళాశాలకు చేరుకోవచ్చని తెలిపారు. -
ఎంసెట్–3కి అంతా సిద్ధం
నేడు పరీక్ష – హాజరు కానున్న 2160 మంది విద్యార్థులు – నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే మెడిసిన్, డెంటల్ ఎంసెట్–3కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏ, బీ పరీక్ష కేంద్రాలు, కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో, వృత్తి విద్యా కళాశాలలో ఏ, బీ కేంద్రాలు, రామగిరిలోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఒకటి చొప్పున మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2160 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. ఎంసెట్ –2 రాసి హాల్ టికెట్లు ఉన్న విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. పరీక్ష కేంద్రాలను గంట ముందుగానే తెరిచి విద్యార్థులను అనుమతిస్తారు. విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. శనివారం ఎన్జీ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను ఎంసెట్–3 ప్రత్యేక పరిశీలకుడు ధర్మానాయక్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు. -
ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీ కోసం ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్న ఎంసెట్-3 కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్-3 కన్వీనర్ యాదయ్య తెలిపారు. కూకట్పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్ష 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని, మొత్తం 56,153 మంది విద్యార్థులు హాజరుకానున్నారని వివరించారు. వీరి కోసం రెండు రాష్ట్రాల్లో 96 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాల్‌టికెట్లను 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. నిముషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని చెప్పారు. బయోమెట్రిక్ విధానాన్ని పాటిస్తామని, అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు ఆన్లైన్లో వారు పూర్తి చేసిన దరఖాస్తును కూడా తీసుకురావాలని కోరారు. ఎంసెట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులు కూడా ఎంసెట్-3కు అనుమతిస్తున్నామని అన్నారు. -
ఎల్లుండి ఎంసెట్-3 షెడ్యూల్
హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంసెట్-3 నిర్వహణపై కమిటీ భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఎల్లుండి పూర్తిస్థాయి షెడ్యూల్ విడుదల చేయాలని కమిటీ శుక్రవారం నిర్ణయించింది. కొత్త హాల్ టికెట్లతో పరీక్షకు అనుమతి ఇస్తామని కన్వీనర్ యాదయ్య తెలిపారు. సెప్టెంబర్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవచ్చని ఆయన చెప్పారు. ఎంసెట్-2కు దరఖాస్తు చేసినవారికే ఎంసెట్-3లో అవకాశం ఉంటుందన్నారు. పరీక్ష జరిగిన వారం రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. వచ్చే నెల 11న ఎంసెట్-3 నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో ఇప్పటివరకూ 34మంది బ్రోకర్లుగా వ్యవహరించినట్లు గుర్తించిన సీఐడీ తాజా దర్యాప్తులో వారి సంఖ్యను 42గా తేల్చింది. -
‘ఆ విద్యార్థులూ’ ఎంసెట్-3 రాయొచ్చు
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై కడియం విద్యార్థులకు, టీచర్లకు బయోమెట్రిక్ సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ‘‘నిందితులైన విద్యార్థులపై అభియోగాలు 100% నిర్ధారణయితే తప్ప వారిపై చర్యలకు అవకాశం లేదు. వారు కూడా పరీక్ష రాసే వీలుంటుంది. దోషులని విచారణలో తేలితే, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది నిర్ణయిస్తాం. ఎంసెట్-2 పేపర్ లీకేజీ బాధ్యులపై సీఎం కేసీఆర్ చర్యలు చేపడతారు’’ అని వివరించారు. మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), గురుకులాల్లో నాణ్యత ప్రమాణాలపై బుధవారం సమీక్ష అనంతరం విలేకరులకు ఆయన ఈ మేరకు వివరించారు. ఇక వైస్ చాన్స్లర్ల నియామకాల జీవోల కొట్టివేతపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. పదో తరగతిలో జిల్లా సగటు కంటే తక్కువగా ఫలితాలు వచ్చిన కేజీబీవీల స్పెషలాఫీసర్లను తొలగించడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఫలితాల పెంపునకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని లేఖలు రాస్తున్నామన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువుందని, విద్యార్థుల్లేని పాఠశాలలు, హేతుబద్ధీకరణలపై ఆ తరవాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని 192 మోడల్ స్కూళ్లు, 47 గురుకులాలు, 396 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాణ్యత ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కడియం ఆదేశించారు. వాటిలొ విద్య, బోధన, పరీక్షలపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షకు రాష్ట్ర స్థాయిలో విద్యా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ‘‘విద్యారంగంలో నిపుణులైన 10 నుంచి 15 మంది రిటైర్డ్ అధికారులతో వెంటనే ఈ కమిటీని వేయండి. పాఠశాలల స్థాయిలో తల్లిదండ్రులతో అడ్వైజరీ, మెస్ కమిటీలూ ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఈ నెల 31లోగా ఏర్పాటవ్వాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోండి. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను ఫిబ్రవరి, మార్చి నెలల్లో కాకుండా ఆగస్టు నుంచే ప్రారంభించండి. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో టాయిలెట్లు, తాగునీరు, ఫర్నిచర్ వంటి సదుపాయాలన్నీ కల్పించండి. వీటన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయండి. మెనూ వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టండి. మెనూ అమలును రాష్ట్ర స్థాయి బృందాలతో తనిఖీ చేయిస్తాం. నిధుల సమస్య ఉంటే చెప్పండి, నిధులిస్తాం. టీచర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేయండి. సీసీ కెమెరాలు పెట్టండి’’ అని ఆదేశించారు. టీచర్లకు సబ్జెక్టుల ఫౌండేషన్ కోర్సులు, హెడ్మాస్టర్లకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. -
'ఎంసెట్-3 రాసేందుకు అందరూ అర్హులే'
హైదరాబాద్ : ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అందరూ అర్హులేనని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఎంసెట్-2 రాసినవారంతా ఎంసెట్-3 పరీక్ష రాసేందుకు అర్హులేనన్నారు. పేపర్ లీక్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఎంసెట్-3 రాసేందుకు అనుమతిస్తామన్నారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ ఎంసెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీలో విద్యార్థుల ప్రమేయం ఇంకా నిర్థారణ కాలేదన్నారు. అయితే తప్పు చేసినవారిపై చర్యలు తప్పవని కడియం శ్రీహరి హెచ్చరించారు. సీఐడీ నివేదిక రాగానే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారని ఆయన తెలిపారు. విద్యా వాలంటీర్ల నియామకం 80 శాతం పూర్తయిందని కడియం శ్రీహరి తెలిపారు. కాగా ఎంసెట్-3 సెప్టెంబరు 11న జరుగుతుంది. -
సెప్టెంబర్ 11న ఎంసెట్-3
► రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ► కన్వీనర్‌గా జేఎన్టీయూ రిజిస్ట్రార్ యాదయ్య ► సెప్టెంబర్ 20 నాటికల్లా ర్యాంకులు! ► ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నవారందరికీ అవకాశం ► పాత హాల్టికెట్లతోనే పరీక్షకు అనుమతి ► ఎంసెట్ కమిటీ భేటీ తర్వాత మార్గదర్శకాలపై స్పష్టత ► సీఎం ఆదేశంతో అధికారులతో భేటీ అయిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ హైదరాబాద్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెల 11వ తేదీన ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఎంసెట్-3 నిర్వహణ తేదీని కూడా వెల్లడించింది. జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్యను ఎంసెట్-3 కన్వీనర్‌గా నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో జేఎన్టీయూహెచ్లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఇతర అధికారులు సమావేశమై పరీక్ష తేదీని నిర్ణయించారు. ఎంసెట్ కమిటీ సమావేశం తర్వాత ర్యాంకుల వెల్లడి తేదీని, ఇతర మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వీలైతే వచ్చేనెల 20 నాటికి ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో ఎంసెట్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ముచ్చటగా మూడోసారి.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం రాష్ట్రంలో మూడోసారి(ఏపీ ఎంసెట్ కాకుండా) ఎంసెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత మే 15న ఎంసెట్-1 నిర్వహించారు. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కారణంగా అది ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ తేవడంతో మళ్లీ మెడికల్ సీట్లలో ప్రవేశాల కోసం జూలై 9న ఎంసెట్-2 నిర్వహించారు. తీరా లీకేజీ కారణంగా ఎంసెట్-2 రద్దు చేయడంతో ఇప్పుడు మూడోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది. 56,153 మందికి అవకాశం ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ఎంసెట్-2కు తెలంగాణతోపాటు ఏపీకి చెందిన మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50,961 మంది పరీక్షకు హాజరుకాగా.. 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. ప్రస్తుతం ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ పాత హాల్‌టికెట్లతో ఎంసెట్-3కి హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. వారంతా వెబ్సైట్ నుంచి మళ్లీ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ లేకుండానే పరీక్ష ఎంసెట్-2 మాదిరి ఎంసెట్-3ని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది. ఎంసెట్-1లో మెడికల్ ఎంసెట్ పరీక్షను హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించారు. అయితే ఎంసెట్-2 పరీక్షను మాత్రం ఆఫ్‌లైన్‌లోనే నిర్ణయించారు. ఇప్పుడు ఎంసెట్-3ని కూడా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీ కూడా ఇచ్చే అవకాశం లేదు. దీనిపై ఎంసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ డాటాను మాత్రం సేకరించనున్నారు. క్వశ్చన్ బ్యాంకు ఏర్పాటు, ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ తదితర అంశాల్లో పక్కాగా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. -
ఎంసెట్-2 అధికారికంగా రద్దు
-
ఎంసెట్-2 అధికారికంగా రద్దు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 అధికారికంగా రద్దైంది. ఎంసెట్-3 షెడ్యూల్ ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు. కొంత మంది చేసిన తప్పులకు వేలాది మందిని ఇబ్బంది పెట్టాల్సిరావడం బాధగా ఉందన్నారు. ఎంసెట్-3కి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు అందజేశారు. -
ఎంసెట్-3కు ఆదేశాలివ్వండి