‘ఆ విద్యార్థులూ’ ఎంసెట్-3 రాయొచ్చు
ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై కడియం
విద్యార్థులకు, టీచర్లకు బయోమెట్రిక్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ ఎంసెట్-3 రాసేందుకు అర్హులేనని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ‘‘నిందితులైన విద్యార్థులపై అభియోగాలు 100% నిర్ధారణయితే తప్ప వారిపై చర్యలకు అవకాశం లేదు. వారు కూడా పరీక్ష రాసే వీలుంటుంది. దోషులని విచారణలో తేలితే, వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలన్నది నిర్ణయిస్తాం. ఎంసెట్-2 పేపర్ లీకేజీ బాధ్యులపై సీఎం కేసీఆర్ చర్యలు చేపడతారు’’ అని వివరించారు. మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), గురుకులాల్లో నాణ్యత ప్రమాణాలపై బుధవారం సమీక్ష అనంతరం విలేకరులకు ఆయన ఈ మేరకు వివరించారు. ఇక వైస్ చాన్స్‌లర్ల నియామకాల జీవోల కొట్టివేతపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. పదో తరగతిలో జిల్లా సగటు కంటే తక్కువగా ఫలితాలు వచ్చిన కేజీబీవీల స్పెషలాఫీసర్లను తొలగించడం లేదని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఫలితాల పెంపునకు ఇప్పటినుంచే చర్యలు చేపట్టాలని లేఖలు రాస్తున్నామన్నారు. పాఠశాలల్లో ప్రవేశాలకు ఈనెల 15 వరకు గడువుందని, విద్యార్థుల్లేని పాఠశాలలు, హేతుబద్ధీకరణలపై ఆ తరవాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుపై ఆర్థిక శాఖ నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉందని చెప్పారు.
రాష్ట్రంలోని 192 మోడల్ స్కూళ్లు, 47 గురుకులాలు, 396 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) నాణ్యత ప్రమాణాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను కడియం ఆదేశించారు. వాటిలొ విద్య, బోధన, పరీక్షలపరంగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షకు రాష్ట్ర స్థాయిలో విద్యా సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ‘‘విద్యారంగంలో నిపుణులైన 10 నుంచి 15 మంది రిటైర్డ్ అధికారులతో వెంటనే ఈ కమిటీని వేయండి. పాఠశాలల స్థాయిలో తల్లిదండ్రులతో అడ్వైజరీ, మెస్ కమిటీలూ ఏర్పాటు చేయండి. ఇవన్నీ ఈ నెల 31లోగా ఏర్పాటవ్వాలి. పదో తరగతి, ఇంటర్మీడియెట్‌లో ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు తీసుకోండి. పాఠశాలల్లో ప్రత్యేక తరగతులను ఫిబ్రవరి, మార్చి నెలల్లో కాకుండా ఆగస్టు నుంచే ప్రారంభించండి. మోడల్ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీల్లో టాయిలెట్లు, తాగునీరు, ఫర్నిచర్ వంటి సదుపాయాలన్నీ కల్పించండి. వీటన్నింట్లో ఒకే రకమైన మెనూ అమలు చేయండి. మెనూ వివరాలను నోటీసు బోర్డుల్లో పెట్టండి. మెనూ అమలును రాష్ట్ర స్థాయి బృందాలతో తనిఖీ చేయిస్తాం. నిధుల సమస్య ఉంటే చెప్పండి, నిధులిస్తాం. టీచర్లు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు అమలు చేయండి. సీసీ కెమెరాలు పెట్టండి’’ అని ఆదేశించారు. టీచర్లకు సబ్జెక్టుల ఫౌండేషన్ కోర్సులు, హెడ్‌మాస్టర్లకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు.