
ఎంసెట్-2 అధికారికంగా రద్దు
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 అధికారికంగా రద్దైంది. ఎంసెట్-3 షెడ్యూల్ ఈ సాయంత్రం విడుదల చేయనున్నారు. ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంసెట్ కన్వీనర్ ను మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. మళ్లీ జేఎన్టీయూకు ఎంసెట్ నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని, పాత హాల్ టికెట్లతోనే పరీక్షకు అనుమతించాలని సీఎం సూచించారు.
కొంత మంది చేసిన తప్పులకు వేలాది మందిని ఇబ్బంది పెట్టాల్సిరావడం బాధగా ఉందన్నారు. ఎంసెట్-3కి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. బ్రోకర్లతో చేతులు కలిపిన తల్లిదండ్రులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు అందజేశారు.