సెప్టెంబర్ 11న ఎంసెట్-3 | telangana eamcet-3 on september 11th | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ 11న ఎంసెట్-3

Published Wed, Aug 3 2016 1:58 AM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM

సెప్టెంబర్ 11న ఎంసెట్-3

సెప్టెంబర్ 11న ఎంసెట్-3

రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
కన్వీనర్‌గా జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ యాదయ్య
సెప్టెంబర్ 20 నాటికల్లా ర్యాంకులు!
ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్నవారందరికీ అవకాశం
పాత హాల్‌టికెట్లతోనే పరీక్షకు అనుమతి
ఎంసెట్ కమిటీ భేటీ తర్వాత మార్గదర్శకాలపై స్పష్టత
సీఎం ఆదేశంతో అధికారులతో భేటీ అయిన
ఉన్నత విద్యా మండలి చైర్మన్
 
హైదరాబాద్
: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వచ్చేనెల 11వ తేదీన ఎంసెట్-3 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షను నిర్వహిస్తామని ప్రకటించింది. పేపర్ లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-2ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఎంసెట్-3 నిర్వహణ తేదీని కూడా వెల్లడించింది.

జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్యను ఎంసెట్-3 కన్వీనర్‌గా నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, జేఎన్‌టీయూ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య, ఇతర అధికారులు సమావేశమై పరీక్ష తేదీని నిర్ణయించారు. ఎంసెట్ కమిటీ సమావేశం తర్వాత ర్యాంకుల వెల్లడి తేదీని, ఇతర మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వీలైతే వచ్చేనెల 20 నాటికి ర్యాంకులను వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 5 లేదా 6 తేదీల్లో ఎంసెట్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

ముచ్చటగా మూడోసారి..
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం రాష్ట్రంలో మూడోసారి(ఏపీ ఎంసెట్ కాకుండా) ఎంసెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత మే 15న ఎంసెట్-1 నిర్వహించారు. అయితే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కారణంగా అది ఉపయోగం లేకుండా పోయింది. తర్వాత నీట్‌పై కేంద్రం ఆర్డినెన్స్ తేవడంతో మళ్లీ మెడికల్ సీట్లలో ప్రవేశాల కోసం జూలై  9న ఎంసెట్-2 నిర్వహించారు. తీరా లీకేజీ కారణంగా ఎంసెట్-2 రద్దు చేయడంతో ఇప్పుడు మూడోసారి పరీక్ష రాయాల్సి వస్తోంది.

56,153 మందికి అవకాశం
ఎంసెట్-2కు దరఖాస్తు చేసుకున్న 56,153 మంది విద్యార్థులకు ఎంసెట్-3 పరీక్ష రాసే అవకాశం కల్పించనున్నారు. ఎంసెట్-2కు తెలంగాణతోపాటు ఏపీకి చెందిన మొత్తం 56,153 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 50,961 మంది పరీక్షకు హాజరుకాగా.. 47,644 మంది అర్హత సాధించి, ర్యాంకులు పొందారు. ప్రస్తుతం ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ పాత హాల్‌టికెట్లతో ఎంసెట్-3కి హాజరయ్యే అవకాశం కల్పించనున్నారు. వారంతా వెబ్‌సైట్ నుంచి మళ్లీ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్ లేకుండానే పరీక్ష
ఎంసెట్-2 మాదిరి ఎంసెట్-3ని ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించే అవకాశం ఉంది. ఎంసెట్-1లో మెడికల్ ఎంసెట్ పరీక్షను హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ నిర్వహించారు. అయితే ఎంసెట్-2 పరీక్షను మాత్రం ఆఫ్‌లైన్‌లోనే నిర్ణయించారు. ఇప్పుడు ఎంసెట్-3ని కూడా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఓఎంఆర్ జవాబు పత్రాల కార్బన్‌లెస్ కాపీ కూడా ఇచ్చే అవకాశం లేదు. దీనిపై ఎంసెట్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ డాటాను మాత్రం సేకరించనున్నారు. క్వశ్చన్ బ్యాంకు ఏర్పాటు, ప్రశ్నపత్రాల రూపకల్పన, ముద్రణ తదితర అంశాల్లో పక్కాగా చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement