
ఐశ్వర్య
ఎంసెట్-3లో ఐశ్వర్యకు 50వ ర్యాంకు
ఎంసెట్-2లో రెండో ర్యాంకు
గజ్వేల్: నిరంతర శ్రమతో ఎంసెట్-2లో రాష్ట్ర స్థాయిలోనే రెండో ర్యాంకును సాధించిన గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన కాసం ఐశ్వర్య... తాజాగా గురువారం వెలువడిన ఎంసెట్-3 ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించింది. పరీక్ష నిర్వహణ విషయంలో తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడినా... అధైర్యపడకుండా మరోసారి తన సత్తాను చాటింది.
గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లికి చెందిన కాసం శ్రీనివాస్, అమృత దంపతులు గత కొన్నేళ్లుగా ప్రజ్ఞాపూర్‌లో స్థిరపడ్డారు. కిరాణా దుకాణం నిర్వహిస్తూ పిల్లలను చదివించుకుంటున్నారు. కిరాణా దుకాణం, ఇతర చిన్నపాటి వ్యాపారాలే వీరి జీవనాధారం. మధ్యతరగతి జీవనం సాగిస్తున్న శ్రీనివాస్ తన పిల్లలను మాత్రం ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కష్టపడుతున్నాడు.
ఈ దంపతులకు కాసం ఐశ్వర్య, క్రాంతికుమార్ సంతానం. క్రాంతికుమార్ ప్రస్తుతం సెయింట్ మేరీస్ విద్యానికేతన్ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. ఐశ్వర్య సైతం ఇదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివింది. ఆ తరువాత ఆమె కూకట్‌పల్లిలోని నారాయణ కళాశాలలో ఇంటర్ బైపీసీ చేసింది.
తనకోసం నిరంతరం శ్రమిస్తున్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయడానికి ఐశ్వర్య తీవ్రంగా కృషి చేసింది. ఈ క్రమంలోనే ఇంటర్‌లో 990 మార్కులు సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదే ఉత్సాహంతో ఎంసెట్-2 రాసి మొదటి ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును కైవసం చేసుకుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో ఐశ్వర్య, ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు.
వారి ఆనందం కొన్ని రోజులు మాత్రమే మిగిలింది. ఇంతలో ఆ పరీక్ష రద్దు కావడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెల్సిందే. అయినా ఐశ్వర్య అధైర్యపడకుండా మరోసారి పరీక్ష సిద్ధమైనా ఆ విద్యార్థిని తాజా ఫలితాల్లో 50వ ర్యాంకును సాధించి తన సత్తాను చాటుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ.. పరీక్ష రద్దు కావడంతో కొద్ది రోజులు ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు. అయినా తేరుకొని తిరిగి శ్రమించి పరీక్ష రాశానని, ఈ ర్యాంకు సాధించడం కూడా సంతోషంగానే ఉందని తెలిపింది.