ఎంసెట్–3కి అంతా సిద్ధం
నేడు పరీక్ష
– హాజరు కానున్న 2160 మంది విద్యార్థులు
– నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించే మెడిసిన్, డెంటల్ ఎంసెట్–3కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో ఏ, బీ పరీక్ష కేంద్రాలు, కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో, వృత్తి విద్యా కళాశాలలో ఏ, బీ కేంద్రాలు, రామగిరిలోని ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఒకటి చొప్పున మొత్తం 5 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2160 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరగనుంది. ఎంసెట్ –2 రాసి హాల్ టికెట్లు ఉన్న విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. పరీక్ష కేంద్రాలను గంట ముందుగానే తెరిచి విద్యార్థులను అనుమతిస్తారు. విద్యార్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. శనివారం ఎన్జీ కళాశాలలో పరీక్ష ఏర్పాట్లను ఎంసెట్–3 ప్రత్యేక పరిశీలకుడు ధర్మానాయక్, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి, ఇతర అధికారులు పరిశీలించారు.