సాక్షి, హైదరాబాద్: సరళీకృత వ్యాపార విధానం (ఈఓడీబీ) ర్యాంకింగ్స్‌లో తెలంగాణ వరుసగా రెండో ఏడాది నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకోబోతోంది. అయితే, ఈ సారి మరో ఐదు లేక అంతకంటే ఎక్కువ రాష్ట్రాలతో కలసి మొదటి ర్యాంక్‌ను పంచుకోబోతోంది. సరళీకృత వ్యాపార సంస్కరణల అమలు విషయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయడంలో 100 శాతం స్కోర్ సాధించిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ సహా హరియాణా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ ఇప్పటికే స్థానం సంపాదించగా, మరో 12 రాష్ట్రాలు 100 శాతం స్కోర్ సాధించే దిశగా ముందుకు పోతున్నాయి.
2017కి సంబంధించిన వ్యాపార సంస్కరణల ప్రణాళిక అమలులో రాష్ట్రాలు పూర్తి చేసిన లక్ష్యాలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్న మదింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. దీంతో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన తుది స్కోర్లపై ఇంకా స్పష్టత రాలేదు. మదింపు ప్రక్రియ ముగిసిన తర్వాత తుది ర్యాంకులను ప్రకటించనుంది. సరళీకృత వ్యాపార విధాన సంస్కరణల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయడంలో రాష్ట్రాల సాధించిన పురోగతిని మదించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఏటా ర్యాంకులను కేటాయిస్తోంది.
2017 సంబంధించిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను గత ఆగస్టులో కేంద్రం ప్రకటించింది. ఈ ప్రణాళికలోని 372 సిఫారసుల అమలులో రాష్ట్రాలు సాధించిన పురోగతి ఆధారంగా 2018కి సంబంధించిన ర్యాంకులను త్వరలో కేంద్రం ప్రకటించనుంది. 12 ప్రధాన అంశాల్లో సంస్కరణల అమలు విషయంలో రాష్ట్రాలు పాటిస్తున్న నియంత్రణ ప్రక్రియలు, విధానాలు, అమలు తీరు, పద్ధతుల ఆధారంగా ఈ స్కోర్‌ను కేటాయిస్తోంది.
కార్మికుల నమోదు, ఫ్యాక్టరీలకు లైసెన్స్‌ల జారీ, ఫ్యాక్టరీల భవన నిర్మాణ అనుమతులు, బాయిలర్ల రిజిస్ట్రేషన్, షాపులు, స్థాపన చట్టం కింద లైసెన్స్‌ల జారీ, వాణిజ్య వివాదాల పరిష్కారం, కాగితపు రహిత న్యాయ స్థానాలు, ఆన్‌లైన్‌లో ఆస్తుల రిజిస్ట్రేషన్, సరళీకృత తనిఖీలు, ఆన్‌లైన్ సింగిల్ విండో విధానం తదితర సంస్కరణల అమలు ఆధారంగా కేంద్రం రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయించనుంది.
Comments
Please login to add a commentAdd a comment