
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉండే పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) శనివారం 2019 సంవత్సరానికి గాను సులభతర వాణిజ్య వి«ధానం (ఈవో డీబీ) ర్యాంకులను ప్రకటించింది. సులభతర వాణిజ్యానికి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా ర్యాంకులను నిర్ణయించారు. ఈ ర్యాంకింగ్‌లో తెలంగాణ మూడో స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తొలి రెండు స్థానాలు సాధించాయి. 2018 జూలైలో ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకింగుల్లో తెలంగాణ రెండో స్థానం సాధించగా ప్రస్తుత ర్యాంకింగ్‌లో ఒక స్థానం దిగువకు పడిపోయి మూడో స్థానంలో నిలిచింది. 2015లో తొలిసారి ప్రకటించిన ఈఓడీబీ ర్యాంకింగ్‌లో 13వ స్థానంలో నిలిచిన తెలంగాణ... 2016లో ఏపీతోపాటు మొదటి స్థానంలో నిలిచింది. 2017లో ఎలాంటి ర్యాంకులు ప్రకటించలేదు. గతేడాది రెండో స్థానంలో నిలిచింది.
న్యాయ సంస్కరణలు అమలు కానందుకే నష్టం..
రాష్ట్రాలు ‘బిజినెస్ రిఫారŠమ్స్ యాక్షన్ ప్లాన్’ (బీఏపీఆర్)లో భాగంగా అమలు చేసే సంస్కరణల ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకులు నిర్ణయిస్తారు. బీఏపీఆర్ 2019లో 45 అంశాలకు సంబంధించి 181 సంస్కరణలు అమలు చేయాలని డీపీఐఐటీ నిర్దేశించింది. అయితే న్యాయ విభాగానికి సంబంధించి రెండు సంస్కరణలు అమలు కాకపోవడంతో తెలంగాణ నాలుగు పాయింట్లు కోల్పోయింది. కమర్షియల్ కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ, కమర్షియల్ కోర్టుల సేవల వినియోగంలో తెలంగాణ పాయింట్లను కోల్పోవడంతో గతేడాదితో పోలిస్తే ర్యాంకింగ్‌లో ఒక స్థానం కోల్పోయింది.
ర్యాంకింగ్‌లో పారదర్శకతపై అసంతృప్తి...
ఈఓడీబీ ర్యాంకుల్లో పారదర్శకతపై రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది 12వ స్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్ ఏకంగా రెండో స్థానానికి ఎగబాకిన తీరుపై అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈఓడీబీ ర్యాంకులకు బదులుగా 2019 నుంచి గ్రేడింగ్ విధానం ప్రవేశపెడతామని ప్రకటించిన కేంద్రం... తిరిగి ర్యాంకుల విధానంవైపు మొగ్గు చూపడాన్ని పరిశ్రమల శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈఓడీబీ 2020 ర్యాంకులకు సంబంధించి బీఏపీఆర్‌లో 305 సంస్కరణలు చేయాల్సిందిగా డీపీఐఐటీ నిర్దేశించింది. నవంబర్ 30లోగా సంస్కరణలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సిందిగా గడువు విధించింది.