► హైదరాబాద్‌లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీల వరకు తగ్గాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు, మెదక్‌లో 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 6 డిగ్రీలు, హన్మకొండ, మెదక్, నల్లగొండల్లో 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మంలల్లో 11 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. నిజామాబాద్‌లో 12, భద్రాచలం, నల్లగొండ, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, హైదరాబాద్‌పై కూడా చలిపంజా విసురుతోంది. గురువారం తెల్లవారుజామున 10.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మరికొన్ని రోజుల పాటు చలిపులి గజగజలాడిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మరో వైపు ఏపీలోని విశాఖ మన్యం అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలిగుప్పెట్లో చిక్కుకుంది. ఏపీలోనే అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, పాడేరు, మోదకొండమ్మ పాదాలు, మినుములూరు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీలలోపే నమోదవుతున్నాయి.
తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
Published Fri, Dec 23 2016 2:52 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
Advertisement