temperatures decreasing
-
ఏపీలో క్షీణిస్తున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంపైకి వీస్తున్న ఈశాన్య గాలుల వల్ల రానున్న రెండు రోజులు దక్షిణ, ఉత్తర కోస్తాంధ్రల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం సోమవారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. మరోవైపు ఏపీలోనూ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. చలి క్రమంగా పెరుగుతోంది. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఆయా జిల్లాల్లో 11 నుంచి 14 డిగ్రీల మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జి.మాడుగులలో 11.6 డిగ్రీలు, వాల్మీకిపురం(అన్నమయ్య)లో 12.6, ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు)లో 13.1, మడకశిర (శ్రీసత్యసాయి)లో 13.2, సోమాల (చిత్తూరు)లో 13.7, బెలుగుప్ప (అనంతపుర)లో 14.9 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండు, మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
మంచు గుప్పెట్లోనే అమెరికా.. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనం
బఫెలో: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్యే పౌరులు క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నారు. న్యూయార్క్ తదితర రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఇంత దారుణమైన వాతావరణ పరిస్థితులను రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని న్యూయార్క్‌వాసులు చెబుతున్నారు. బఫెలో తదితర చోట్ల హరికేన్లను తలపించే గాలులు ప్రజల కష్టాలను రెట్టింపు చేస్తున్నాయి. రోడ్లు, రన్‌వేలపై ఏకంగా 50 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. దాంతో పలు విమానాశ్రయాలను రెండు రోజుల పాటు మూసేశారు. శని, ఆదివారాల్లో కూడా వేలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాలో అంతరాయాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. అయితే పలుచోట్ల పరిస్థితిని అధికారులు క్రమంగా చక్కదిద్దుతున్నారు. బహుశా ఒకట్రెండు రోజుల్లో పరిస్థితులు కాస్త మెరుగు పడొచ్చని భావిస్తున్నారు. -
రోజంతా గజగజ..
సాక్షి, హైదరాబాద్: నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. శుక్రవారం చల్లటి ఈదురుగాలులు ప్రజలను వణికించాయి. పలు చోట్ల ముసురు పట్టింది. రాత్రిపూట చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల సాధారణమే అయినప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు కూడా ఏకంగా 5.6 డిగ్రీల మేర పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రాష్ట్రంలో గరిష్టంగా మెదక్‌లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, అతి తక్కువగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో 24.6 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దుండిగల్‌లో 17.4 డిగ్రీలు, భద్రాచలంలో 17.5 డిగ్రీలు, నల్లగొండలో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. హైదరాబాద్‌లో తీవ్రమైన చల్లటి ఈదురుగాలులతో ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది. కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో సగటున 4.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 19.4 మిల్లీమీటర్లు, కొత్తగూడెంలో 15.6 మి.మీ., సూర్యాపేటలో 11.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో పక్క జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలంలో అత్యధికంగా 3.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
ఉష్ణోగ్రతలు మరింత పతనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు మరింత పడిపోతున్నాయి. వికారాబాద్ జిల్లా మోమీన్‌పేట్, ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో ఆదివారం రాత్రి అతి తక్కువగా 8.4 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. అలాగే సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 8.5, ఆదిలాబాద్ జిల్లా బేల, కామారెడ్డి జిల్లా మధ్నూర్, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 8.6 డిగ్రీల చొప్పున రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా 20కిపైగా మండలాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇక వివిధ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో ఆదివారం రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 9.8 డిగ్రీ సెల్సియస్‌గా నమోదుకాగా.. హైదరాబాద్‌లో 13.6 డిగ్రీలు, నిజామాబాద్‌లో 14.4 డిగ్రీలు, దుండిగల్‌లో 14.6 డిగ్రీలు, మెదక్‌లో 14.8 డిగ్రీల చొప్పున రికార్డయింది. మెదక్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలో మరో రెండ్రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ తగ్గుదల ఉంటుందని, సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
పెరగనున్న చలి తీవ్రత! ఇక చలి గజగజ!!
సాక్షి, హైదరాబాద్ : నగరం గజగజ వణకనుంది. హైదరాబాద్‌లో ఇకపై చలి తీవ్రత పెరగనుంది. సోమవారం సాయంత్రం నుంచి తూర్పు, ఈశాన్యం నుంచి మొదలైన శీతల గాలుల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో నగరంలో సాధారణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోనున్నాయి. మంగళవారం నుంచి నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో 20 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో మంగళవారం హైదరాబాద్‌లో 19.2 డిగ్రీలు, రంగారెడ్డిలో 15.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 16.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఈశాన్య, తూర్పు గాలుల తీవ్రత పెరిగి గాలిలో తేమ తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళవారం సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో 15.6, కామారెడ్డిలో 16.1, సిద్దిపేటలో 16.2, నిజామాబాద్‌లో 16.3 అత్పల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో అక్కడ కూడా చలి తీవ్ర పెరిగింది. మేఘావృతంతోనే మార్పులు... చలికాలం ప్రవేశించి నెల రోజులవుతున్నా ఆకాశం మేఘావృతంతో పాటు కదలికలు ఉం డటం, గాలిలో తేమ తీవ్రత కూడా సగటును మించి ఉండటంతో సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశంలో మేఘాలు మాయమై, గాలుల వేగం పెరుగుతుండటంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమో దయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. -
మన్యంను కప్పేసిన పొగమంచు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్రా కశ్మీర్‌గా పేరుపొందిన విశాఖ మన్యంలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. లంబసింగి-3, చింతపల్లి-4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో మన్యం ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. అలాగే... ఏజెన్సీ వ్యాప్తంగా పొగ మంచు దట్టంగా అలుముకుంటోంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఉదయం సమయంలో కూడా లైట్లు వేసుకుని రాకపోకలు కొనసాగించాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ప్రస్తుతం ఒక్కసారిగా పడిపోవడంతో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. -
చలి గుప్పెట్లో తెలంగాణ రాష్ట్రం
-
వణుకుతున్న రాష్ట్రం
► ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు ► మెదక్‌లో 10 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి పూట చలి వాతావరణం కొనసాగుతోంది. పగలు మాత్రం సాధారణం కంటే కాస్తంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, మెదక్, రామగుండంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోయాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు, మెదక్‌లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, హైదరాబాద్‌లో 3 డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీలు, రామగుండంలో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీలు, నల్లగొండలో 3 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అన్ని ప్రాంతాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే రికార్డయ్యాయి. మహబూబ్‌నగర్‌లో 4 డిగ్రీలు ఎక్కువగా 34 డిగ్రీలు, మెదక్‌లో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తగ్గిన రాత్రి ఉష్ణోగ్రతలు
► హైదరాబాద్‌లో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీల వరకు తగ్గాయి. మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, దీనివల్ల చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడిచిన 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీలు, మెదక్‌లో 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 6 డిగ్రీలు, హన్మకొండ, మెదక్, నల్లగొండల్లో 5 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మంలల్లో 11 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. నిజామాబాద్‌లో 12, భద్రాచలం, నల్లగొండ, రామగుండంలలో 13 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కాగా, హైదరాబాద్‌పై కూడా చలిపంజా విసురుతోంది. గురువారం తెల్లవారుజామున 10.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మరికొన్ని రోజుల పాటు చలిపులి గజగజలాడిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.మరో వైపు ఏపీలోని విశాఖ మన్యం అత్యల్ప ఉష్ణోగ్రతలతో చలిగుప్పెట్లో చిక్కుకుంది. ఏపీలోనే అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ ఏజెన్సీలోని లంబసింగి, చింతపల్లి, పాడేరు, మోదకొండమ్మ పాదాలు, మినుములూరు తదితర ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పది డిగ్రీలలోపే నమోదవుతున్నాయి.