
సాక్షి, హైదరాబాద్ : నగరం గజగజ వణకనుంది. హైదరాబాద్‌లో ఇకపై చలి తీవ్రత పెరగనుంది. సోమవారం సాయంత్రం నుంచి తూర్పు, ఈశాన్యం నుంచి మొదలైన శీతల గాలుల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉండటంతో నగరంలో సాధారణ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోనున్నాయి. మంగళవారం నుంచి నగరంతో పాటు అనేక ప్రాంతాల్లో 20 డిగ్రీల్లోపే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో మంగళవారం హైదరాబాద్‌లో 19.2 డిగ్రీలు, రంగారెడ్డిలో 15.5, మేడ్చల్ మల్కాజిగిరిలో 16.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నుంచి ఈశాన్య, తూర్పు గాలుల తీవ్రత పెరిగి గాలిలో తేమ తగ్గి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే మంగళవారం సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో 15.6, కామారెడ్డిలో 16.1, సిద్దిపేటలో 16.2, నిజామాబాద్‌లో 16.3 అత్పల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో అక్కడ కూడా చలి తీవ్ర పెరిగింది.
మేఘావృతంతోనే మార్పులు...
చలికాలం ప్రవేశించి నెల రోజులవుతున్నా ఆకాశం మేఘావృతంతో పాటు కదలికలు ఉం డటం, గాలిలో తేమ తీవ్రత కూడా సగటును మించి ఉండటంతో సాధారణ కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆకాశంలో మేఘాలు మాయమై, గాలుల వేగం పెరుగుతుండటంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమో దయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.