
సాక్షి, హైదరాబాద్: నివర్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. శుక్రవారం చల్లటి ఈదురుగాలులు ప్రజలను వణికించాయి. పలు చోట్ల ముసురు పట్టింది. రాత్రిపూట చలిగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతల్లో తగ్గుదల సాధారణమే అయినప్పటికీ.. పగటి ఉష్ణోగ్రతలు కూడా ఏకంగా 5.6 డిగ్రీల మేర పడిపోయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రాష్ట్రంలో గరిష్టంగా మెదక్‌లో 29.2 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, అతి తక్కువగా భద్రాచలం, ఖమ్మం జిల్లాల్లో 24.6 డిగ్రీలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దుండిగల్‌లో 17.4 డిగ్రీలు, భద్రాచలంలో 17.5 డిగ్రీలు, నల్లగొండలో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముంది. హైదరాబాద్‌లో తీవ్రమైన చల్లటి ఈదురుగాలులతో ముసురు వాతావరణం నెలకొంది. పలు చోట్ల ఓ మోస్తరు వర్షం పడింది.
కొనసాగుతున్న అల్పపీడనం
దక్షిణ కోస్తా ఆంధ్ర, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. మరోవైపు హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆదివారం పొడివాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో సగటున 4.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 19.4 మిల్లీమీటర్లు, కొత్తగూడెంలో 15.6 మి.మీ., సూర్యాపేటలో 11.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. మరో పక్క జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలంలో అత్యధికంగా 3.18 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
Comments
Please login to add a commentAdd a comment