
జూలైలో టెన్త్ లాంగ్ మెమోలు
రాష్ట్రంలో మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లాంగ్ మెమోలను...
* వాటిపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణ
* ఇంటర్మీడియెట్‌లోనూ అమలుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్చిలో జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లాంగ్ మెమోలను (మార్కులతో కూడిన ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్) జూలై రెండో వారం చివర్లో అందించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విద్యార్థుల షార్ట్ మెమోల ముద్రణపై దృష్టిపెట్టింది. వచ్చే నెల మొదటి వారంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసి స్కూళ్లకు మెమోలను పంపేలా కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇప్పటికే విద్యార్థులకు ఇచ్చిన (కాలేజీల్లో చేరేందుకు) మెమోల్లో పొరపాట్లు దొర్లితే సవరణకు గడువు ఇచ్చి దాన్ని రెండుసార్లు పొడిగించిం ది. గురువారంతో అది కూడా ముగిసింది. 400 మందికిపైగా విద్యార్థులు షార్ట్ మెమోల్లోని పేర్లలో తప్పులు దొర్లాయని, వాటిని సవరించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 5వేల మంది విద్యార్థుల మార్కుల సవరణ ప్రక్రియ కూడా పూర్తి కావచ్చింది.
దీంతో త్వరలోనే లాంగ్ మెమో ల ముద్రణ ప్రారంభం కానుంది. ఈసారి విద్యార్థుల లాంగ్ మెమోల్లో ఆధార్ నంబ రును ముద్రించేందుకు చర్యలు చేపట్టింది. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు హాజరైన 5,21,271 మంది విద్యార్థుల్లో 4,90,985 మంది విద్యార్థులు ఆధార్ నంబ ర్లను ప్రభుత్వ పరీక్షల విభాగానికి సమర్పించడంతో వారి మెమోల్లో ఆధార్ నంబ ర్లను ముద్రించాలని నిర్ణయించింది.
ఆధార్ సమర్పించని 30,586 మంది విద్యార్థుల్లో వీలైనంత మంది నుంచి నంబర్లను సేకరించేందుకు చర్యలు చేపడుతోంది. ఆధార్ నంబరు లేనివారికి మాత్రం మెమోల్లో ఆధార్ లేకుండానే ఇవ్వనుంది. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల మెమోల్లోనూ ఆధార్ నంబరును ముద్రిం చేందుకు కసరత్తు చేస్తోంది. 2017 మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థుల మెమోల్లోనూ ఆధార్ ముద్రించే వీలుంది.