రాష్ట్ర కేడర్‌లోకి మండల వ్యవసాయాధికారులు
రాష్ట్ర కేడర్‌లోకి మండల వ్యవసాయాధికారులు
Published Sun, Jun 25 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM
- జోనల్ వ్యవస్థ రద్దు నేపథ్యంలో వ్యవసాయ శాఖ కసరత్తు
- సూపరింటెండెంట్ సహా మరికొన్ని పోస్టులు కూడా రాష్ట్ర కేడర్‌లోకే
- ఏఈవోలను మాత్రం జిల్లా కేడర్‌లోనే ఉంచాలని ప్రాథమిక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మండల వ్యవసాయాధికారి (ఏవో), సహాయ వ్యవసాయ డైరెక్టర్ (ఏడీఏ) పోస్టులను రాష్ట్ర కేడర్‌లోకి తీసుకురావాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఇవి జోనల్ పోస్టులుగా ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థను రద్దు చేసి జిల్లా, రాష్ట్ర స్థాయి పోస్టులే ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం జిల్లా వ్యవసాయాధికారులు (డీఏవో), జాయింట్ డైరెక్టర్ (జేడీఏ), డిప్యూటీ డైరెక్టర్ (డీడీ), అదనపు డైరెక్టర్ పోస్టులు మాత్రమే రాష్ట్రస్థాయి కేడర్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఏవో, ఏడీఏ పోస్టులు కూడా రాష్ట్ర కేడర్‌లోకి రానున్నాయి. దీనిపై వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి శనివారం సమీక్ష నిర్వహించారు. ఏవో, ఏడీఏలను రాష్ట్ర కేడర్‌లోకి తీసుకొస్తే తలెత్తే సమస్యలపై చర్చించారు.
సీనియారిటీ సమస్యపై తర్జనభర్జన..
ఏవో, ఏడీఏ కేడర్ సహా సూపరింటెండెంట్ వంటి కొన్ని పోస్టులను జోనల్ స్థాయి నుంచి రాష్ట్ర కేడర్‌లోకి తీసుకురావడం వల్ల సీనియారిటీ సమస్యలు తలెత్తే అవకాశముందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. జోనల్ వారీగా భర్తీ చేసినందున అక్కడున్న పరిస్థితుల కారణంగా కొందరు త్వరగా ఏవో నుంచి ఏడీఏగా పదోన్నతి పొందిన వారున్నారు. కొన్ని జోన్లల్లో ఆలస్యంగా పదోన్నతి పొందిన వారున్నారు. రాష్ట్రంలో 2 వేలకు పైగా వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈవో) పోస్టులు జిల్లా స్థాయి కేడర్‌లోనే ఉంటాయి. వీటిలో ఎటువంటి మార్పు ఉండదు. ఏవోలుగా పదోన్నతి పొందాక రాష్ట్రస్థాయి కేడర్‌లోకి వస్తారు.
సీనియారిటికీ ప్రాధాన్యమివ్వాలి: కె.రాములు, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు
జోనల్ వ్యవస్థను రద్దు చేయడం మంచిదే. అయితే జోనల్ పోస్టులు రాష్ట్రస్థాయి కేడర్‌లో కలిపాక పదోన్నతుల సమయంలో సమస్యలు వస్తాయి. అప్పుడు సీనియారిటీకే ప్రాధాన్యమివ్వాలి.
Advertisement