కోర్టు తీర్పుల్నీ సృష్టించారు!
- వీటి ఆధారంగానే న్యాయస్థానాల నుంచి సర్టిఫైడ్ కాపీలు
- ఈ సీసీలను చూపించి కింది కోర్టుల నుంచి ఉత్తర్వులు
- వెలుగులోకి వస్తున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, సక్సేనా వ్యవహారాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలోని ఖరీదైన స్థలాలపై కన్నేసి బోగస్ డాక్యుమెంట్లు, వ్యక్తులతో వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్సీ జి.దీపక్‌రెడ్డి, న్యాయవాది శైలేష్ సక్సేనా వ్యవహా రాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లేని వ్యక్తుల పేర్లతో వ్యాజ్యాలు దాఖలు చేసిన వ్యవహారాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించిన విషయం విదితమే. వీరిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో మరిన్ని విస్తుగొలిపే అంశాలు బయపడుతున్నాయి. న్యాయస్థానాల అంతర్గత సిబ్బంది సహకారంతో దీపక్‌రెడ్డి ముఠా లేని తీర్పుల్ని సృష్టించినట్లు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేక రించారు. వీటి ఆధారంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. శివభూషణం, ఇక్బాల్ ఇస్లాం ఖాన్, షకీల్ ఇస్లాం ఖాన్ పేర్లతో సృష్టించిన బోగస్ వ్యక్తుల సాయంతో, నకిలీ డాక్యుమెంట్లతో న్యాయస్థానాల్లో కేసులు వేయించి స్థలాల అసలు యజమానుల్ని ఇబ్బందులకు గురి చేసింది.
కింది కోర్టుల నుంచి తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకో వడానికి న్యాయస్థానాల్నీ తప్పుదారి పట్టించిందని పోలీ సులు చెబుతున్నారు. ఏదైనా స్థలానికి సంబంధించి కింది కోర్టులో వ్యాజ్యం నడుస్తుంటే.. దానికి సంబంధించి పైకో ర్టు అప్పటికే తీర్పులు ఇచ్చినట్లు దీపక్ రెడ్డి, సక్సేనా కథలు నడిపారని తెలుస్తోంది. సక్సేనా పాత తేదీలతో కొన్ని కోర్టు తీర్పుల్ని తయారు చేసేవాడు. వాటిని న్యాయస్థానా ల అంతర్గత సిబ్బంది సహకారంతో రికార్డుల్లోకి చొప్పిం చేవాడు. ఆపై సక్సేనా ద్వారా ఆ తీర్పుల సర్టిఫైడ్ కాపీలు (సీసీ) కావాలంటూ అదే న్యాయస్థానంలో పిటిషన్ దాఖ లు చేయించేవారు.
ఇలా సీసీలు పొందాక తాము చొప్పిం చిన బోగస్ తీర్పు ప్రతుల్నీ అంతర్గత సిబ్బంది సాయం తోనే బయటకు తీయించేసేవారు. దీనికి కొందరు సిబ్బం దికి వారు భారీగా నజరానాగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీసీలను కింది కోర్టుల్లో దాఖలు చేసి న్యాయస్థానాలనూ తప్పుదారి పట్టిస్తూ తమకు అనుకూలంగా తీర్పులు పొందేవారని చెబుతున్నారు. వీరికి సహకరించిన సిబ్బం ది ఎవరనేది ఆరా తీయాలని పోలీసులు నిర్ణయించారు.