ధరల పెరుగుదల వాస్తవమే
రెండేళ్లలో దిగి వస్తాయి: మంత్రి ఈటల
♦ ఉల్లి, కందిపప్పును సబ్సిడీపై విక్రయించాం
♦ రేషన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తాం
♦ గతేడాదితో పోలిస్తే ధరలు మరింత పెరిగాయి: కాంగ్రెస్, ఎంఐఎం
♦ హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీలో అక్రమాలు
♦ రేషన్ బియ్యాన్ని డబుల్ పాలిష్ చేసి సన్నబియ్యంగా మారుస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ప్రతి నెలా సమావేశమై ధరలపై సమీక్ష నిర్వహిస్తోందన్నారు. దిగుబడి పెంపు, బ్లాక్‌మార్కెటింగ్ నియంత్రణ వంటి చర్యలతో రెండేళ్లలో ధరలు దిగివస్తాయన్నారు. నిత్యావసర వస్తువుల ధరలపై శాసనసభ ప్రశ్నోత్తరాల్లో సభ్యుల ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. కిలో ఉల్లి రూ.60కి చేరినప్పుడు రూ.20కి, కంది పప్పు రూ.190-210కి చేరినప్పుడు రూ.135 కిలో చొప్పున రైతు బజార్లలో విక్రయించామన్నారు.
ఈ ఏడాది బియ్యం ధరలు పెరగలేదన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో సత్వర ఉపశమన చర్యల కింద.. ప్రతి వ్యక్తికి 5 కిలోల గోధుమలను కిలో రూ.2 చొప్పున సరఫరా చేస్తున్నామన్నారు. వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం వడ్డించాలని, వసతి గృహాలను నడిపించాలని ఆదేశించామన్నారు. 2015తో పోల్చితే 2016లో బ్లాక్ మార్కెట్ నిర్వాహకులపై దాడులు, కేసులు, అరెస్టులు తీవ్రం చేశామన్నారు. పౌరసరఫరాల శాఖ ప్రక్షాళనలో భాగంగా తొలుత హైదరాబాద్‌లో చౌక ధరల దుకాణాల కంప్యూటరీకరణ చేపట్టామని, దీన్ని తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తామన్నారు. బోగస్ ఏరివేతకు రేషన్‌కార్డులను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు. స్టేజ్-1, 2 సరుకు రవాణా వాహనాలకు జీపీఎస్ అమరుస్తామన్నారు. ‘‘ఒకేసారి అవినీతిని అరికట్టలేకపోయినా క్రమంగా తగ్గిస్తున్నాం. కొన్ని రేషన్ దుకాణాలు, వంటగ్యాస్ ఏజెన్సీల పరిధిలోని వినియోగదారుల సం ఖ్యలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉన్నాయి. వాటిని హేతుబద్ధీకరిస్తాం. రాష్ట్రంలో కోరిన ప్రతి ఒక్కరికీ రూ.1,600 సబ్సిడీపై దీపం గ్యాస్ కనెక్షన్ ఇస్తాం. ఇప్పటికే 20 లక్షల కనెక్షన్లు మంజూరు చేశాం’’ అని ఈటల వివరించారు.
ఈ ఏడాది ధరలు మరింత పెరిగాయి: కాంగ్రెస్, ఎంఐఎం
మంత్రి ఈటల సభ ముందు ఉంచిన నిత్యావసర ధరల పట్టిక వాస్తవ విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. 2015తో పోల్చితే 2016లో ధరలు మరింత పెరిగినా.. ధరల పట్టికలో మాత్రం పెరగనట్టుగా చూపారన్నారు. వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయికే కిలో చొప్పున సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యాన్ని మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తున్నారని, డబుల్ పాలిష్ ద్వారా సన్న బియ్యంగా మార్చి తిరిగి హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. సబ్సిడీ గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో గ్యాస్ కంపెనీల డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం మాత్రమే లభిస్తోందని, చక్కెర, గోధుమలు, కిరోసిన్, పామాయిల్ ఇతర నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయని ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ పేర్కొన్నారు. రేషన్ దుకాణాలపై నిఘా పెంచాల న్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 20-30 శాతం ధరలు పెరిగాయని, మధ్యతరగతి ప్రజలకు సైతం సబ్సిడీపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
దిగువ కోర్టు జడ్జిల విభజన షురూ
ఏపీ, తెలంగాణలోని దిగువ కోర్టుల న్యాయమూర్తుల విభజన ప్రక్రియను హైకోర్టు ప్రారంభించిందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. న్యాయమూర్తుల నుంచి ఆప్షన్లు కోరిందన్నారు. హైకోర్టు విభజనపై సభ్యులు ఎ.జీవన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, అజ్మీరా రేఖల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. హైకోర్టు విభజన జరపాలని గత రెండేళ్లుగా ఒత్తిడి చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్‌లో ఏపీ హైకోర్టు ఏర్పాటు కోసం తాత్కాలిక భవనం, మౌలిక వసతులను కల్పించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు.