
పోలీసుల పాత్ర భేష్
బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర ఎనలేనిదని బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత దలైలామా అన్నారు. నగరంలోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీని శనివారం సందర్శించిన దలైలామా పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. బీసీటీసీ కాంప్లెక్స్ ఆవరణలో మొక్కను నాటారు. కాంప్లెక్స్ ఆడిటోరియంలో 139 ఐపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్లు, 15 విదేశీ ట్రైనీలను ఉద్దేశించి దలైలామా ప్రసంగించారు. ఆధిపత్య ధోరణి విడనాడి కులమతాలకు అతీతంగా ఏకత్వం దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, మత సామరస్యానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
దేశ సమగ్రత కోసం కృషిచేసిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంటే అభిమానమ న్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో పోలీసుల పాత్రను ప్రశంసిస్తూ.. గత 50 ఏళ్లకు పైగా తనకు భద్రత కల్పిస్తున్నది పోలీసులేనని గుర్తుచేశారు. మానవ సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిం చుకోవాలని బౌద్ధగురువు సూచించారు. మనిషి ముందుగా తనను తాను తెలుసుకోవాలని, ఈ విషయంలో భారతదేశం ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. కరుణ, ప్రేమ, అహింస మార్గాల్లో నడవాలన్నారు. అనంతరం ఐపీఎస్ ప్రొబేషనరీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆధ్యాత్మిక గురువు ఓపికగా సమాధానమిచ్చి వారిలో ఉత్సాహాన్ని నింపారు. సరైన సమయంలో ఆధ్యాత్మిక గురువు తమ అకాడమీని సందర్శించారని డైరెక్టర్ శ్రీమతి అరుణ బహుగుణ పేర్కొన్నారు. ఆయన సందేశం కచ్చితంగా యువ పోలీస్ అధికారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
నేడు దలైలామా ఎథిక్స్ సెంటర్ శంకుస్థాపన
హైదరాబాద్ మాదాపూ ర్‌లోని హెటెక్స్ రోడ్డులో ‘దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్’ భవనానికి బౌద్ధ మతగురువు దలైలామా ఆదివారం ఉదయం 9 గంటలకు శంకుస్థాపన చేయను న్నారు. అనంతరం హైటెక్స్ ఓపెన్ ఎరినాలో 10 నుంచి 11.30 గంటల వరకు నైతికత, విలువలు అంశంపై ఆయన మాట్లాడతారు.